ఒక్కగానొక్క కోరిక
నా ఒకే ఒక్క కోరిక .. నా ఒకే ఒక్క కర్తవ్యం .. నా ఒకే ఒక్క లక్ష్యం .. నా ఒకే ఒక్క కల ..
అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం
కేవలం “తిండి” కోసం జంతుజాతినీ, పక్షి జాతినీ, మత్స్యజాతినీ పరమక్రూరంగా చంపుకుని తింటూన్న
మానవాళి యొక్క ఆటవిక, వికృత, అనాగరిక చర్యలను చూసి కుమిలిపోతోంది భూమాత
ప్రస్తుతం భూమండలం ఒక మహానరకకూపంలా వుంది
ఇది ఒక మహాస్వర్గధామంలా అయితీరాలి
శోకతప్తురాలయిన భూమాతని స్వాంతన పరచడం
భూమాత బిడ్డలుగా మనందరి బాధ్యత
హిమాలయసదృశంగా పెరిగిపోతోన్న మానవాళి యొక్క అమానుష రాక్షస చర్యలనుంచి
భూమాత ను పరిరక్షించడమే నా/మన ఉద్యమ లక్ష్యం
ఇందకుగాను .. ధ్యానప్రచారాన్ని ముమ్మరం చేయాలి
ఎందుకంటే
“ధ్యానం” ద్వారా మాత్రమే ప్రతిఒక్కరూ తమలోని దివ్యత్వాన్ని తెలుసుకుంటారు
మరి “దివ్యజ్ఞానప్రకాశం” పొందినవారే హింసాత్మక క్రూరచర్యలనుంచి బయటపడతారు
“సకల జంతుజాతి అంతాకూడా మనలాంటి ఆత్మస్వరూపాలే” అని మానవులు గుర్తించి తీరాలి
ఆత్మశాస్త్ర అవగాహన ద్వారా తమ బుద్ధిని సరిచేసుకున్న విచక్షణాజ్ఞానమూర్తులు మాత్రమే
మరి కేవలం ఆహారార్థం ఇతర జంతువులను చంపి తినే మూర్ఖుల బుద్ధిని సరిచేయగలుగుతారు
మీరు ‘ధ్యానయోగులు’ కావచ్చేమో కానీ .. మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను
మీరు ‘దివ్యదృష్టి కలవారు’ కావచ్చేమో కానీ .. మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను
మీ ‘ కుండలినీ ’ జాగృతమై ఉండవచ్చేమో కానీ .. మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను
మీ దగ్గర కోటానుకోట్ల లోకాల జ్ఞానం ఉండవచ్చేమో కానీ .. మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను
మీరు సూక్ష్మలోకవిహారులు కావచ్చేమో కానీ .. మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను
మీరు ఆత్మశాస్త్రకోవిదులు కావచ్చేమో కానీ .. మీరు శాకాహారులైతేనే నేను మీకు మోకరిల్లుతాను
అసలు మీరు ఎవరన్నదీ నాకు ముఖ్యం కాదు ..
“మీరు జంతుసోదరులపట్ల దయతో కూడిన మిత్రులు/హితులు అవునా, కాదా ?” అన్నదే నాకు ముఖ్యం
నా/మన భూమాత తన జంతు బిడ్డల ప్రళయ భీకర చావు రోదనల నుంచి విముక్తి చెంది
చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదించేంతవరకు నా/మన “అహింసా-ధర్మ ఉద్యమం” ఆగదు
ఈ భూమిమీది చిట్టచివరి మనిషి కూడా శాకాహారి అయ్యేంతవరకు నేను ఇక్కడే ఉంటాను
అదే నా దృఢ నిర్ణయం