కరుణ చూపించేవాడే బుద్ధుడు

 

మన తోటివారితో కలిసి మనం జీవిస్తూ వుంటాం. ప్రక్కవారి మొహం చూస్తూ రోజంతా గడిపేస్తాం. అందరినీ అభినందిస్తాం. అందరితోనూ కూడి వుంటాం. పైకి ఎంతో బాగున్నట్లుగా అనుకుంటాం. అయితే లోపల మాత్రం అశాంతి, అభద్రత, “ఏదో తెలియని వెలతి “’ తో జీవిస్తూ వుంటాం. ఒక ఇంగ్లీష్ సామెత వుంది:

“Face is the index of the Mind”

“ముఖం మన మనస్సు యొక్క దర్పణం. ముఖకవళికలు మన మనఃస్థితిని తెలియజేస్తాయి. నోటిలోని మాటలు మన ఆత్మస్థితిని తెలియజేస్తాయి. ముఖకవళికలను బట్టి మనలోని ఆందోళనలు, గందరగోళం తెలుసుకోవచ్చు.

“ఎవరినైనా కదిలించి ‘ఏమిటి స్వామీజీ?’ అని పలుకరిస్తే ‘ఏమోనండి! ఏదో దిగాలుగా వుంది; నాకు ఏమీ తెలియడం లేదు’ అని ముఖాన్ని దీనంగా పెడతారు. అయితే, ధ్యానం చేసేవారి ముఖారవిందాలు మాత్రం కళకళలాడుతూ వుంటాయి! ప్రతిరోజూ పిరమిడ్‌లో ధ్యానం చేసే వారి ముఖం ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ వుంటుంది! పిరమిడ్ మాస్టర్ల ముఖాలు చూసి చెప్పవచ్చు, వారు ఎంతో సంతోషంగా వున్నారో!

“గౌతమబుద్ధుడి నాలుగు ఆర్య సత్యాలలో .. ‘ప్రపంచం అంతా దుఃఖంలో వుంది’ అన్నది ప్రథమ సత్యం. ప్రపంచంలోని మనుష్యుల ముఖాలలో దుఃఖం తాండివిస్తోంది. ఎవరి ముఖం చూసినా దుఃఖమే, అశాంతే! ఎవరి ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. అందుకే ‘ప్రపంచం అంతా దుఃఖమయం’ అని ఆయన అన్నారు.

“గౌతమ బుద్ధుడు అయిదు రకాల దుఃఖాల గురించి చెప్పాడు

* రోగం వస్తే దుఃఖం
* ముసలితనం వస్తే దుఃఖం
* చావు వస్తే దుఃఖం
* మనకు కావలసినవి మన దగ్గరకు రాకపోతే దుఃఖం
* మనకు అవసరం లేనివి మన దగ్గరే వుంటే దుఃఖం 
ఇలా ఐదు రకాల దుఃఖాల గురించి ఆయన వివరించాడు.

“ఎవరైతే ధ్యానం చెయ్యరో, ఎవరైతే శాకాహారులు కారో, ఎవరైతే శాకాహారులు కారో, ఎవరైతే హింసాతత్త్వంలో వుంటారో… వారందరికీ ఈ అయిదు రకాల దుఃఖాలు తప్పనిసరిగా వుంటాయి. అయితే ధ్యానం చేసేవారికీ, ఆత్మజ్ఞానులకూ ముసలితనం రాదు, ఇచ్ఛామరణమే వుంటుంది .. కనుక దుఃఖం అస్సలు వుండదు. దుఃఖానికి కారణం అత్యాశ. ‘ఉన్నది సరిపోలేదు’ అనుకునేవారు లేనిది కోరుతారు, అత్యాశకు పోతారు. అత్యాశే దుఃఖానికి హేతువు. అత్యాశకు మూలం అజ్ఞానం, అవిద్య.

