ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు
ఈ భూమిపై మానవుల్లా జన్మతీసుకున్న మనం… మన జీవితక్రమంలో ఎదురయ్యే సంఘటనల పట్ల మరి సమస్యల పట్ల సరియైన రీతిలో ప్రతిస్పందిస్తూ… వాటి నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తూ… ప్రతిక్షణం ఆత్మోన్నతిని పొందుతూనే ఉండాలి. ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం యొక్క మూల సిద్ధాంతాల పట్ల విశేషమైన అవగాహన తప్పక ఉండాలి.
1.ఆత్మసిద్ధాంతం: ఈ శరీరాన్ని మనం ఒక ‘రథం’ అనీ .. మరి అందులో ఉండే మనల్ని రథాన్ని తోలే రథికుడు అన్నారు. మనం ఈ శరీరంలో వుండి దానిని నడిపించే ‘ఆత్మస్వరూపులం’ అన్న సత్యాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. అన్ని మతాలు, మరి అందరు గురువులూ కూడా బోధించే సత్యం ఇదే.
2.జన్మ – పునర్జన్మ సిద్ధాంతం: అలాగే ఒక ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకుని కొన్ని అనుభవాల కోసం మొట్టమొదటిసారి ఈ భూమి మీద పుడితే… దానిని “జన్మ” అంటాం. అదే ఆత్మ మళ్ళీ మళ్ళీ రకరకాల వాసనలతో కూడి రకరకాల శరీరాల్లో జన్మలు తీసుకొంటూ రకరకాల కర్మలు చేస్తూ ఈ భూలోకానికి వస్తూ పోతూ ఉంటూంటే… వాటిని “పునర్జన్మలు” అంటాం. ఇదంతా కూడా ఆత్మ తన ఎదుగుదల కోసమే కావాలని సృష్టించుకునే ఒకానొక “ఆత్మప్రణాళిక”. ఇందులో తల్లి, తండ్రి, తోబుట్టువులు, భర్త, భార్య ఇంకా ఇతరత్రా బంధుగణం, స్నేహగణం మరి పరిసరాలూ… అన్నీ కూడా ఆత్మ తన ‘స్వ’ ఇచ్ఛ ప్రకారమే ఎన్నుకుంటుంది. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది కనుక ఒకటో, పదో, వందో మరి పది వందలో…ఎవరికి ఇష్టమైనన్ని జన్మలు వాళ్ళే తీసుకుంటారు. దీనినే మనం “జన్మ – పునర్జన్మ సిద్ధాంతం” అంటాం.
3.కర్మ – కర్మఫల సిద్ధాంతం: ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాక మనం చేసే ఏ రకమైన కర్మ అయినా వెంటనే తిరిగి మనం అదే ప్రతిఫలాన్ని పొందడమే… “కర్మ – కర్మఫల సిద్ధాంతం” అన్నమాట. కాబట్టి మనం ముందుగా కర్మ చేసే విధానంలోనే అత్యంత జాగరుకతతో ఉంటే… ఇక కర్మఫలితాన్ని గురించి బెంగపడనవసరం లేదు. అందుకే… ఈ “కర్మ – కర్మఫల సిద్ధాంతం” పట్ల మనం అత్యంత ఎరుకతో ఉంటూ… అన్నిరకాల హింసలనూ మానాలి… మరి శుద్ధ శాకాహారులమై విలసిల్లాలి.
4.పురోగమన సిద్ధాంతం: ఎప్పుడైనా, ఎక్కడైనా మరి ఏ క్షణమైనా కూడా ఆత్మకు పురోగమనమే కాని.. ‘తిరోగమనం’ అన్నది ఎన్నటికీ వుండదు.
సాధారణంగా మనం ఒక విద్యార్థికి ఒకానొక పరీక్షలో 20 శాతం మార్కులు వస్తే అతడు ‘ఫెయిల్ అయ్యాడు’ అనుకుంటాం. కానీ ఆ పరీక్షలో నూటికి 20 శాతం మార్కులు తెచ్చుకున్న ఆ విద్యార్థి .. “నాకు ఆ సంబంధిత సబ్జెక్టులో కనీసం 20 శాతం పరిజ్ఞానం వుంది; మరి నేను ఇంకా 80 శాతం తెలుసుకోవలసింది వుంది; అన్న జ్ఞానాన్ని పొందుతాడు. ఇలా అతడు తన గురించిన సంపూర్ణ అవగాహనను మరి జ్ఞానాన్నీ తాను పొందడం అన్నది ‘అపజయం’ ఎలా అవుతుంది?
