ధ్యాన వేమన
అడవి గాచిన వెన్నెల
వేమన ‘తెనుగు అడవి‘ న గాచిన ఆత్మ వెన్నెల
వేమన గురించి తెలియందెవ్వరికి?
వేమన గురించి తెలిసిందెవ్వరికి?
“యోగివేమన” అని కీర్తిస్తున్నాం
కానీ, మనం స్వయంగా ‘యోగి’గా ఉత్సుకించం
వేమన సూక్తులను స్కూళ్ళల్లో పాఠ్యాంశాలుగా చేస్తాం.
కానీ, ఆయన చూపిన వెలుగులో మాత్రం మనం జీవించం
అయితే, “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్” ధ్యానులకు వేమన ఆదర్శమూర్తి
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మాస్టర్లకు
వేమన స్వంత గూటి పక్షి
ఆస్తిక మూర్ఖులైన మూర్తి పూజా దురంధరులకు
వేమన సింహస్వప్నం, గొంతులో పచ్చి వెలక్కాయ
మత ఛాందసులకూ, సాంఘిక దురాచారులకూ ఆయన ఓ కొరడాదెబ్బ
మెట్టవేదాంత ‘పండిత’ శిఖామణులకు అతను ఓ కొరకరాని కొయ్య
ప్రతి పిరమిడ్ ధ్యానీ ఓ ‘వేమన’అవ్వాలి.
అదే విధంగా నిర్భయంగా నిస్సంకోచంగా
సత్యాన్ని కుండబ్రద్దలు కొట్టినట్లు చాటిచెప్పాలి
ఎవ్వరివద్దా వంగనవసరం లేదు, ఎవ్వరినీ లెక్కపెట్టనవసరం లేదు
మూర్ఖులను మూర్ఖులుగా అభివర్ణించాల్సిందే
మూర్ఖులను తిరస్కరించి తక్షణం చెత్తబుట్టలో పడేయాల్సిందే
అసత్యాన్ని తరమాల్సిందే…
ఇకనైనా మేల్కొందాం,ఇకనైనా తప్పులను సరిదిద్దుకుందాం.
ఇంతవరకూ అడవిగాచిన ఈ ‘వేమవెన్నల’ ను
ఇప్పుడైనా అన్ని గ్రామాలకూ తీసుకువెళ్దాం,అన్ని నగరాలలో ప్రచారం చేద్దాం
“కురు సద్బుద్ధిం మనసే వితృష్ణాం” అన్నాడు కదా శంకరాచార్యులు అంటే, “సద్బుద్ధితో మనస్సును తృష్ణా రహితంగా చేసుకో“ అని సలహా.అదే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి బోధ కూడా.
మనస్సులోని మర్మం
“మనసులోన నున్న మర్మమంత ఎఱింగి
స్థిరము చేసి యాత్మ తేటపఱచి
ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి?
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “మర్మాలు తెలుసుకుని మనస్సునూ, బుద్ధినీ, స్థిరపరచి ఆత్మను తెలుసుకున్నవానికి ఇతర గౌరవాలక్కర లేదు, ఇక మిగిలివుంది కేవలం శరీరాన్ని నిల్పే ప్రయాసే “
వ్యాఖ్య:స్వామి చిన్మయానంద నిరంతరం శ్రమించి బోధ చేసినట్లు, ఉన్నవి నాలుగు –
(1)శరీరం (2)మనస్సు (3)బుద్ధి (4)ఆత్మ
“మనస్సులో ఉన్న మర్మము అంతా“అంటే “బుద్ధి“, “ఆత్మ“అన్నమాట
ఆ “బుద్ధి” సంగతి కూలంకషంగా ఎరిగి దానిని “స్థిరం” చేయమని వేమన వారి ఒక్కగానొక్క సూచన
తద్వారా “ఆత్మను తేటపరచి“, అంటే “ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి”అన్నమాట
“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే” అంది గీత, అంటే, “బుద్ధి ఉన్న జ్ఞానవంతుడికే ‘మాం‘ అంటే ‘ఆత్మ’గురుంచి తెలిసేది” అని.
“ఘటము” అంటే బౌతిక శరీరం. “ఘటము నిల్పవలయు” అంటే, “కర్మలు కేవలం స్థూల శరీర క్రియలు నిల్పటం కోసమే” స్థూల శరీరక్రియలు జీవనం జరుపుకోవాలి.
అంతేకానీ “ఘనతలు” లేనిపోని “పదివీ వ్యామోహాలు” దేనికి?
లేనిపోని “పెద్దరికాల” జోలి ఎందుకు?
ముఖ్య గుణం
“మూడు గుణములందు ముఖ్య గుణంబును
తెలియలేనివాడు వెలయునెట్లు?
భ్రమల బడినవాడు బలువెఱ్ఱి యగు ధర –
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: సత్త్వరజస్తమో గుణాలలో ముఖ్యమైన సత్త్వాన్ని యెరిగినవాడే ఉత్తముడు;అలా కాకుండా భ్రాంతికి లొంగినవాడు పెద్ద మూర్ఖుడు.
వ్యాఖ్య: ఈ భూప్రపంచంలోని మనుష్యులందరూ మూడు గుణాలలో ఏదో ఒక గుణానికి చెందినవారే. మొదటి రకం వారు– తమోగుణ ప్రధానులు. తరువాతి వారు రజోగుణ ప్రధానులు. మూడవ రకం వారు సాత్త్విక గుణ ప్రధానులు. ఇంకా ఎదిగినవారిని శుద్ధసాత్వికులుగా ప్రధానులుగా నిర్గుణులుగా పేర్కొనవచ్చు.
శరీరకామాలతో నిత్యం వర్తించేదే తమోగుణం. మనోవాంఛల ప్రకారం వెర్రిత్తిపోయేదే రజోగుణం. వివేక విచక్షణలతో, ఆత్మ జ్ఞానంతో వెలిగిపోయేదే సత్త్వగుణం.
ఈ “మూడుగుణాలలో సత్త్వమే ముఖ్యమైనది; దానినే పెంపొందించుకోవాలి“,అని తెలియనివాడు, తెలుసుకోడానికి ఇష్టపడనివాడు జీవితంలో ఏ విధంగా అభివృద్ది చెందగలడు? సత్త్వగుణం శూన్యమై, తమో, రజో గుణాలలో కొట్టుకు పోయేవాడూ నిశ్చయంగా భ్రమలలో పడినవాడే. క్రమ క్రమంగా అతడు పలు వెర్రి అయి తీరుతాడు.
తమో, రజో గుణాలే జీవుని అధమ స్థితులు. జీవుని అల్పత్వానికి సూచికలు.జీవుడిని సుదూరం చూడనీయవు. అనేకానేక భ్రమలలో పడవేస్తాయి. కనుక ఈ రెంటినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి.
మహనీయమూర్తి
“యాత్రపోయినాతడెన్నాళ్ళు తిరిగిన
భద్రమైన ముక్తి పదవి గనడు!
మనసు నిల్పునతడు మహనీయమూర్తి రా
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “స్థిరమైన మనస్సు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలకు తిరిగినా ప్రయోజనం లేదు; స్థిరచిత్తం కలవాడే ఉత్తమోత్తముడు.”
వ్యాఖ్య:అసలు తీర్థయాత్రల ప్రయోజనం వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉండే ఆత్మజ్ఞానుల, యోగుల సందర్శనం చేసుకుని వారి ద్వారా సత్యాసత్యాల గురించీ, సరైన జీవన విధానం గురించీ, మోక్షమార్గం గురించీ క్షుణ్ణంగా తెలుసుకోవడం అయితే కాలక్రమేణా ఈ పద్దతి మరుగుపడి కేవలం రాతిమూర్తుల దర్శనంగా మారాయి– నేటి కలికాలపు “తీర్థయాత్రలు“.
