అద్భుతమైన ఆనంద సూత్రం
మనిషి ఎప్పుడూ ఆనందంగా జీవించాలి. అతడు ఓ ఆనందవాహిని కావాలి. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా ధ్వంసం చేసి, “నేను గొప్ప విజయాన్ని సాధించాను” అనుకుని తన తిరుగు ప్రయాణంలో తన స్వంత దేశానికి చేరువవుతున్న సమయంలో ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తీసుకుంటూ “ఈ చుట్టుప్రక్కల చూడడానికి వింతలు విశేషాలు ఏమున్నాయి?” అని అడిగినప్పుడు “ఏమి లేవు స్వామి. అయితే ఒక ముసలి వాడున్నాడు. ‘డయోజనీస్’ అని; చాలా గొప్ప యోగి అట. అతను గొప్ప ఖ్యాతి ఉన్నవాడు” అన్నారు. “అయితే అతన్ని నా దగ్గరికి తీసుకురండి చూస్తాను, మాట్లాడతాను” అన్నాడు అలెగ్జాండర్. “అతను మీ దగ్గరికి రాడండి; మీరే అతని దగ్గరకు వెళ్ళాలి” అని భటులు వెళ్తారు గానీ, అతన్ని తీసుకు రాలేకపోతారు. అప్పుడు అలెగ్జాండరే ఆ డయోజనీస్ దగ్గరకే, ఆ వృద్ధుడి దగ్గరకే వెళ్ళి “డయోజనీస్, ఏమిటి నీ ప్రత్యేకత?” అని అడిగితే నేను నీకు సమాధానం చెప్పే ముందు నేను నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను – “నువ్వు ఈ రాజ్యాలన్నీ ఎందుకు కొల్లగొట్టావు?”
“నేను ఇంటికి వెళ్ళి ఆ తర్వాత చక్కగా, హాయిగా జీవిస్తాను ఈ సిరి సంపదలతో, ఈ పేరు ప్రతిష్టలతో” అని అంటాడు.
“అలెగ్జాండర్, అవన్నీ ఏమీ లేకుండానే నేను చిన్నప్పటి నుంచే ఆనందంగా వున్నాను” అని డయోజనీస్ అంటాడు “ఆనందంగా జీవించడం కోసమే నువ్వు ఇవన్నీ సంపాదించావు. ఇంత కష్టపడ్డావు. అయితే నేను చిన్నప్పటి నుంచే ఆనందంగా జీవిస్తున్నాను. అదే నా ప్రత్యేకత” అంటాడు డయోజనీస్.
అలాగే చాలామంది చుట్టుప్రక్కల వాళ్ళు డయోజనీస్ దగ్గరికి వెళ్ళి “మీరు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు?” అని ప్రశ్న వేసారు. అప్పుడు డయోజనీస్ ఇలా చెప్పాడు – “ప్రోద్దున లేవగానే నేనొక నిర్ణయం తీసుకుంటాను – ‘ఇవాళ నేను ఆనందంగా వుంటాను, ఏది ఏమైనా సరే’ అని దృఢంగా నిశ్చయించుకుంటాను. కనుక ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతున్నాను – ఎండైన, వానైనా, కలిమిలేములైనా, భోజనం దొరికినా దొరక్కపోయినా – ఆనందంగానే వుంటాను ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాను గనుక. అదే విధంగా ప్రతిరోజూ ప్రొద్దున్నే నిర్ణయం తీసుకుంటాను. కనుకనే సదా ఆనందంగా ఉండగలుగుతున్నాను” అని జవాబు చెప్పాడు.… ఇది అద్భుతమైన ఆనంద సూత్ర్రం. కనుక ఒకదాన్ని నిర్ణయించుకుంటే, అంటే “నేను సంగీతం నేర్చుకోవాలి” అని నిర్ణయం తీసుకున్నప్పుడు సంగీతం నేర్చుకుంటావు. ఆ నిర్ణయం లేనప్పుడు “వస్తుందో రాదో? చేస్తామో? చేయ్యలేమో?” అని అనుకుంటే సంగీతం కానీ, ఇంకొకటి కానీ ఏదీ ఎప్పటికీ రాదు గాక రాదు. రానే రాదు.
“నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా జీవించాలి” అని కృతనిశ్చయుడవైతే ఎప్పుడూ ఆనందంగా వుంటావు. మనం ‘నిర్ణయం తీసుకున్నాం’ కనుక ఆనందంగా వుంటాం. అదీ సూత్రం. నిర్ణయం తీసుకోవాలి – “నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆనందంగా వుంటాను” అనుకోవాలి.
“ఆనంద శాస్త్రం”
ఏది చేస్తే మనం ఎప్పుడూ ఆనందంగా వుంటామో, అదే చెయ్యాలి. ఆనంద శాస్త్రం గురించి ప్రక్కవాడి నుంచి అడిగి తెలుసుకోవాలి. ఏది చేస్తే ఆనందంగా వుంటుందో చెప్పే శాస్త్రాన్నే చదవాలి. గ్రంథాలను చదవాలి. చక్కటి సజ్జన సాంగత్యం చెయ్యాలి. అందరి దగ్గరి నుంచి అన్నీ తెలుసుకుంటూ వుండాలి.
ఏది చేస్తే ‘ఎప్పుడూ’ ఆనందంగా వుంటామో తెలుసుకోవాలి. కొంతమంది చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు ఆడుతూ వుంటారు. కానీ “Honesty is the Best Policy” అనేదే తెలియదు. ఎప్పుడూ కూడా త్రికరణశుద్ధిగా వుండడమే సరియైన ‘ఆనంద సూత్రం’ …. చెప్పిందే చెయ్యాలి. చేసిందే చెప్పాలి. ఆలోచించిందే చప్పాలి. ‘మనసా, వాచా, కర్మాణా’ ఏకంగా వుండడమే త్రికరణశుద్ధి కలిగి వుండడం అంటే. త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే ఆనందం లభ్యం. కనుక, నువ్వు ఆనందంగా ఉండాలంటే త్రికరణశుద్ధి కలిగి వుండు. నీకు తెలియనిది మాట్లాడకు, తెలిసిందే మాట్లాడు. మాట్లాడిందే ఆచరించు. ఆచరించిందే మాట్లాడు. మనస్సులో ఒకటి పెట్టుకుని, నోటితో ఇంకొకటి మాట్లాడకు. ఇవన్నీ ఆనంద సూత్రాలు.
ఎవరైతే నిజాయితీగా వుంటారో, త్రికరణశుద్ధి కలిగి వుంటారో వారే నిత్యం ఆనందమయులుగా వుంటారు. ఇదే ఆనంద సూత్రం, కనుక ఇదే పిల్లలకు చెప్పాలి. ఇదే పెద్దలకూ చెప్పాలి. ఇదే బంధువులకీ చెప్పాలి. ఇదే శత్రువులకూ చెప్పాలి.
ప్రతి విద్యనూ అందరికీ నేర్పిస్తూ వుండాలి. అందరికీ నేర్పించడంలోవుండే ఆనందం అంతా ఇంతా కాదు. నేను ఎంతోమందికి ధ్యానం నేర్పించాను. ధ్యానం నేర్పించడంలో వుండే ఆనందం ఎంతో అది నాకే తెలుసు. ధ్యాన విద్యను నేర్పించని వాళ్ళకు ఆ ఆనందం తెలియదు. అందరూ ధ్యానంలో గంటలు గంటలు కూర్చుని, మళ్ళీ నా దగ్గరకు వస్తూ, “నాకు ఫలానా అనుభవం వచ్చింది”; “నాకు తలనొప్పి పోయింది”; “నాకు కృష్ణుడు కనిపించాడు”; “నేను గత జన్మలు చూసుకున్నాను” అని చెబుతూంటే ఎంత ఆనందమో… ధ్యానం ద్వారా వచ్చే ఆనందం కన్నా, ధ్యానం చేయిస్తే వచ్చే ఆనందం వెయ్యిరెట్లు గొప్పది.