ఒకానొక బుద్ధుడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. ఒకానొక సగటు మనిషి
ఒకానొక “బుద్ధుడు” అంటే .. అందరూ సగటు సామాన్య మనుష్యులే అని తెలుసుకున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. తనలో ఏ ప్రత్యేకతలూ లేవు అని తెలుసుకున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. ఇతరులు అందరిలో కూడా ఏ ప్రత్యేకతలూ లేవు అని తెలుసుకున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. తాను ఒక శూన్యం అని తెలుసుకున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. ఇతరులు అందరూ కూడా శూన్యం అని తెలుసుకున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. తాను ఒక మహాశూన్యం అని తెలుసుకున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. ఇతరులను కూడా ఒక మహాశూన్యం అని తెలుసుకున్నవాడు
* * *
ఒకానొక “బుద్ధుడు” అంటే .. తన శరీరంతో తాను తాదాత్మ్యం చెందినవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. తన రోజువారీ సాధారణ దినచర్యల కార్యక్రమాలతో తాదాత్మ్యం చెందినవాడు
“రోజువారీ సాధారణ దినచర్యలు” అంటే .. “తినడం” .. “కూర్చోవడం” .. “చూడడం”.. “మాట్లాడడం” .. “వినడం” .. “పనిచెయ్యడం” .. “చదవడం” .. ఇంకా ఇంకా
“walk while you are walking .. Eat while you are eating”
అన్నాడు కదా జగద్విఖ్యాతమైన ఒకప్పటి బుద్ధుడు
* * *
ఒకానొక “బుద్ధుడు” అంటే సమాజపరంగా తన కర్తవ్యకర్మల్లో తాదాత్మ్యం చెందివున్నవాడు
ఒకానొక “బుద్ధుడు” అంటే .. సకలప్రాణకోటితో తాదాత్మ్యం చెందివున్నవాడు
“బుద్ధుడు” అన్న పదానికి మారుపేరే .. “తాదాత్మ్యత”
తన శూన్యంతో తాను తాదాత్మ్యత ; తన బాహ్యంతో తాను తాదాత్మ్యత
* * *
అసలు “సంఘర్షణ” అన్న పదానికి తావులేనిదే .. “బుద్ధత్వం”
“భయం” .. “దుఃఖం” .. “సంశయం” .. “ఆవేశం” అన్న పదాలకు తావులేనిదే “బుద్ధత్వం”
అనుక్షణం మార్పు చెందుతూ ఉండే .. రూపాంతరం చెందుతూ ఉండే .. బాహ్యాంతరాలను
చిరుమందహాసంతో గమనించే శాశ్వతమృదుగంభీరతత్వమే .. “బుద్ధత్వం”
* * *
బుద్ధుళ్ళందరికీ వందనాలు
ఇప్పటికే బుద్ధుళ్ళు అయినవాళ్ళందరికీ వందనాలు
ఇక ముందు బుద్ధుళ్ళు కాబోయేవాళ్ళందరికీ వందనాలు
చిత్తగించవలెను
ఇట్లు
ఇప్పటి ఒకానొక బుద్ధుడు