“మనస్సు నిల్పునతడు” అంటే “ఎవడైతే తమ మనస్సును చిత్తాన్ని చక్కగా నియంత్రం చేయగలడో“, “ఎవడైతే ఆలోచనలను శూన్యం చేసుకుని ఎప్పుడంటే అప్పుడు నిరామయ స్థితిలో వుండగలడో, అతడు” అన్నమాట.నిజమైన ముక్తిమార్గం మనస్సు నిల్పడమే. శంకరాచార్యులవారు “నిశ్చలచిత్తం జీవన్ముక్తిః” అని అన్నారు గదా.
“ఎన్నాళ్ళు తిరిగినా భద్ర ముక్తిపదవి గనడు” అన్నాడు వేమన అంటే, “ఈ తిరుగుడు అంతా ఒట్టి బూడిదలో పోసిన పన్నీరే” అని. తనను తాను అర్థం చేసుకున్నవాడే మహిలో మహానీయ మూర్తి. తనను తాను అర్థం చేసుకోవడం అనేది తన మనస్సును తాను నిల్పినప్పుడే సాధ్యం.
యోగి
“సకల జీవములందు సమముగా నుండెడి
యతని క్రమము దెలియు నతడే యోగి;
అతడు నీవె యనుట నన్యుడు కాడయా–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా:సర్వప్రాణులనూ సమానంగా చూసే పద్ధతి ననుసరించేవాడే ‘యోగి’–‘అతడే ఇతడు’. అందరూ ఒక్కటే, అందరూ సమమే, వేరు వేరుగా ఎవ్వరూ లేరు“
వ్యాఖ్య: “విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః” అని గీతలో వుంది.
అంటే, “పండితుడైనవాడు విద్యావినయాలుండి సద్గుణరాశి అయిన బ్రాహ్మణుడితోగానీ, ఆవు,ఏనుగులాంటి సత్త్వగుణ ప్రధానులను గానీ,కుక్కలాంటి మధ్యమ జాతి వారితో కానీ, కుక్కమాంసం తినే చండాలురతో గానీ,అందరితోనూ సమంగానే ప్రవర్తిస్తాడు: అందరినీ సమంగానే చూస్తాడు“అని.
సకల జీవకోటినీ సమదృష్టితో వీక్షించేవాడే యోగి. ఏ ప్రాణీ మరో ప్రాణికన్నా ఉత్కృష్టం కాదు.అలాగే, ఏదీ నీచజన్మ కూడా కాదు. ఏ ప్రాణికి వున్న ప్రత్యేకత, అర్థం, అందం దానికి వున్నాయి.
అలాగే, అందరు మానవులూ ఒక్కటే
“సర్వంఖల్విదం బ్రహ్మ“, “అహం బ్రహ్మాస్మి‘ “తత్త్వమసి“…
…అనే మహా వాక్యాలకు వేమన ఇచ్చిన భాష్యమే “అతడే నేను“, “నాకంటే అన్యుడు లేడు” అన్నవి. ఈలాంటి సత్యాల స్వానుభవం ఉన్నవాడే “యోగి“.
సాధు సాంగత్యం
“సాధు సాంగత్యమమరిన శాంతమమరు;
శాంతమమరిన జిత్తంబు శక్యపడును:
శక్యపడిన మనంబె యొసంగు బరము–
పరము గాంచిన శివుడన బరగు వేమ!”
తా: “మంచి వారి స్నేహమున శాంతం, దాని వల్ల మనో నిశ్చలత కలుగుతుంది;మనో నిశ్చలత వలన పరలోక సాన్నిధ్యం కలుగుతుంది; పరం అనుభవిస్తూనే మానవుడు ‘శివుడు’అవుతాడు.”
వ్యాఖ్య:సత్యస్థితులైనవారే సాధువులు; వారు మాస్టర్లు; ఆత్మజ్ఞాన విశారదులు:వారు సత్త్వగుణ సంపన్నులు., భూలోకాన్ని బాగుపరచవచ్చిన సత్యలోకవాసులు. అలాంటి వారి సాన్నిహిత్యం లభిస్తే, అద్దానిని వెంటబడి సమకూర్చుకుంటే, మన మనస్సు వెంటనే స్వాంతన చెందుతుంది.ప్రశాంతమవుతుంది.
ఒకసారి శాంతమయితే ఇక ఆ మనస్సును, ఆ చిత్తాన్ని పూర్తిగా మన శక్యం చేసుకోవచ్చు,అంటే తీర్చిదిద్దుకోవచ్చు; అంటే పూర్తిగా స్వాధీనపరచుకోవచ్చు.వశపరచుకోవచ్చు. ఆ విధంగా స్వాధీనపడిన చిత్తం వెంటనే “పరసాధనం” గా,మోక్ష కారణం“గా మారుతుంది.
అందుకే, శంకరాచార్యుల వారు “త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా” అన్నారు. అంటే “మూడు లోకాలలోనూ– అంటే భూ, భువర్, సువర్ అనే మూడు లోకాలలోనూ– కూడా సజ్జన సాంగత్యం అన్నదే దుఃఖసాగరాన్ని ఈదడానికి ఉపయొగపడే ఏకైక ఉపకరణం” అని. కనుకనే, “సజ్జనసాంగత్యం”అన్నది.ఆధ్యాత్మిక విద్యా సముపార్జనా విధానాలైన ధ్యాన, స్వాధ్యాయాలతో సరియైన స్థానం సంతరించుకుంది.
అంతరంగం
“అంతరంగమందు ననువుగా శోధించి,
తలప దలప ముక్తి తనకు గలుగు;
బాహ్యరంగమందు భాషింప దెలియునా?
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “అంతరంగంలో మనస్సును నిల్పి నిరంతరం సాధన కొనసాగిస్తూ వుంటే ముక్తి కలుగుతుంది; బయటి మాటల వలన ప్రయోజనం ఏముంది?”
వ్యాఖ్య: “ముక్తి” అనేది బాహ్య వస్తువు కాదు, అది పూర్తి అంతరంగంలో క్రమక్రమంగా దృగ్గోచరం అయ్యే వస్తువు.
అంతరంగంలో “అనువు” గా అంటే “తెలివి” తో, శోధిస్తేనే అది లభ్యం (ఏమిటా“అనువు?” అదే ఆనాపానసతి, “శ్వాస మీద ధ్యాస“) ఆ విధంగా “తలప,తలప”అంటే “సాధన చేయగా చేయగా“, “ముక్తి తనకు గలుగు” అంటే “ఎవరికి వారికేముక్తి“గలుగుతుంది” అని. “ముక్తి” అంటే ఆత్మానుభవంతో కూడిన బుద్ధివికాసం; “ముక్తి” అంటే పూర్ణ దుఃఖరాహిత్య స్థితి.ఇక అన్నింటినీ ఆనందించే స్థితి. అన్నింటి ద్వారా పురోగతిని అనుభవించే స్థితి. అంతా తనలోనే చూసుకునే స్థితి. అంతటిలో తననే చూసుకునే స్థితి. సృష్టి రహస్యాలన్ని ఆకళింపు చేసుకున్న స్థితి. ఇది ఒక్క రోజులో దొరికే నిర్దిష్టమైన వస్తువు కాదు. ఆమరణపర్యంతం అంతరంగ సాధనతో వికసించే సుగంధ పుష్పం.
