సమ్యక్ + కల్పన = సంకల్పం
ఆలోచన వేరే, సంకల్పం వేరే.
ఏదైనా ఒక భావనే ‘ఆలోచన’ అనబడుతుంది. ‘ఆలోచన’ అన్నది ఒకానొక మహాస్పందన లేదా ఒకానొక మనోప్రతిస్పందన. ‘ఆలోచలనల యొక్క ప్రవాహం’ అన్నది మనస్సు యొక్క నైజం.
ఒకానొక ఆలోచన మళ్ళీ మళ్ళీ ఆలోచింపబడి బలవంతమై సుదృఢమైనప్పుడు దానిని ‘సంకల్పం’ అని అంటాం. సంకల్పం అన్నది కార్యాచరణకు ‘ఎల్లలు’ అవుతుంది. ఏదేని కార్యానికి కారణభూతం అవుతుంది.
ఏ కార్యానికైనా సంకల్పమే కారణం. కార్యాచరణ పూర్తి అయ్యేంతవరకు ఏ కార్యానికైనా మధ్యలో భంగం వాటిల్లకూడదు. సంకల్పం ‘ఏకధార’ గా వుండాలి. సంకల్పానికి మధ్యలో భంగం కలిగించేదే ‘వికల్పం’. వ్యతిరేక ఆలోచనల సమూహమే ‘వికల్పం’. మధ్య మధ్య వికల్పాలు లేకుండా సంకల్పం చివరి వరకు కొనసాగితే ‘ సంకల్ప సిద్ధి ‘ కలుగుతుంది. అంటే, సంకల్పం ఒకానొక ‘ భౌతిక వాస్తవం ‘ గా మారుతుంది. కారణం ఒకానొక ‘కార్యం’ గా మారుతుంది.
ఆలోచించకుండా సంకల్పాలు పెట్టుకోకూడదు. తర్కించి, యోచన చేసి, విచారించి సర్వామోదయోగ్యమైన దానినే సంకల్పంగా పెట్టుకోవాలి. తర్కించి యోచన చేయని, నిశితంగా విచారించని, సర్వామోదయోగ్యం కాని సంకల్పాలు సర్వవేళలా అనర్ధదాయకాలు.
అనుకున్న సంకల్పాలకు తగిన శక్తిని చేకూర్చేదే రోజులో కొన్ని గంటలు చిత్తవృత్తి నిరోధ స్థితి – యోగ స్థితి.
‘సమ్యక్ ‘ అంటే ‘ పరిశుద్ధి ‘ ; ‘ కల్పన ‘ అంటే ‘ ఆలోచనల సమూహం ‘. మూఢులకు సంకల్పాలు వుండవు. వికల్పాలే ఎక్కువ. ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి వేస్తారు. సంకల్ప వికల్పాల సమాన మిశ్రమమే ‘ సగటు మానవుడు ‘. సంకల్పాల ఆధిక్యతే, వికల్పాల క్షీణతే ‘ ఉత్తముల జీవన విధానం ‘ .
“సంకల్ప సిద్ధి”
1. | శ్వాస మీద ధ్యాస | = | అన్నదే | = | సరియైన ధ్యానం |
2. | వయస్సు ప్రకారం ప్రతిసారీ అన్ని నిమిషాలు | = | అన్నదే | = | సరియైన వ్యవధి |
3. | శ్వాస మీద ధ్యాస + సరియైన వ్యవధి + ప్రతిరోజు | = | ద్వారానే | = | ఆనాపానసతి అభ్యాసం |
4. | ఆనాపానసతి అభ్యాసం | = | ద్వారానే | = | మనో నిశ్చలత/ప్రాణశక్తి విజృంభణ |
5. | మనో నిశ్చల్త/ప్రాణశక్తి విజృంభణ | = | ద్వారానే | = | దివ్యచక్షువు |
6. | దివ్యచక్షువు + స్వాధ్యాయం + సజ్జన సాంగత్యం | = | ద్వారానే | = | జ్ఞానచక్షువు |
7. | జ్ఞానచక్షువు | = | ద్వారానే | = | అనుక్షణ జాగరూకత |
8. | అనుక్షణ జాగరూకత | = | ద్వారానే | = | సంకల్పశక్తి |
9. | వికల్ప రహిత సంకల్ప ఏక ధార | = | అన్నదే | = | సంకల్పశుద్ధి |
10. | సంకల్పశుద్ధి + సంకల్ప శక్తి + పరిశ్రమ | = | ద్వారానే | = | సంకల్ప సిద్ధి |