మూడు రకాల విద్యాదశ

 

“భూలోక పాఠశాలలో మనం మూడు దశలుగా ఎదుగుతాం. అందులో మొదటిది ‘ప్రాథమిక విద్యాదశ’ రెండవది ‘ప్రాథమికోన్నత విద్యాదశ’ మూడవది ‘ఉన్నత విద్యాదశ’.

‘ప్రాథమిక విద్యాదశ’ : ఇందులో మనం మూడు రకాల పాఠ్యాంశాలు నేర్చుకుంటాం.

  1. Non -killing దేనినీ చంపకూడదు : దేనినీ చంపే హక్కు మనకు లేదు. ప్రతి జీవికీ జీవించే హక్కు .. మరి మనలాగే ఎదిగే హక్కు వుంది కనుక ఆ హక్కును మనం హరించకూడదు. మూగజీవులను చంపతూ పోతే .. అందువల్ల చిందే ప్రతి రక్తపు బొట్టుకు తగిన మూల్యం మనం చెల్లించాల్సిందే .. తప్పదు. ఆ బాకీ తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే .. కర్మచక్రంలో తిరిగి తిరిగి ఇరుక్కోవాల్సిందే .. తస్మాత్ జాగ్రత్త!
  2. Non – violence హింస చేయకూడదు : తనకన్నా బలహీనమైన వారి మీద చాలామంది తమ ప్రతాపం చూపిస్తారు .. అందుకు ఉదాహరణ .. భర్త భార్య మీద చూపించే అధికారం .. మరి పిల్లల మీద తల్లితండ్రులు చూపించే హింస.
  3. Non – Interference ఇతరుల విషయంలో జోక్యం కూడదు : ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం ఎంతమాత్రం సరికాదు. ఎవరి చేష్టాక్షేత్ర స్వాతంత్ర్యాన్ని కూడా హరించే హక్కు మనకు లేదు. ప్రతివారికీ వారి వారి ఆశలు, కోరికలు వుంటాయి కనుక వాటిల్లో జోక్యం చేసుకుంటే వారి బ్రతుకులతో పాటు, మన బ్రతుకులు కూడా నరకప్రాయం అవుతాయి; ఇదంతా కూడా ప్రాథమిక జీవన విద్యాభ్యాసం! “ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత మిడిల్ స్కూల్ అంటే మాధ్యమిక పాఠశాలలో చేరాలి. భూలోకంలో ఇది రెండవ దశ! ఇందులో రెండు బాగాలున్నాయి. 1. ధ్యానం చెయ్యడం 2. మధ్యేమారం.
  1. ధ్యానం చెయ్యడం : మన గురించి మనం తెలుసుకోవడానికి ధ్యానం చెయ్యాలి. ‘మనం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాం? మన జీవితలక్ష్యం ఏమిటి?’ అన్న ప్రశ్నలు అన్నింటికీ సమాధానమే ధ్యానసాధన. క్రమం తప్పని ధ్యానసాధన వల్ల మనలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది.
  2. మధ్యేమార్గం : జీవితంలో అన్ని విషయాలలోనూ మధ్యేమార్గంలో జీవించాలి. ‘అతి’ దేనిలోనూ పనికిరాదు. అతిగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం కాకుండా, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా, మితంగా ఉండాలి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ కదా!

“మాధ్యమిక విద్య తర్వాత ఉన్నత పాఠశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలి. ఈ ఉన్నత పాఠశాలలో కూడా రెండు దశలు ఉన్నాయి.

  1. బోధిసత్ దశః తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తన దగ్గరకు వచ్చిన వారికి బోధించేవాడు బోధిసత్వుడు. నేర్చుకోవాలని తపనపడేవారు ఆయన దగ్గరకు వెళ్ళాలే కానీ మన దగ్గరకు ఆయన రాడు.
  2. బుద్ధత్వం – బుద్ధుడు : తాను తెలుసుకున్న జ్ఞానాన్నీ అనుభవాన్నీ ప్రతి ఊరికీ వెళ్ళీ అందరికీ పంచేవాడు, బోధించేవాడు బుద్ధుడు. బుద్ధత్వం వారిని ఒక చోట వుంచదు. “నేను పొందుతూన్న, పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలి” అన్నది వారి ఆశయం. అందరినీ ధ్యానవంతులుగా, జ్ఞానవంతులుగా చెయ్యాలన్నదే వారి జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే వారి జీవిత పరమావధి.

“ఈ విధంగా భూలోక పాఠశాలలో తమ విద్యను ముగించుకున్న అంశాత్మలు తమ జ్ఞానాన్ని అనుసరించి ‘పాసు మార్కులు’ సాధించిన వారు భువర్లోకం చేరితే, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారు .. ఉదా : 50 శాతం మార్కులు పొందిన వారు జనాలోకం… మరింత ఎక్కువ శాతం సాధించిన వారు మహాలోకం, ఆపై 99 శాతం వరకు సాధించిన వారు తపోలోకం… నూటికి నూరుశాతం సాధించిన వారు సత్యలోకం చేరుతారు.

సత్యలోకం చేరిన వారిలో కొంతమంది .. తిరిగి ఈ భూమిపైకి వచ్చి ఉపాధ్యాయులుగా బోధిస్తారు .. మరి ఇలా రావడం అన్నది వారివారి ఇష్టప్రకారం వుంటుంది” అని తెలియజేశారు.