ఓంతత్సత్– III
“ అసఫలతలు” … “అపజయాలు”
“FAILURES” … “DEFEATS”
“సఫలతలు” … “జయాలు, విజయాలు”
“SUCCESSES” … “VICTORIES”
* * *
తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే
అసఫలతలు “అసఫలతలు” కానవసరం లేదు !
సఫలతలు “సఫలతలు” కూడా కాకపోవచ్చు !
* * *
ప్రతి ఒక్కరికీ “భూతల జీవితం” అన్నది
ఒక మహా “కలగూరగంప” …
సాధారణంగా ఊర్ధ్వలోకాలలో వుండే మనం …
“సఫలతలు”, “అసఫలతలు” .. ఈ రెండింటినీ
సమాన పాళ్ళల్లో స్వయానా ఎంచుకుని మరీ భూలోకానికి వస్తాం …
వాటిని యధాతధంగా అనుభవించడానికి !!
ఆ యా భిన్న, భిన్న పరిస్థితులలో.. ఆ యా భిన్న, భిన్న అనుభవాల మూలకంగా ..
సకల సుగుణాలనూ ఆత్మగతంగా సంతరించుకునే అవకాశాలు
వుంటాయి గాబట్టి .. ఆ యా విశిష్ట పరిస్థితులను
ఎంచుకోవడం జరుగుతుంది.
భౌతిక-తల జీవితంలో అపజయాలు సంభవించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సుగుణాలను ..
ఉదా : “ఓర్పు” – “సహనం” – “శాంతం” – “మౌనం” … లాంటి గుణాలను ..
సంతరించుకోగలిగే ప్రయత్నాలనూ, అభ్యాసాలనూ చేయాలి ;
అలా కాకుండా అపజయాలలో అధికంగా కృంగిపోతే
అప్పుడే అది మనకు నిజమైన “అపజయం” అవుతుంది ..
భౌతిక-తల జీవితంలో ఎదుర్కొనే అపజయాలకు మనం అధికంగా కృంగకపోతే ..
మరి ద్విగుణీకృత ఉత్సాహంతో మన కర్తవ్యాల పట్ల మనం పునరంకితం అయితే ..
అప్పుడు అది “నిజమైన విజయం” గా భాసిస్తుంది.
అదేవిధంగా,
భౌతిక-తల జీవితంలో విజయాలు లభ్యమయినప్పుడు ..
… మరి కళ్ళు నెత్తికి ఎక్కితే …
అప్పుడు కూడా అది మనకు “నిజమైన అపజయం” అవుతుంది.
ఒకానొక “భౌతిక-తల విజయం” అన్నది కూడా
మన ఆత్మ-తల అజ్ఞానం ద్వారా
“ఆత్మ యొక్క అంతరంగ అపజయం” గా మరి దిగజారిపోయే
ప్రమాదం పుష్కలంగా వుంది !
భౌతిక-తల విజయాలు వచ్చినప్పుడు
“అహంకార రాహిత్యం” అన్న సుగుణాన్ని అభ్యాసం చేయడం నేర్చుకోవాలి
అలాగే ప్రత్యర్ధుల నేర్పరితనాన్ని కూడా అభినందించగల సుగుణాన్ని సంతరించుకోగలిగితే
మరి అంతకన్నా గొప్ప “అంతరంగ విజయం” అన్నది వుండబోదు !
“భౌతిక-తల అపజయం” అన్న దానిలో కూడా
“ఆత్మ యొక్క అంతరంగ విజయం” అన్నదానిని అత్యంత సులభంగా సాధించవచ్చు ..
ధ్యాన, ఆధ్యాత్మిక సాధనల ద్వారా !
ఆత్మ యొక్క అంతరంగ విజయమే నిజమైన విజయం
ఆత్మ యొక్క అంతరంగ అపజయమే నిజమైన అపజయం
ఓం తత్ సత్