“సాధన” అనేది ఈ విధంగా వుండగా బాహ్యంలో ఊరికే శుష్కవేదాంత భాష్యాలు భాషిస్తే ఏం లాభం? వాక్– జ్ఞానం వల్ల లోపల సమాధి స్థితి లభ్యమవుతుందా? “పారాయణా పరంపరల వల్ల ఆత్మజ్ఞానం సిద్ధించదు” అన్నమాట
అంధుని రీతి
“అది యొకటి తెలిసి యాదిని మదినిల్పి–
అది పాయువాడు నభవుడగును;
అది పాయకున్న అంధుని రీతిరా–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “మోక్షమునకు మూలమైన బ్రహ్మ స్వరూపము తెలుసుకుని, మనస్సును నిల్పి బ్రహ్మత్త్వమును పొందవచ్చును; ఆ విధంగా బ్రహ్మత్త్వాన్ని పొందని మనుజుడు గ్రుడ్డివానితో సమానుడు“
వ్యాఖ్య: “ఆది” అంటే “మూలచైతన్యం“. అంటే సకల సృష్టికీ జీవ చైతన్య రాసుల సృష్టికీ మూలం అయినది. ఆ “ఆది” ఒక్కటి తెలిస్తే చాలు, ఆ “ఆది” యే“నేను“, ఆ తెలుసుకోవడంలోనే సర్వరోగ నివారణలూ, సర్వభోగ లాలసతలూ,సర్వజ్ఞాన సముపార్జనలూ వున్నాయి
ఆ “ఆది” ని అనుభవపూర్వకంగా స్వంతం చేసుకుని, దానిని పొందినవాడు“అభవుడు“. అంటే ఆ “పరమశివు” డే అవుతాడు. “అ+భవ“= “నాశనం లేని వాడు” అని అర్థం. ఆ ఒక్కటి లేకపోతే వాడు అంధునితో సమానం. అంటే,అన్నీ చుట్టూ వుండీ ఏమీ చూడలేని వాడు. ఏవీ ఆనందించలేని వాడు.
పుట్టుగ్రుడ్డివాడు అంగవైకల్యం లేని మనుష్యులకు ఎలాంటి వాడో, అలాంటివాడే మరి ఆత్మజ్ఞానం లేనివాడు యోగులుకు. పుట్టుగ్రుడ్డివాడు ఈ లోకపు అందచందాలను ప్రత్యక్షంగా చూసి ఆనందించే, అనుభవించే, యోగ్యత లేనివాడు.
అదే విధంగా, ఆత్మజ్ఞానం లేని అంధుడు కోటానుకోట్ల లోకాలతో నిండి వున్న బ్రహ్మండాన్నంతా ప్రత్యక్షంగా చూసి ఆనందించే, అనుభవించే యోగ్యత లేనివాడు.
ఒకడు చర్మచక్షువులు లేని అంధుడు – ఇంకొకడు దివ్యచక్షువు వున్నా వుత్తేజపరచని అంధుడు.
అతి, మోహం
“ఆలు బిడ్దలనుచు నతి మోహమున నున్న,
ధనము మీద వాంఛ తగిలి యున్న,
నట్టి నరుల కెల్ల నవని ముక్తియే లేదు–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా:భార్య (భర్త) పైనా, బిడ్డలపైనా వ్యామోహం, మరి ధనంపై ఆశ ఉన్నవారందరికీ మోక్షం లభించనే లభించదు.
వ్యాఖ్య: “ఆలుబిడ్డలు” లేదా “భర్త బిడ్డలు” వుండి తీరాలి. అయితే “అతి మోహం” అన్నది మటుకు పనికి రాదు.
“అతి సర్వత్ర వర్జయేత్” గదా, “అతి” అనేదే “మోహం” జీవితంలో ఏ ఒక్కదానిపై ఎక్కువ శ్రద్ధ,ఎక్కువ మక్కువ చూపించినా మిగాతావన్నీ చూసుకోవడానికి సమయమూ, శక్తీ ఎక్కడ వుంటాయి? ఒకటి ఎక్కువ అయితే మిగతావి తగ్గి తీరుతాయి.
ధనం మీద ‘తీవ్రవాంఛ’వుండరాదు. “అర్థం అనర్థం భావయ నిత్యం” అన్నారు కదా శంకరాచార్య. అలాగే “మూఢ!జహీహి ధనాగమ తృష్ణా; కురు సద్బుద్దిం మనసి వితృష్ణాం” అని కూడా అన్నారు కదా.
అంటే, “ధనం అనేది ఎప్పుడూ అనర్థానికే దారి తీస్తుంది; కనుక, ధనం ఎప్పుడూ‘రావాలీ‘,’రావాలీ‘, అనే తృష్ణను వదిలివేసేయి; చక్కటి సద్బుద్ధితో మనస్సును తృష్ణలేకుండా చేసుకో” అని.
ధనేషణ, దారేషణ, పుత్రేషణ అన్నవే ఈషణ త్రయాలు. ఈషణత్రయాలు,తాపత్రయాలు, వాసనాత్రయాలు అనే త్రయీ త్రయాలే ముక్త పురుషులకూ, బద్ధ పురుషులకూ వున్న తేడా.
సంసారం వుండి తీరాలి. సంసారం అద్బుతమైనది. అయితే నిర్వాణం అంత కన్నా అద్బుతమైనది. ఈ రెంటినీ సమన్వయపరచాలి. అది లభ్యం సంసారంలో‘అతి‘ తగ్గించుకుంటే.
ఇంద్రియ నిగ్రహం
“ఇచ్చువానికంటే నింద్రియ నిగ్రహుం
డరయ నతనికంటే నధికుడగును;
వాడు వానికంటె వీడను పాపముల్–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “దాత కంటే ఇంద్రియాల్ని జయించినవాడే అధికుడు; దాత కొన్నైనా పాపాలు చేస్తాడేమో కానీ ఇంద్రియ జేతకు మట్టుకు పాపాలు వుండవు.”
వ్యాఖ్య: దానాలు చేయడం గొప్పే కానీ, దానికంటే గొప్పదైనది ఇంద్రియ నిగ్రహం… అంటే యోగసాధన. అందుకే శంకరాచార్య అన్నారు…
“కురుతే గంగాసాగర గమనం, వ్రత పరిపాలనం, అథవాదానం–జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం భజతి న జన్మ శతేన” అని. అంటే, “అటు గంగకి వెళ్ళినా,ఇటు సాగర దర్శనం చేసుకున్నా, మరి ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, అన్ని మతాల్లోనూ ఏం చెప్పబడి వుందంటే, ఆత్మజ్ఞానవిహీనుడికి వంద జన్మలకైనా ముక్తి రాదు” అని. ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది? బహిరేంద్రయాలను నిగ్రహించి ఎప్పటికప్పుడు అంతర్ముఖం చేసుకుని తీరవలసిందే.
దానం చేయడంలో కూడా అపాత్ర దానాలు చేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవం. పాపాలు సహజం… కానీ, కనుక దాన కర్ణులు, కీర్తికాముకులు మొట్టమొదట యోగసాధనకూ, జితేంద్రియత్త్వానికే పాటుపడాలి. అదే శ్రేష్టం. అదే సరైనది.జితేంద్రియుడు. సర్వపాప విముక్తుడు. అతని వల్ల చేయకూడని పనులు ఎప్పటికీ చేయబడవు.
తనువు నడివి చేసి
“తనువు నడివిజేసి తనలోనే గూర్చుండి
తపము జేయలేని తాపసులెల్ల,
నడవి యందు జేరి యలజడి పడెదరు–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “తనువు“, “దేహం” అనే ‘అడవి ‘ లో వుండి ధ్యానం చేయలేని తాపసులు అడవులకు పోయి శ్రమపడుతూంటారు తప్ప మరేమీ సాధించలేరు“.
