‘ఆధ్యాత్మికత’ యొక్క అంతిమ అర్థం .. సేవ చేయడమే
ఆత్మస్వరూపులం అయిన మనం అంతా కూడా కాలానికి అతీతంగా జీవిస్తున్న వాళ్ళం! ఆత్మకు కాలం, దూరం, వేగం, సన్నివేశం, సంఘటనలు, ప్రాంతాలు అన్న పరిమితులు ఉండవు. ‘మమాత్మా సర్వభూతాత్మాం’ అన్న వేదవాక్యాన్ని అనుసరించి సర్వశక్తివంతులమైన మనం ఆత్మస్వరూపుల్లా అంతటా, అన్ని చోట్లా, అన్ని దేశాల్లో వున్నాం!
ఇంతగొప్ప శక్తివంతులమైన మనం ఎప్పటికప్పుడు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాదుల ద్వారా స్వీయ ఆత్మస్థితి పట్ల ఎరుకను కలిగివుండాలి. ఇదంతా కూడా ‘ఆధ్యాత్మికత’ అనబడుతుంది .. మరి ఆధ్యాత్మికత ద్వారా తన స్వస్థితిని తాను తెలుసుకున్నవారే సమాజంలో నిజమైన సేవ చేయగలుగుతారు.
‘సేవ చేయడం’ అన్నది మామూలు విషయం కాదు!! అసలు ‘ఆధ్యాత్మికత’ యొక్క అంతిమ అర్థం .. సేవ చేయడమే! అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేయడమే! ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకోకుండా సమస్యల వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారికి ఆధ్యాత్మిక సేవ చేయడం .. ధ్యాన-జ్ఞానాదుల ద్వారా వారి ఆత్మ నిజస్థితిని వారికి తెలియజేయడం అన్నది సేవల్లోకెల్లా .. అత్యుత్తమమైన సేవ!
ప్రస్తుతం ఇక్కడ ఈ భూలోకంలో ఉంటూ మనం తెరముందు పాత్రలను అభినయిస్తున్నాము. తెరవెనుక ఇంకా భువర్లోకం, సువర్లోకం, తపోలోకం, సత్యలోకం, జనాలోకం మరి అనేకానేక ఇతర నక్షత్రలోకాలు ఎన్నెన్నో ఉన్నాయి. భూలోకంలో మన నాటకం పరిసమాప్తి అయ్యే వరకు మనకు తెరవెనుక లోకాలనుంచి మార్గదర్శకాలూ, సూచనలూ అందుతూనే వుంటాయి. వాటిని అందుకునే సత్తా మనలో వుంటే మన జీవితాలు ధన్యం అవుతాయి! అలా కొన్ని సార్లు మనం తెరముందు నాటకం వేస్తాం .. మరి కొన్ని సార్లు తెరవెనుక కూడా వుండి .. తెరముందు నాటకం వేసే వాళ్ళకు మార్గదర్శకాలూ సూచనలూ, ఇస్తూంటాం.
ఇలా తెరముందూ, తెరవెనుకా మనం ఇష్టం వచ్చినట్లు ఉండడం అన్నది అంతా కూడా మన బుద్ధివికాసాన్ని బట్టి జరుగుతూ వుంటుంది. ధ్యానం స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాదుల ద్వారా బుద్ధిని ఎప్పుడూ పదునుగా ఉంచుకుంటూ వుండాలి. అతిగా మాట్లాడే అలవాటును మానుకోవాలి. అందుకు విశేషంగా ‘మౌనాభ్యాసం’ చేయాలి.
పరిపక్వతతో మాటలను ఎంచుకుని మరీ మాట్లాడాలి. ప్రతిక్షణం జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. ‘మనం అంతా కూడా స్వీయ అంగీకారంతోనే ఈ భూమ్మీద దైవ ప్రణాళికను అమలు పరచడానికి వచ్చిన దేహాధారులం’ అన్న ఎరుకతో వుండాలి.
అనేక జన్మలుగా మాంసాహారాదుల వంటి హింసాత్మక చర్యల వల్ల మలిన పరచబడి వున్న మన ప్రాణమయకోశాన్ని ధ్యానశక్తితో శుద్ధిపరచుకోవాలి. అప్పుడే మన ‘దివ్యచక్షువు’ ఉత్తేజితమై భూతలాన్ని దాటి భూత, భవిష్యత్ వర్తమానాలను చూసుకోగలిగే శక్తిని పొందగలుగుతుంది. దివ్యచక్షువు దర్శనాల ద్వారా ఎప్పుడయితే మనకు గతం సంపూర్ణంగా అవగతమై భవిష్యత్తుపట్ల చక్కటి అవగాహన వస్తుందో అప్పుడు మనకు వర్తమానం ‘ఒక బహుమతి’ గా మిగిలిపోతుంది.
ఇవన్నీ కూడా కేవలం ప్రాపంచిక జీవితంలో మునిగి ఉన్నంత కాలం మనకు అర్థం కావు. మూడు పూటలా తింటూ, ముప్పొద్దులా నిద్రపోతూ, పిల్లల్ని కనిపెంచడమే జీవిత పరమార్థం అనుకోవడం మూర్ఖత్వం! అందుకోసమే కష్టపడి ఇంతదూరం రానవసరం లేదు! బుద్ధిజీవులమైన మనం ఇంతకంటే ఉన్నతంగా జీవించగలగాలి.
“అందుకే జీసస్ క్రైస్ట్ .. ‘Man cannot live by bread alone’ అన్నారు. అంటే” ఈ శరీరానికి కేవలం ముప్పొద్దులా తిండేకాదూ .. విశ్వశక్తి కూడా చాలా అవసరం” అని తేల్చి చెప్పారు. ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస వుంచి ఆ విశ్వశక్తిని గ్రహించినప్పుడే మన ఆత్మచైతన్యం మేల్కొంటుంది; మరి అప్పటినుంచే మనం జీవించడం మొదలవుతుంది. సకల చరాచర జగత్తులో మన మనుగడకు మూలం శ్వాస మాత్రమే కనుక .. శ్వాసను ఆధారం చేసుకునే మనం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాం.
“రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా ధ్యానమే వుంటుంది .. మరి అన్ని పరిష్కారాలకూ ధ్యానమే దారి చూపుతుంది. ఇరవై సంవత్సరాలుగా మనం చేస్తోన్న అకుంఠిత ధ్యానప్రచారం వల్ల ప్రపంచాన్ని ఆవరించుకుని వున్న అజ్ఞానం అనే మాయ చీకట్లు తొలిగిపోయి .. ఆత్మ సూర్య ప్రకాశం వెలుగులను విరజిమ్మబోతోంది! ఈ విజయ ప్రస్థానంలో ప్రతి ఒక్క పిరమిడ్ భాగస్వామ్యం ఎంతో అభినందించదగింది!”