సరస్వతీ జ్ఞానమే అసలైన సంపద
“జాతస్య హి ధృవో మృత్యుః
ధృ వం జన్మ మృతస్య చ ” అన్నది భగవద్గీత సందేశం.
ఈ రోజు మనం ఇక్కడ కైలాసపురికి వచ్చాం ! వచ్చినపని అయిపోగానే రేపు మళ్ళీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతాం ! ” వెళ్ళిపోతాం ” అని తెలిసే ఇక్కడికి వచ్చినట్లు .. ఛస్తామని తెలిసే మనం ఈ భూమ్మీద పుడతాం ! ” రాక-పోక ” .. ” పోక-రాక .. ” పుట్టుట-చచ్చుట ” .. ” చచ్చుట-పుట్టుట ” .. ఇలా రకరకాల అందమైన అనుభవాలతో కూడిన ఒక చక్కటి బృహత్ ఆటను ఆడుతూంటాం !
ఈ కైలాసపురికి వచ్చాక మనకు ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా ఉండదు .. పైగా కొన్ని ఇబ్బందులు కూడా వుంటాయి. అయినా ఆత్మానుభవం కోసం మరి అనుభవజ్ఞానం కోసం వాటిని లెక్కచేయకుండా వచ్చాం.
కాబట్టి కష్టాలు లేనిదే లాభాలు రావు ! No Pain .. No Gain ! బిడ్డ పుట్టాలంటే తల్లి తొమ్మిది నెలలు మోసి అనేక రకాల నొప్పులు భరించాలి. కన్నాక బిడ్డను చూసుకుంటే ఎంతో సంతృప్తి !
అలాగే ఎక్కడో నక్షత్రలోకాల్లో హాయిగా ఉంటోన్న మనకు భూమ్మీద పుడితే బాల్యం, ముసలితనం, రోగం-రొష్ఠు, కళ్ళు పోవడాలూ, కాళ్ళు వంగడాలూ, కర్మలు – కర్మఫలాలూ, చావు అన్నీ అనుభవించాల్సి వుంటుందని తెలుసు. అయినా పుడతాం ! ఎందుకంటే అనుభవజ్ఞానం అనే లాభం ఈ భూమ్మీద మాత్రమే దొరుకుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఇదంతా మనకు తెలియజేస్తుంది.
ప్రతిరోజూ మనం ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఔపోసన పడుతూ వుండాలి. “ఉదరపోషణార్థం” మూడు పూటలా శరీరానికి భోజనం అందించినట్లు “ఆత్మపోషణార్థం” దానికి సదా జ్ఞానాన్ని అందిస్తూనే వుండాలి. శరీరధర్మ శాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే “శరీర నిర్వహణ ” సులభసాధ్యమైనట్లు .. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఆ ధర్మాలన్నీ ఎరుకలో ఉంచుకుంటే ” ఆత్మ నిర్వహణ ” అన్నది సులభమైపోతుంది.
“పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ” ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రాన్ని అనేకానేక రంగాలకు అనుసంధానం చేయడానికే అంకితమై పనిచేస్తుంది ! ఆత్మ అనుభవజ్ఞాన సంపన్నులు అయిన లెడ్‌బీటర్, మేడమ్ బ్లవాట్‌స్కీ, అనీబిసెంట్, టోర్కోమ్ సెరాయ్‌డారియన్, లోబ్‌సాంగ్‌రాంపా, పీటర్ రిఛెలూ, నీల్ డొనాల్డ్ వాల్ష్, బార్బరా హ్యాండ్ క్లో, బార్బరా మార్సిన్యాక్ వంటి మరెంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మనకు అందించిన ఇతరలోక సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తోంది.
రూత్ మాంట్‌గోమెరీ, సిల్వియా బ్రౌన్, జేన్ రాబర్ట్స్ వంటి ఆధ్యాత్మిక మహాశాస్త్రజ్ఞులు అందించిన ఛానెలింగ్ సమాచారాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని ధ్యానం చేసి మన మనస్సును శూన్యపరచుకుని ఉన్నతలోక వాసులకు ఛానెల్స్‌లా మారాలి. అప్పుడు వారంతా కూడా తమ పరేంగిత ప్రజ్ఞను మనకు అందిస్తూ మన ద్వారా ఈ లోకాన్ని ఒక బృందావనంలా తీర్చిదిద్దుతారు.
ధ్యానానికి నిలయమైన “కైలాసపురి” అనే ఈ మహాశక్తి క్షేత్రంలో తీర్చిదిద్దబడి వున్న ఈ ప్రాంగణం పేరు “శ్రీ సరస్వతీ సభావేదిక” ! “సరస్వతి” అంటే “చదువు” .. అంటే ” జ్ఞానం ” !
సరస్వతి ప్రక్కన వుంటే .. బ్రహ్మ చేసే సృష్టి మరింత అద్భుతంగా ఉన్నట్లే .. ఎంతగా మనం స్వాధ్యాయం చేస్తూ వుంటే అంతగా మనలోని బ్రహ్మతత్త్వం బహిర్గతం అవుతూ వుంటుంది. ఎంతగా మనలోని బ్రహ్మతత్త్వం బహిర్గతం అవుతే .. అంతగా మనం సహసృష్టికర్తలుగా ఎదుగుతాం !
ఇలా “పైలోక వాసులతో కలిసి పనిచేస్తూ మనం ఆ లోకానికీ ఈ లోకానికీ మధ్య వారధుల్లా ఈ బృహత్కార్య నిర్వహణ కోసమే ఇక్కడ జన్మతీసుకున్నాం ” అన్న సత్యాన్ని ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకుని జీవించాలి. అప్పుడే మనం ఈ భూమ్మీదకు వచ్చిన పని సార్థకం అవుతుంది.