వ్యాఖ్య:యోగ సాధనకు ఏ కోనకూ పోనక్కరలేదు. ఏ హిమాలయాలూ అవసరం లేదు. మన ఇల్లే అశ్రమం కావాలి. మన శరీరాన్నే అడవి చేసి అందులోనే స్థిరంగా కూర్చోవాలి.
“దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః” అన్నారు కదా శంకరాచార్యులు.మనం ఈ దేహంలోనే “దేహి” అయి వున్నాం. కనుక మనల్ని మనం తెలుసుకోవడమే చెయ్యవలసినది. “తపము” అంటే “సాధన“. ఏ సాధన? “ఆనాపానసతి“, ఈ సాధన చేయడానికి అడవుల అవసరం ఏముంది? ఈ విషయం తెలియకుండా అడవుల కేగితే అలజడి తప్ప ఏం మిగిలుతుంది? “తపస్సు చేయాలి” అంటే అందరికీ గుర్తొచ్చేవి ముందుగా హిమాలయాలు.తరువాత అడవులు.ఇదీ భారతీయుల ఆధ్యాత్మిక విద్యా పాటవం,ఆధ్యాత్మిక పరిజ్ఞానం,తపస్సు అంటే “ధ్యానం“. ఇది “అంతర్ యానం” తప్ప“బహిర్‌యానం” కాదు.
కనుక ఏం చెయ్యాలి? ఎక్కడ వున్నవారు అక్కడే “గప్‌చుప్” అంటే, “ఎక్కడ వున్నవారు అక్కడే గమ్మున వుండాలి” తనువునే అడవి చేయాలి; తనువునే హిమాలయాలు చేయాలి; ఉన్నచోటే సాధనను మొదలెట్టాలి.
ఇంకెప్పుడు?
“బాల్యమందు శివుని బరికింపగ లేరు;
యౌవనంబునందు నరయలేరు“
ముదిమియందు గూడ మోసమే కందురు–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “చిన్నప్పుడే దేవుని తెలుసుకోలేని వారు యౌవనంలో తెలుసుకోలేరు.ముసలితనంలో అంతకంటే తెలుసు కోజాలరు.”
వ్యాఖ్య:శంకరాచార్యులు చెప్పినట్లు “బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపినసక్తః“.
బాల్యమందు మనస్సు, చిత్తం ఇంకా అపరిశుద్ధం కాకపోవడం వలన ధ్యానం బహు తేలిక. “శివత్త్వం” అతి సులభంగా సాధించవచ్చు. “శివ” అంటే “ఆనందం“, “మంగళం“, కనుక “శివుడు” అంటే “ఆనందమయుడు, మంగళకరుడు అయినవాడు“.
ఇకపోతే, యౌవ్వనంలో మానవుడికి ఎంతటి శక్తి, ఉత్సాహం, సామర్థ్యాలున్నా అవన్నీ అశాశ్వతాల వెంట మాత్రమే పరిగెడుతున్నాయి. శాశ్వత వస్తువును పొంద ప్రయత్నించడం లేదు. ఇక ముదిమితనంలో, అంటే ముసలితనంలో,వృద్ధావస్థలో, అనేక అల్పమైన చింతలతో తమను తాము మోసవుచ్చుకుంటూ వుంటారు; ఎంత బ్రతుకు బ్రతికినా, బ్రతకటానికి అసలు కారణమెరగరు.
అఙ్ఞానుల పంథా ఒక్కటే తీరులో వున్నట్లయితే, అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ, ఆధ్యాత్మిక తీరు కూడా ఒక్కటే,జ్ఞానుల పంథా ఒక్కటే,బుద్ధుల బోధ కూడా ఒక్కటే.
శంకరాచార్యుల కాలంలో కానీ, వేమన కాలంలో కానీ, ఈ కాలంలో కానీ, మనస్సు రీతి ఒకే విధంగా వున్నట్లుంది. అప్పటికీ, ఇప్పటికీ లోకరీతి, అజ్ఞానుల పంథా ఒక్కటే తీరులో వున్నట్లయితే,అప్పటికీ, ఇప్పటికీ,ఎప్పటీకీ, ఆధ్యాత్మిక తీరు కూడా ఒక్కటే,జ్ఞానుల పంథా ఒక్కటే,బుద్ధుల బోధ కూడా ఒక్కటే.
నేను
“నేననగ మేను గానని,
మానసమున నెఱుగకున్న మనుజులకెల్లన్,
స్వానుభవ సిద్ధి దొరకదు,
తానగు పరమాత్మ నెఱుగ దరమా వేమా!”
తా: “నేను అనగా శరీరం కాదు. ఆత్మ. ఈ సంగతి తెలియని నరులుకు స్వానుభవ సిద్ధియే కలుగదు. ఇక తానే పరమాత్మ అనే ఎరుక కలిగివుండడం సంభవమా?”
వ్యాఖ్య: “నేను” అంటే “మేను” కాదు. ఈ సత్యం తెలియనివారు, విననివారు యోగసాధన ఎలా మొదలు పెడ్తారు? యోగ సాధన మొదలు పెట్టకుండా స్వానుభవం ఎలా కలుగుతుంది?
స్వానుభవం ద్వారానే “నేను” అనేది “శరీరం“కాదనీ నిజానికి ఈ “నేను” అన్నది“పరమాత్మే” అనీ క్రమక్రమంగా విదితం చేసుకోవాలి. స్వానుభవసిద్ధి లేనివారికి“నేను“, “మేను” యే తప్ప ఇంకేమీ కాదు.
అంటే, ముందుగా కాస్త శాస్త్ర పరిచయం చేసుకోవాలి, ఇది సజ్జనసాంగత్యం ద్వారా కానీ సచ్చాస్త్ర అధ్యయనం ద్వారా కానీ జరగవచ్చు. ఆ తరువాతగా ధ్యానయోగ సాధన చేస్తే స్వానుభవం సిద్ధిస్తుంది. అంటే, తాను అయిన సూక్ష్మశరీరం మేను లోంచి విడివడుతుంది. అప్పుడు “నేను ఆ సూక్ష్మ శరీరం” అని సువిదితమవుతుంది. అక్కడి నుంచి మొదలయిన ఆత్మప్రయాణం “నేనే సర్వం” అన్న స్థితి వరకూ పయనిస్తుంది.
“ఆదిలోనే ‘హంసపాదు‘ అయితే పరమపద సోపానం అదిష్టించేది ఎప్పుడు?”అని ప్రశ్నిస్తున్నాడు వేమనాచార్యుడు.అంటే, క్రమక్రమంగా “నేను మేను” అనే స్థితి నుంచి “నేను మేనును కాను” అన్న స్థితికి చేరి ఇంకా ముందుకు పోయి, “నేను ఓ పూర్ణాత్మ” అని తెలుసుకుని చిట్టచివరకు “నేనే అంతా” అన్న స్థితికి చేరుకోవాలి.
పూర్ణ పదవి
“నిమిషమైనను మది నిల్పి నిర్మలముగ –
లింగ జీవేశులను గాంచి భంగపడక–
పూజ మది యందు జేరుట పూర్ణ పదవి–
పరము గోరిన నిది చేయ బాగు వేమ!”
తా: “ఎన్ని పనులున్నా, క్షణ కాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనస్సుతో‘లింగ‘, జీవత్మా, ‘పరమాత్మ‘ లనే పదాలను గురుంచి ఎక్కువ తత్తరపడకుండా,నిశ్చలబుద్ధితో మనస్సులోనే నిజమైన ‘పూజ‘ చేస్తే పూర్ణపదవి సిద్ధిస్తుంది;ఈ సాధన చేస్తే ‘పరం‘ లభిస్తుంది.”
