కూర్చోవడం నేర్చుకోవాలి
“ఈ ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పని .. కదలకుండా కూర్చోవడం! చెయ్యవలసిన అతి ముఖ్యమైన పని కళ్ళు రెండూ మూసుకోవడం! ఇవే అన్నింటికన్నా పెద్ద పనులు!
“జీవితంలో పరుగెత్తడం కాదు .. కూర్చోవడం నేర్చుకోవాలి! అక్కడా ఇక్కడా పరుగెత్తడం ఆపి కదలకుండా ఒకచోట స్థిరంగా కూర్చోవాలి. రమణ మహర్షి అరుణాచలం కొండెక్కి కదలకుండా కూర్చున్నాడు! మరి మనకేం పొయ్యేకాలం?! మనమెందుకు .. కనీసం మన ఇంట్లో కూడా కదలకుండా కూర్చోలేకపోతున్నాం?!
“జీవితంలో పరుగెత్తడాలు మానెయ్యాలి. దేనికి మన పరుగు? ఎక్కడికి మన ప్రయాణం? ఏం సాధించాలని తాపత్రయం? పేరు ప్రఖ్యాతుల కోసమా? పదవీ వ్యామోహాల కోసమా? డబ్బూ సంపదల కోసమా? వీటి కోసమా మన పరుగులు? ఇవేనా జీవితంలో మనం సాధించవలసిన విజయాలు? ఇందుకోసమేనా మనం కష్టపడి జన్మ తీసుకుంది. ఎవరికి చూపించాలి మనం ఈ గొప్పలన్నీ!
“నిజానికి ఈ ప్రపంచంలో మనం వేటికోసమైతే పరుగులు తీస్తున్నామో .. అవన్నీ కూడా ఇక్కడి కాలక్షేపాలు మరి ఇక్కడి టైమ్ పాస్ బఠానీలు! వీటి వెనుక పరుగులు తీస్తూ మన అమూల్యమైన జన్మను వ్యర్థం చేసుకోవడం కేవలం మన మూర్ఖత్వం! ఇక్కడ మనం జన్మ తీసుకున్నది ధ్యానంలో మన కాలాన్ని వినియోగం చెయ్యడం కోసం! హఠయోగాలూ, విచిత్ర విన్యాసాలూ మానేసి శరీరాన్ని కులాసాగా ఉంచుతూ విశ్రాంతిగా కూర్చుని ధ్యానం చెయ్యడం కోసం. మన వైపు మనం పరుగు తీసి మనలోని దైవత్వాన్ని మేల్కొలుపుకోవడంకోసం మరి మనల్ని మనం భగవంతుళ్ళుగా గుర్తించుకోవడం కోసం!
“ధ్యానం తెలియని వాళ్ళు గుళ్ళూ గోపురాల చుట్టూ పరుగులు తీస్తూ ‘అక్కడ విగ్రహంలోనే భగవంతుడున్నాడు’ అనుకుని భ్రమపడుతూంటారు. ‘దేవుడెక్కడా?’ .. ‘దేవుడెక్కడా?’ అని దేవుళ్ళాడుతూ .. ‘తామే దేవుళ్ళం’ అన్న సంగతిని మరచిపోతూంటారు. కాబట్టి బాహ్య ప్రపంచంవైపు పరుగులు తక్షణం ఆపెయ్యాలి! స్థిరంగా కూర్చోవాలి.
“అందరూ ‘ధ్యానమహాచక్రం వెళ్ళి ఏం నేర్చుకుని వచ్చారు?!’ అని అడిగితే ‘కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చోవడం నేర్చుకుని వచ్చాం’ అని చెప్పండి. ‘దేవుళ్ళ కోసం పరుగెత్తడాలు మాని .. సర్వం ఖల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని అనుభవపూర్వకంగా తెలుసుకుని వచ్చాం’ అని చెప్పండి. ‘మాకు ఏ దేవుడూ అవసరం లేదు .. మాకు మేమే కావాలి; మా శ్వాసే మా గురువు; మా గురువు పైనే ధ్యాస పెట్టాం .. మమ్మల్ని మేం తెలుసుకున్నాం’ అని చెప్పండి.
“మనం ఏ కాశీకీ వెళ్ళం .. ఏ హిమాలయాలకూ వెళ్ళం. మన ఇంట్లోనే మనం హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడి దగ్గర స్వయంగా మనం నేర్చుకున్నది ఇదే! ఇది నేర్చుకున్న వాళ్ళెవరికీ ఇక మళ్ళీ ఈ భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. స్కూల్ చదువు అయిపోయాక పై చదువుల కోసం కాలేజీకి వెళ్ళిపోయినట్లు వాళ్ళ పనంతా ఇక ఇతర ఉన్నత లోకాలలోనే ఉంటుంది.
స్వర్గలోకాన్ని అనుభవించేశాక .. పుణ్యం క్షీణించినపుడు ‘మళ్ళీ ఇంకేదో తెలుసుకోవాలి’ అన్న కోరికతో మనుష్యలోకానికి వచ్చి పుడతాం! ఇక్కడ కూడా కోరికలతో అటూ ఇటూ పరుగులుపెడుతూ కాలక్షేపం చేస్తాం. మనలోని దైవత్వాన్ని మరచిపోయే దుఃఖంతో బాధపడుతూ ఉంటాం!
“ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి కదలకుండా స్థిరంగా కూర్చోవడం నేర్చుకుంటామో అప్పుడిక మన దుఃఖం మటుమాయం అవుతుంది. మన ఏడుపు గల్లంతవుతుంది. త్రయీ ధర్మాన్ని అనుసరించి మన శరీరాన్నీ, మనస్సునూ మరి ఆత్మనూ ఆవరించి ఉన్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా ధ్యానంలో చక్కగా తీర్చుకుంటాం. అలా కోరికలు తీరిన వెంటనే మనం హాయిగా ఈ లోకాన్ని వదిలేసి .. ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి పైలోకాలకు వెళ్ళిపోతాం!