భగవద్గీత 3-42 “ ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః | మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః || ” |
పదచ్ఛేదం
ఇంద్రియాణి – పరాణి – ఆహుః – ఇంద్రియేభ్యః – పరం – మనః – మనసః – తు – పరా – బుద్ధిః – యః – బుద్ధేః – పరతః – తు – సః
ప్రతిపదార్థం
ఇంద్రియాణి = ఇంద్రియాలు ; పరాణి = బలమైనవి ; ఆహుః = అంటారు ; ఇంద్రియేభ్యః = ఇంద్రియాల కన్నా; పరం = ఉత్తమమైనది ; మనః = మనస్సు ; మనసః, తు = మనస్సు కంటే ; పరా = శ్రేష్ఠం ; బుద్ధిః = బుద్ధి ; తు = మరి ; యః = ఎవరు ; బుద్ధేః = బుద్ధి కన్నా ; పరత = అత్యంత గొప్పదైన ; సః = అతడే ఆత్మ
తాత్పర్యం
“ ఇంద్రియాలు బలమైనవి; ఇంద్రియాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి గొప్పది; బుద్ధి కన్నా అత్యంత గొప్ప దానినే ‘ఆత్మ’ అని అంటారు. ”
వివరణ
“ ఆత్మ ” అనే నిప్పు మీద వున్న ..
ఇంద్రియాలు .. మనస్సు .. బుద్ధి అనే
మూడు నివురుల్లో, మూడు ఆవరణల్లో, మూడు పొరల్లో వున్నాం మనం !
ఇంద్రియాలకు మనస్సు మూలమైనది !
మనస్సు చెప్పినట్టు ఇంద్రియాల వెంట పరిగెడతాం !
మనస్సు కన్నా బుద్ధి బలమైనది !
మనస్సు కన్నా “ సంఘమిచ్చిన బుద్ధి ” బలమైనది !
సంఘమిచ్చిన బుద్ధిని బట్టే మన మనః చేష్టలు ఉంటాయి.
అయితే వీటన్నింటికంటే గొప్పది ‘ ఆత్మ ’ !
“ఆత్మబలం” ముందర సంఘం తలవంచి తీరుతుంది !