వ్యాఖ్య:శ్రీ త్యాగరాజస్వామి అన్నట్లు “తలుపులన్నీ నిలిపి నిమిషమైనా” అంటే“ప్రతిరోజూ కొద్దిసేపయినా” మనస్సును నిలపాలి. అది ఈ “ఆనాపానసతి”వల్లనే సాధ్యం.
అంతర్ పదార్థాలనూ గ్రహించలేరు. మానవుల శరీరంలో వుండే ప్రాణశక్తి తీరు అందరికీ ఒక్కటే,ఆకలి తీరూ ఒక్కటే, “పూజా విధానం” కూడా ఒక్కటే.
హిందువులకు ఓ పూజా విధాన తీరు, ఇస్లాం మతస్థులకు మరో పూజా విధాన తీరు,క్రిస్టియన్‌లకు ఇంకొక తీరు అనేది అసంభవం.సర్వ మానవులకూ, సర్వ మతస్థులకూ వున్నది ఒకే పూజా విధాన తీరు నిజానికి అదే అంతర్ యానం – “ధ్యానం“.
“పూజను మనస్సులోనే వుంచుకోవడం” అనేదే “పూర్ణ పదవి” పొందడం.
కొండంత ధ్యానం చేయ పనిలేదు…గోరంత చేస్తే చాలు. “మది నిల్పి”అన్నాడు వేమన. అదే పతంజలి చెప్పిన చిత్త వృత్తి నిరోధం. అలాగే దాని ఫలం ఎప్పటికైనా మనం పూర్ణ పదవిని పొందడమే.
భూలోకపు ప్రాపంచిక పదవులు చాలా పనికిరాని పదవులు అవి క్రిందకు జార్చేవే కానీ, పైకి తీసుకు వెళ్ళే పదవులు కావు. పూర్ణాత్మ స్థాయికి చేరడమే ” పూర్ణ పదవి“.
ఒకే రీతి
“బొంది వేరు కాని, భువి ప్రాణమొక్కటి!
అన్నము లిల వేరు ఆకలొకటి;
పుష్పము లిటు వేరు, పూజలొక్కటి సుమ్ము –
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా:మనుష్యల శరీరాలు అనేకం కానీ ప్రాణం తీరు ఒక్కటే.తినే అన్నపదార్థాలు అనేకం గానీ, అందరి ఆకలీ ఒక్కటే,ఎవరెన్ని పూవులతో పూజించినా‘పూజాభావం‘ ఒక్కతీరే”
వ్యాఖ్య:మనుష్యుల శరీరాలు వేరు వేరు, అయినా ఆ శరీరాల నిర్మాణతీరు ఒక్కటే.అన్నమయకోశాల రూపురేఖలు వేరు వేరు కానీ, ప్రాణమయకోశాల మర్మం ఒక్కటే
అలాగే “ధ్యాన” పద్దతి కూడా సర్వమానవులకూ, సర్వ లోకాలలో,సర్వకాలాలలోనూ ఒక్కటే రీతిగా వుంటుంది. అంతేకానీ, “అనేక రకాలుగా”వుండదు. ధ్యానమార్గం కూడా ఒక్క తీరే – అదే ఆనాపానసతి.
మూర్ఖులు విభిన్న పంథాలలో వున్న బాహ్యరీతులనే చూస్తారు. కానీ అభిన్నంగా, ఏకతీరులో వున్న అంతర్ సూత్రాలనూ, అంతర్ పదార్థాలనూ గ్రహించలేరు. మానవుల శరీరంలో వుండే ప్రాణశక్తి తీరు అందరికీ ఒక్కటే,ఆకలి తీరూ ఒక్కటే, “పూజా విధానం”కూడా ఒక్కటే
హిందువులకు ఓ పూజా విధాన తీరు, ఇస్లాం మతస్థులకు మరో పూజా విధాన తీరు,క్రిస్టియన్‌లకు ఇంకొక తీరు అనేది అసంభవం.సర్వ మానవులకూ,సర్వమతస్థులకూ వున్నది ఒకే పూజా విధాన తీరు. నిజానికి అదే అంతర్‌యానం – “ధ్యానం“.
ఒకటే రీతిలో వున్న ప్రాణాన్నీ, ఒక్కటే తీరులో ఉన్న ధ్యాన విధానాన్నీ, అంటే,సత్యాన్వేషణా విధానాన్ని అపారమైన ధ్యాన, జ్ఞాన సాధనలతోనే అర్థం చేసుకోగలం.
అన్యధా శరణం నాస్తి.
గురువు
“నిను నీ వెఱుగగ నెంచిన –
మనమున సంకల్పములను మానగవలెరా;
అనుమానరహితముగ మరి
వినయంబున గురని బట్టి వెదకుము వేమా!”
తా: “నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, మనస్సులో సంకల్ప వికల్పాలు పోయి తీరాలి; అనుమాన రహితుడవయి సవినయంగా ఆధ్యాత్మిక గురువును చేరి సత్యాన్వేషణ గావించు ఓ! వేమా!”
వ్యాఖ్య: “గురువు లేని విద్య గ్రుడ్డి విద్య” అన్నారు. ఏ విద్య నేర్చుకోవాడానికైనా గురువు అనేవాడు వుండి తీరాలి.
“గురువు” అంటే “బరువు” అయినవాడు సంగీతజ్ఞానంలో బరువైనవాడు“సంగీత గురువు“. రసాయనిక శాస్త్ర విజ్ఞాని “రసాయనిక శాస్త్ర గురువు“. క్రికెట్ ఆటలో నిపుణుడు “క్రికెట్ గురువు“.
అలాగే, ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానంతోనూ, ఆత్మానుభవంతోనూ బరువైన వాడే“ఆధ్యాత్మిక గురువు” అనబడతాడు. తనను తాను తెలుసుకున్నవాడు“ఆధ్యాత్మిక గురువు“. కనుక, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, ఎవరో ఒకరు,తనను తాను తెలుసుకున్న అతను, మనకు దారి చూపించాల్సిందే. వేరే గత్యంతరం ఏం వుంది?
“యోగః చిత్త వృత్తి నిరోధః” అన్నారు పతంజలి. తరువాత “తధా దృష్టః స్వరూపేవస్థానం” అన్నారు. అంటే, “చిత్తవృత్తులు నిరోధింపబడ్డప్పుడే మన స్వరూపాన్ని మనం దర్శిస్తాం” అని.”ఈ సిద్ధాంతం మీదా, ఆ సిద్ధాంతం మీదా తర్జన భర్జనలు చేస్తూ కాలం గడపవద్దు. అనుమానరహితులు కండి. ముందుకు దూకండి; గురుని చేరండి; మిమ్మల్ని మీరు తెలుసుకోండి” అని సెలవిస్తున్నారు యోగి వేమన.
తోడు
“లేడు లేడనిన లేడు లేనే లేడు!
కాడు కాడటన్న గానె కాడు!
తోడు తోడటన్న తోడనే తోడగు!
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: ‘లేడు’ ‘లేడు’అంటే ఎవ్వరూ వుండరు. ‘కాడు‘ ‘కాడు‘ అంటే ఎప్పడూ ఏమీ కాలేడు; ‘తోడు‘ తోడు‘ అంటే ఎవ్వరైనా, ఎవ్వరికైనా తోడు ఆయి తీరుతారు.
వ్యాఖ్య:“నా వల్ల కాదు” అనుకుంటే ఎప్పుడూ ఏదీ చేయలేం. “ఎందుకు నా వల్ల కాదు? నా వల్లే ఆయి తీరుతుంది” అని నిశ్చయించుకుంటే ఏదైనా తప్పక సాధించి తీరుతాం.