“పిరమిడ్ మాస్టర్లు అవిద్యనుంచి విద్యలోకీ .. తృష్ణ నుంచి తృష్ణరాహిత్యంలోకీ … దుఃఖం నుంచి ఆనందంలోకీ వచ్చినవారు. ధ్యానం చేసి దుఃఖాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నవారే పిరమిడ్ మాస్టర్లు! పిరమిడ్ మాస్టర్లకు అభినందనలు! ‘చావు లేదు’ అని తెలుసుకుని జ్ఞానంలో జీవిస్తున్నవారే పిరమిడ్ మాస్టర్లు! మాస్టర్ అయితే నో దుఃఖం, నో అత్యాశ, నో తృష్ణ!

“చిన్నప్పుడు చదువుకున్నాం ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ అని. ఎన్నో యుద్ధాలు చేసి, ఎందరినో కొల్లగొట్టి, ఎంతో సంపద మూటకట్టుకుని అలెగ్జాండర్ తన స్వంత దేశానికి వెళ్తూ మర్గమధ్యంలో పర్ష్యాలో ఆగి ‘ఇక్కడ చూడదగినవి ఏమైనా వున్నాయా?’ అని అడుగుతాడు. ‘అయ్యా! ఇక్కడికి దగ్గరలో ఒక ముసలివాడు వుంటున్నాడు; ఓ చెట్టు క్రింద కూర్చుంటాడు. నాలుగు దిక్కులలో నాలుగు కుక్కలు కూర్చుని వుంటాయి. అతను చాలా గొప్పవాడు’ అని చెబుతారు.

“ఓహో ! అలాగా! అయితే వెళ్ళి వాడిని తీసుకురండి’ అంటాడు. ఊరిపెద్దలు ‘ఆయన రారండి! మనమే వెళ్ళాలి’ అంటే అలెగ్జాండర్ వెళ్తాడు. ఆయన తెరిపార చూసి ‘ ఏమిటి నీ గొప్ప?! ఏం సాధించావు జీవితంలో?’ అని అడుగుతాడు. ‘నేను ఎన్నో యుద్ధాలు చేసాను; ఎంతో గడించాను, ఆ గడించిన దానితో నా రాజ్యానికి వెళుతున్నాను’ అంటాడు. ‘వాటితో ఏం చేస్తావు?’ అని ఆ ముసలివాడు అడుగుతాడు. ‘జీవితంలో కావలసినవన్నీ అనుభవించి బాగా ఆనందంగా వుంటాను; అంటాడు అలెగ్జాండర్! అందుకు ఆ ముసలివాడు ‘ ఏ యుద్ధాలు చెయ్యకుండానే మరి నేను ఆనందంగా వున్నాను; మరి నువ్వు ఏదీ అనుభవించకుండా, నీదేశం కూడా చేరకుండా మార్గమధ్యంలోనే శరీరాన్ని వదిలి వేస్తావు!’ అంటాడు. ఆయన పేరే డయోజినీస్.

“మై డియర్ ఫ్రెండ్స్! చివరి క్షణంలో అలెగ్జాండర్‌కి జ్ఞానోదయం అయింది. అందుకే డయోజినీస్ జోస్యం చెప్పిన విధంగా మార్గమధ్యంలోనే రోగగ్రస్థుడై, అవసానదశకు చేరి, తాను చనిపోయినప్పుడు శవపేటకలోంచి తన రెండు చేతులు పైకి చూపించి ‘అలెగ్జాండర్ దరిద్రుడిగా చనిపోతున్నాడు’ అని తన సందేశం ఇచ్చాడు. జీవితపు చివరి అధ్యాయంలో జ్ఞానోదయం కలగడం కాదు – ఇప్పుడు ‘ఈక్షణం’ లోనే జ్ఞానోదయం కలగాలి!

“ఒకానొక బుద్ధుడు అయినవాడే ‘ఈ క్షణమే ఆఖరి క్షణం’ అని జీవిస్తాడు. రక్తపాతం సృష్టించిన అలెగ్జాండర్‌ను, అపరిమితంగా హింస చేసినవాడిని ‘గ్రేట్’ అని ఎలా అంటాం? ‘ది వర్‌స్ట్’ అంటాం!

కనుక ధ్యానం మాత్రమే గ్రేట్! పిరమిడ్ మాస్టర్ మాత్రమే గ్రేట్! ఒకానొక బుద్ధుడు అయినవాడే గ్రేట్!”