కాబట్టి ఎవరైనా సరే… ఫలానా విషయంలో అపజయం అయ్యారు అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులంతా కూడా తమ తమ పిల్లల పట్ల ఇలాంటి మూర్ఖత్వాలను వదిలిపెట్టాలి. ఉదాహరణకు: సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదిలో అపస్వరాలు పలుకకుండానే … గొప్ప సంగీత విద్వాంసులయ్యారా? ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచీ ఒక్క ఆట కూడా ఓడిపోకుండానే… ప్రపంచ ఛాంపియన్ అయ్యాడా? అసలు ‘ఫెయిల్యూర్’ అన్న పదమే ఈ సృష్టిలో లేదు. అవన్నీ కూడా ఆత్మ పురోగమనానికి ఏర్పాటు చేయబడ్డ సోపానాలే.
5.యోగ సిద్ధాంతం: ఒకానొక విద్యార్థి ఒక పరీక్షలో 20 శాతం మార్కులు తెచ్చుకుని “ఆ సంబంధిత సబ్జెక్టులో నేను ఇంకా 80 శాతం తెలుసుకోవాలి” అన్న జ్ఞానాన్ని పొందాక … ఇక అతడు ఆ “చేరుకోవల్సిన దిశ”గా తన ప్రయత్నాలను మొదలుపెడతాడు. అందుకోసం కష్టపడి చదువుకుంటూ మరి ఇంకొంచెం అంటే … 30శాతం మార్కులు తెచ్చుకోగలిగితే అది అతడికి పురోగమనమే… మరి అలా పురోగమనం చెందుతూన్న విద్యార్థి ప్రతిరోజూ ధ్యానసాధన కూడా చేస్తూ ఉంటే… అతడిలోని పురోగమనానికి అడ్డుపడే ఆలోచలన్నీ తొలగిపోయి, విశ్వశక్తితో అతడి మెదడు యొక్క గ్రహణ సామర్థ్యం పెరిగి… అదే విద్యార్థి.. అంతే సమయంలో తక్కువ శ్రమతో రెట్టింపు ఫలితాన్ని.. అంటే 60 శాతం మార్కులను పొందుతాడు. ఇలా “ధ్యానసాధన అతడి పురోగమనాన్ని వేగవంతం చేస్తుంది” …. మరి దీనినే “యోగసిద్ధాంతం” అంటాం. నడిచి వెళ్ళేవాడు వాహన యోగం ద్వారా తన గమ్యాన్ని ఇంకా తొందరగా చేరుకున్నట్లు… ధ్యానయోగం ద్వారా మనం మన జన్మ ప్రణాళిక అమలులో ఉన్న అవరోధాలను సునాయాసంగా దాటుకుంటూ ఆత్మ పురోగమనాన్ని ఇంకా వేగవంతం చేసుకుంటాం.
6. అనేకానేక సిద్ధాంతం: ధ్యానం ద్వారా మనం సత్యశోధన మరి దైవశోధన చేస్తాం… మరి ఈ సృష్టిలో మనం వుంటోన్న ఈ ఒక్క భూలోకమే కాకుండా ఇంకా అనేకానేక లోకాలు ఉన్నాయనీ, అనేకానేక జీవులు ఉన్నాయనీ, అనేకానేక జ్ఞానాలు ఉన్నాయనీ, అనేకానేక కోణాలు ఉన్నాయనీ తెలుసుకుంటాం. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానపు సిద్ధాంతాల పట్ల చక్కటి అవగాహనతో కూడిన ఎరుకతో మన జీవితాలను గడుపుతూ ఉంటే… జీవితాలను గడుపుతూనే ఉంటే జీవితంలోని ఒక్కోక్షణం మనకు అందించే అద్భుత ఆనందాలను మనం ఆస్వాదించగలుగుతాం.