“దైవం లేడు” అనే నాస్తికులకు నిజంగా ‘దైవం‘ లేనేలేడు. “మరణం” అంటే నాశనమే. “మరణాంతర జీవితం అన్నది లేనే లేదు” అన్నవారికి వారు చనిపోయిన తరువాత కూడా వుండేది చీకటే
“మరణాంతరజీవితం వుంది” అనుకునేవాళ్ళే. శరీరం వదలి వేసిన మరుక్షణం. దివ్యమైన కాంతి దేహంతో దివ్యలోకాలకు వెళ్ళి అక్కడి దివ్యజీవితం కొనసాగిస్తారు.
“నేను ఏకాకిని” అనుకునే వాడి దగ్గరికి ఎవ్వరూ రాలేరు. “ర…రానాకు ఓ తోడు కావాలి” అనుకునేవారి దగ్గరికి ఎంతమందైనా వచ్చి కలుస్తారు; తోడు, నీడ అవుతారు.
మన వాస్తవాన్ని ఎప్పుడూ మనమే సృష్టించుకుంటున్నాం.మన గతం బట్టే మన వర్తమానం వుంటుంది. మన వర్తమానం మన కర్మలను బట్టే, మన యిష్టాలను బట్టే జరుగుతుంది.
అలాగే మన భవిష్యత్తు కూడా మన చేతులలోనే వుంది. “యా మతిః సా గతిర్భవేత్” అన్నది ఉపనిషద్ సూక్తి. అంటే, “మతి ఎలా వుంటుందో అలానే గతి కూడా వుంటుంది”అని.అదే సెలవిస్తున్నారు వేమన స్వామి.
“యద్భావం తద్భవతి” అనేదే ఆధ్యాత్మ విజ్ఞానంలోని అత్యంత మహత్తరమైన మౌలిక సత్యం.
పూర్వ కర్మ ఫలము
“భవము పూర్వకర్మ ఫలము
గలిగెననుచు మదిని గట్టి పరచి
కష్ట సుఖము లేవి కలిగిన దలపకు
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “ఈ ప్రస్తుత జన్మలో ఉన్న పరిస్థితులు పూర్వ కర్మల ఫలాలే“, ఈ కర్మ ఫలాలు అనుభవించి తీరవలసినదే అని మనస్సును స్థిర పరచుకుని,జీవితంలో సంభవించే అన్ని కష్టసుఖాలనూ (ఎక్కువగా) పట్టించుకోరాదు”
వ్యాఖ్య:“భవం” అంటే ప్రస్తుతం వున్నది; అంటే, వర్తమానం. “వర్తమానం”అన్నది భూతకాలం యొక్క, మరి భవిష్యత్ ప్రణాళికల యొక్క సంజాతం.
“ఈ రోజు దినచర్య” అన్నది నిన్నటి దినచర్య యొక్క కంటిన్యుయేషన్ మాత్రమే. అలాగే, “ఈ జన్మ” కూడా గత జన్మ యొక్క తరువాతి పేజియే. గత జన్మలో ‘8’ అంకె దాకా వస్తే ఈ ప్రస్తుత జన్మ అన్నది ‘9’ అంకె అవుతుంది.గత జన్మ అన్నది ’24’ వ అంకె అయితే ఈ ప్రస్తుత జన్మ ’25’ వ అంకె అవుతుంది.
అంకె తర్వాత అంకె – ఇదీ సర్వ జీవుల శాస్వతస్థితి. ప్రస్తుత వర్తమాన అంకె స్థితిగతులు అన్నవి గత జన్మల అంకెల స్థితిగతుల ద్వారానే అస్తికత కలిగి వుంటాయి. ఇది గ్రహించి కష్టసుఖాలను మరీ ఎక్కువగా పట్టించుకోవద్దనే వేమన మనవి.
పూర్వజన్మలలో చేసిన పాప ఫలితాలే ప్రస్తుతపు
“కష్టాలు” పూర్వజన్మలలో చేసిన ధర్మాచరణల, పుణ్యకార్యాల ప్రతిఫలాలే ఈ జన్మపు “సుఖాలు“.
ఏ కార్యమూ కూడా, ఏ కారణమూ లేకుండా ఎప్పటికీ వ్యక్తమవదు. సృష్టింపబడదు.ఏదీ కాకతాళీయం కాదు. యధాలాపంగా ఏదీ జరగదు. ఆధ్యాత్మిక విజ్ఞాన సారం అయిన “కర్మసిద్ధాంతం” యొక్క సదవగాహనతో మనస్సును గట్టి పరచుకున్నవాడే భవసాగరాన్ని సులభంగా ఈదగలడు.
బ్రహ్మము
“విశ్వమందు బ్రహ్మ విస్తరించుట గాక,
వేరే బ్రహ్మమనుచు వెదుకనేల?
తగిలి యుండు గాదె తనలోన బ్రహ్మము!
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “విశ్వమంతా బ్రహ్మపదార్థం విస్తరించి వుండగా వేరే బ్రహ్మం ఎక్కడో వుందంటూ వెదకడం ఎంత చోద్యం. ఈ దేహంతో తగిలే వుందిగదా తనవరకూ సంబందించిన బ్రహ్మపదార్థం.
వ్యాఖ్య: “భూరితి బ్రహ్మ” అన్నదే “బ్రహ్మ” అనే పదానికి ఓ నిర్వచనం. “భూ”అంటే గొప్పదైనది. అంటే, “మహత్తరమైన ఉనికి కలిగి వున్నది“. కనుక, “బ్రహ్మము” అంటే, “మహత్తరమైన ఉనికి వున్న మూల వస్తువు” అని అర్థం.
ఉనికి వున్నదే బ్రహ్మం లేదా బ్రహ్మపదార్థం. విశ్వంలో అంతా నిండి వున్నదే ఈ “మూల చైతన్యం“. అధవా “బ్రహ్మపదార్థం“. బ్రహ్మపదార్థం యొక్క ఘనీభవీకరణే ఈ భౌతిక విశ్వం అంతా మరి ఇంకా అనేకానేక కోట్లాది ఇతర సూక్ష్మతర విశ్వాలూ.
“విశ్వం వేరే; బ్రహ్మ పదార్థం వేరే” అని ఎక్కడా వుండదు.”నేను“, “నేను” అని ప్రతీదీ ఘోషిస్తూ వుండేదే “బ్రహ్మ పదార్థం“. దేహంలో “దేహి” ఎలా విస్తరించి వుందో అలాగే విశ్వంలో తత్సంబంధిత “విశ్వాత్మ” కూడా విస్తరించి వుంది.అదే విధంగా ఓ అణువులో “అణువాత్మ“. ఓ కణంలో “కణాత్మ” కూడావిస్తరించి వున్నాయి. తదేకం అవుతున్నాయి. కణవిఘటన జరగవచ్చు గాక కణాత్మకు ఎంత మాత్రమూ అంతరాయం వుండదు. శరీరం చావచ్చు గాక, జీవాత్మ చావదు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసు కోవటమే “ఆత్మఙ్ఞానం” అన్నా, మరి“బ్రహ్మఙ్ఞానం” అన్నా.
నేల విడిచి సాము ఎలా లేదో, తాను కాని దైవ పదార్ధము, బ్రహ్మపదార్ధం ఎక్కడా లేదు.
కులకాంత
“వేదవిద్యలెల్ల వేశ్యల వంటివి –
భ్రమల బెట్ట తేటపడగనీవు;
గుప్తవిద్య యెక్కటే కులకాంత వంటిది–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “వేద విద్యలన్ని, అంటే ప్రాపంచిక విద్యలన్ని, వేశ్యల వంటివి. అవి భ్రమలలో పరిభ్రమింపచేస్తాయే కానీ మనల్ని తేటపడనీయవు; గుప్త విద్య అయిన రాజయోగం ఒక్కటే ‘తాళికట్టిన భార్య‘ వంటిది“.
వ్యాఖ్య: “త్రై గుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున!” అన్నారు గ్రాండ్ మాస్టర్ శ్రీ కృష్ణ. అంటే, “వేద విషయాలన్నీ త్రిగుణాత్మకాలే. అంటే, తమో రజోసాత్త్విక విషయాలకు సంబంధించినవే. నువ్వు మట్టుకు త్రిగుణాతీతుడుకా… ఓ అర్జునా!” అంటున్నాడు ఆ పరమాత్ముడు.
అలాగే, “శభాశుభ పరిత్యాగీ, భక్తిమాన్యః సమేప్రయః”అన్నాడు. అంటే, ఎవ్వరైతే మంచినీ చెడునూ రెంటినీ పరిత్యజిస్తాడో, తనలో తానే నిమగ్నుడయి వున్నాడో అలాంటివాడే నాకు ప్రియుడు” అని.
అశుభ కార్యకలాపాలు తమో, రజో, గుణాల నుంచి సంభవించినవి. అలాగే శుభ కార్యకలాపాలు సత్త్వగుణాత్మకాలు. అయితే, శ్రీకృష్ణుడు ఈ రంటినీ పరిత్యజించమంటున్నాడు. పరిత్యజించి, “భక్తిమాన్యుడు” కమ్మని సలహా ఇచ్చాడు. అంటే, తనలో తాను నిమగ్నమవమన్నాడు. అదే ‘గుప్తవిద్యా అయిన ధ్యాన యోగం
గుప్తవిద్యే “రాజవిద్య“, “రాజయోగం” అని శ్రికృష్ణుడు వక్కాణించాడు. ఈ విద్యను“గుహ్యతి గుహ్యం” అని అభివర్ణించాడు. అంటే, “గుప్తంలో గుప్తం” అని అర్థం.ఆ గుప్త విద్యే “ధ్యానం” అనే రాజ విద్య.వేద విద్యలన్నీ మనల్ని సత్యాన్నించీ ఈ, శాశ్వత శాంతినుంచీ ప్రక్కకు మరలిస్తాయి వేశ్యాలలాగా.ఎందుకంటే వేదాలు ఎన్నో కర్మకాండలను మనకు నిర్దేశిస్తాయి. సూటిగా సత్యం దగ్గరకు చేరనీయవు. కానీ, “సహధర్మచారిణి” వంటిది సదా కలిసిపోయి వుండేది. “ఆస్తి”అయినది కేవలం గుణాతీతమైన ఆత్మజ్ఞానమే” అని వేమనార్యుని దివ్యజ్ఞాన బోధ
పరము – బాపడు
“సంధ్యవార్వగనేమి? జపముచేయగనేమి?
వేద శాస్త్రములను వెలయనేమి?
పరము గనని వాడు బాపడు కాడురా–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “సంధ్యవార్చినా, జపము చేసినా, వేద శాస్త్రాలను చదివినా నిజమైన ముముక్షువుగా వుండి పరము గూర్చి యత్నింపకపోతే బ్రాహ్మణుడు కానే కాడు,”
వ్యాఖ్య: ఎవరు బ్రాహ్మణులు? ప్రొద్దునా సాయంత్రం గాయత్రి పఠించేవారా? “రామ రామ రామ” అని జపమాల త్రిప్పేవారా? లేక వేద వేదాంగాలను వల్లె వేసేవారా?వీరెవ్వరూ “బ్రాహ్మణులు” కాజాలరు.
“బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణః” అంటే, బ్రహ్మజ్ఞానం అనుభవించేవారే బ్రాహ్మంణులు. “పరము” చూసి తీరాలి, అప్పుడే బ్రాహ్మణుడు. యోగసాధన ద్వారానే “పరము” తిలకించడం సాధ్యం.
“పరము” అంటే “పరలోకాలు” ఉన్నవి మొత్తం 14లోకాలు – భూలోకం కన్నా“క్రింద” ఉన్న లోకాలు అధోలోకాలు., భూలోకం కన్నా “పైన” వున్న లోకాలే.
“ఊర్ధ్వ” లోకాలు., ‘భువర్‘., ‘సువర్‘.. ‘జనా‘, ‘మహా‘, ‘తపో‘,’సత్య ‘ లోకాలే భూలోకానికి “పరమైన” అంటే “ఇతరమైన” ఊర్ధ్వలోకాలు.
మాములుగా “మరణించడం” అంటే, మనిషి బౌతికలోకం వదిలివేసి ఈ పై ఉదహరించిన లోకాలకు పయనించడం అన్నమాట. స్వానుభవంగా ” పరలోక”జ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. పుట్టకతో అందరూ శూద్రులే. గుణ కర్మలను బట్టి బ్రాహ్మణుడు కావచ్చు.
“చాతువర్ణ్యం మయా సృష్టః గుణ కర్మ విభాగశః” అన్నాడు కదా యోగీశ్వరుడైన శ్రీకృష్ణ.
పుణ్య పురుషులు
“ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు –
జూడ జూడ రుచుల జాడ వేరు;
పురుషులందు పుణ్యపురుషులు వేరయా –
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “ఉప్పు కర్పూరం రెండూ తెల్లగా ఒక్క రీతిలోనే కనబడుతాయి. కానీ, వారి రుచులు వేరు వేరుగా ఉంటాయి. అలాగే అందరూ ఒక్క మాదిరిగానే కనబడ్తారు. కానీ, వారి వారి గుణాలను బట్టి ‘పుణ్యాత్ములు ‘ ఎవరో, ‘పుణ్యాత్ములు కాని వారు ‘ ఎవరో తెలిసిపోతుంది.”
వ్యాఖ్య: రూపురేఖల ప్రస్తావన వస్తే యోగులకూ, యోగులు కాని సామాన్యులకూ తేడా ఏమీ వుండదు. చూడడానికి యోగి, లేక జ్ఞాని యొక్క దైనందిక జీవితం యోగరీతి తెలియని వారి విధంగానే వుంటుంది. అయితే పరిశోధిస్తే, దీర్ఘకాలంగా పరీక్షిస్తే యోగుల స్థితప్రజ్ఞత, నిత్య సంతోషత లన్నవి తప్పకుండా బయట పడతాయి.
బహిరంగంగా తేడాలు కనపడకపోయినా అంతరంగంగా యోగుల జాడలు వేరుగా వుంటాయి. “పుణ్య పురుషులు” అంటే యోగ పుంగవులే.
“పుణ్య పురుషులు” అంటే “ఏదో ‘మంచి ‘ గా బ్రతికే వాళ్ళు ‘చెడు చేయని వాళ్ళు” అని కానేకాదు. తెలియనిది తెలుసుకోవడమే “పుణ్యం” అంటే ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధకులే పుణ్య పురుషులు.
“పాపం” అనేది ఆత్మజ్ఞానరహిత కార్యకలాపం. “పుణ్యం” అనేది ఆత్మజ్ఞాన సహిత కార్యకలాపం. “పాపం” అంటే తెలిసినది చెయ్యకపోవటం. “ధర్మం”అంటే తెలిసింది చెయ్యటం. “పుణ్యం” అంటే తెలియనిది తెలుసుకోవటం.
కోపం
“కోపమునను ఘనత కొంచెమై పోవును!
కోపమునకు గుణము కొఱత పడును!
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును!
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “కోపం వల్ల మన గొప్పతనం, గుణం తగ్గిపోతాయి; కోపమున్నవాడికి కేవల జీవనం కూడా కష్టతరంగా ఉంటుంది. ఆయుష్షు కూడా క్షీణీస్తుంది.”
వ్యాఖ్య:గీతలో కృష్ణుడు అన్నట్లు “కామేష, క్రోధేష, రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా!” క్రోధం అనేది మహాపాపం. అది మనిషి యొక్క రజోగుణం లోంచి ఉద్భవిస్తుంది.
కోపం వలన మనిషి యొక్క కీర్తి తగ్గిపోతుంది. కోపం వలన మనిషి యొక్క గుణం తగ్గి దోషం పెరుగుతుంది. కోపం వల్ల బ్రతుకే కష్టం అవుతుంది కనుక, ‘కోపం‘ అనేది సర్వవేళలా త్యజించి తీరాలి. అయితే, ఆపద్ధర్మంగా కోపం అనేది ప్రత్యేక ప్రయోజనాల కోసం, ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శన చేయవచ్చు. అప్పుడు అది ‘సామ దాన భేద దండ ‘ అనే చతుర్విధ ఉపాయాలలో దండోపాయం గా పరిణమిస్తుంది.
గీతలో కృష్ణుడు ఇంకా, “క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి” అన్నాడు కదా.
నిద్ర
“ఎచట నుండి వచ్చునెచటికి దా బోవు?
నిద్ర చంద మెఱుగ నేర్చెనేని
ఆత్మ రాక పోక లతడేపో శివయోగి!
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “జీవుడు ఎక్కడి నుండి వచ్చాడో? ఎక్కడికి పోతున్నాడో? ‘నిద్ర ‘ అంటే ఏమిటో? ఆత్మ రాకపోకలేవో? ఇవన్నీ తెలుసుకున్నవాడే ఎప్పడూ ఆనందించే యోగి“.
వ్యాఖ్య:“నిద్ర ” అంటే ఏమిటి? ” ఆ అవస్థలో మనం ఎక్కడికి పోతున్నాం?” ఈ ప్రశ్నలకు ఎప్పుడైతే సమాధానాలు తెలుసుకుంటామో అప్పుడే జీవిత రహస్యాలన్నీ తేటతెల్లం అవుతాయి.
ప్రతి రాత్రీ మన సూక్ష్మశరీరం స్థూల శరీరం నుంచి విడివడుతుంది. విడి వడి అనేక విషయాలు పరిశీలించి, పరిశోధించి తెల్సుకుంటుంది. “నిద్రావస్థ” శరీరానికే కానీ “దేహి” కి అంటే “ఆత్మ” కు మాత్రం కాదు. ఇక్కడ “ఆత్మ” అంటే “సూక్ష్మశరీరాది సముదాయం” అని. ఈ “ఆత్మ రాకపోకలే” , “నిద్ర” అంటే.
రమణ మహర్షి అన్నట్లు “సుషుప్తి” లో “జాగృత” గా వుండటమే “ధ్యానం” అంటే. “నిద్ర“, “చావు“, “ధ్యానం” అన్నీ విదేహ యాత్రలే “నిద్ర చందం”తెలుసుకున్నవాడే యోగి. అంటే, “ఆత్మ రాకపోకలు” స్వానుభవంగా ఎరిగిన వాడే యోగి.
“శివ” అనే పదానికి అర్థం “ఆనందం” అని.
కనుక, “శివయోగి” అంటే “నిత్యానందంతో ఓలలాడే యోగి” అని అర్థం అన్నమాట.
“ఆత్మ రాక” యే “జన్మ” “పుట్టుక” అంటే.
“ఆత్మ పోక” యే “మరణం”, “చావు “, అంటే.
అంతే… ఇంకేమీ లేదు. ఇంకెందుకు దుఃఖం?
శాంత మానసం
“శాంత మానసమున జల్లనై శీతల
భాతి నున్నవాడు పరమ యోగి;
అట్టివాడు ముక్తి నతివేగ గైకొను
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “కోపతాపాలు లేకుండా శాంతుడై చల్లని మనస్సు గలిగి వున్నవాడే పరమయోగి. అతను సులభంగా ముక్తిని పొందుతాడు.
వ్యాఖ్య:శ్రిత్యాగరాజస్వామి అన్నట్లు “శాంతము లేక సౌఖ్యము లేదు“. పరమ యోగి ఎల్లప్పుడూ ప్రశాంత మనస్కుడై చల్లగా, శీతలంగా వుంటాడు. శాంత మనస్కుడైనవాడే సత్యాసత్యాలనూ, నిత్యానిత్యాలనూ, ధర్మాధర్మాలనూ బహు సులభంగా అనుభవైక్యం చేసుకుని ముక్తి వైపు అతి వేగంగా ప్రయాణిస్తాడు.అలా కాని అశాంత మనస్కునికి ముక్తి అనేది మృగ్యం.
“యోగి” అంటే “కర్మ యోగి“, జ్ఞానయోగి” మరి “రాజయోగి“.
“యోగం” అంటే ఐక్యత, ఏకం“.
“యుంజతే ఇతి యోగః” అన్నారు కదా.
కర్మలతో “ఏకం” అయి ఉన్నవాడే – కర్మయోగి
జ్ఞానంతో “ఏకం” అయి ఉన్నవాడే – జ్ఞానయోగి
తన పూర్ణాత్మతో “ఏకం” అయి ఉన్నవాడే – రాజయోగి
వీటన్నిటిలోనూ పరిపూర్ణుడై ఉన్నవాడే “పరమ యోగి“. అయితే, చూపరులకు కోపతాపాలతో మండి పడుతున్నట్లు బయటికి కనపడవచ్చు. నిజం అన్నది లోపలికి చూస్తేనే తెలుస్తుంది. నిజానికి యోగుల నిక్కచ్చితనాన్నీ,సూటిమాటలనూ, “కోపం” గా అభివర్ణించటం సాధారణ జనులకు పరిపాటి.
ఒడలు – ఒడయుడు
“అడవి దిరుగ జిక్క దాకసమున లేదు;
అవని తీర్థయాత్రలందు లేదు!
ఒడలు శుద్ధి చేసి యొడయుని జూడరా!
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “శరీర శోధన చేసుకుని సమాధి మగ్నుడై దేహంలో ఉన్నవాడిని చూడాలి.అడవులు తిరిగినా, ఆకాశాన ఎగిరినా, తీర్థయాత్రలకు పోయినా, ఏ మాత్రం ప్రయోజనం లేదు.”
వ్యాఖ్య:ముక్తి అన్నది అడవులు తిరిగితే చిక్కదు. ముందు “ఒడలును శుద్ధి చేయాలి“. అంటే “నాడీమండల శుద్ధి” అన్నమాట. అంతేకానీ, స్థూలశరీర శుద్ధి కాదు. నాడీమండల శుద్ధి కావాలంటే మార్గం ఒకటే – అదే “అనాపానసతి“.అప్పుడు “ఒడలు” లో వున్న “ఒడయుని” చూడవచ్చు. “ఒడయుని” అంటే“దేహి“ని, “ఆత్మ” ను అన్నమాట. అంటే, సూక్ష్మశరీరాన్ని విడదీయవచ్చు. ఈ“అన్నమయ కోశం” వేమన సూచించిన “ఒడలు” కాదు. ఎందుకంటే అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తే ఆత్మ అన్నది తెలియనే తెలియబడదు.
మన ఒడలులో ఎన్నో కోశాలు ఉన్నాయి – ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఇత్యాది. ఆ కోశాలు శుద్ధి చేయబడాలి.
ముఖ్యంగా శుద్ధిచేయవలసిన కోశం “ప్రాణమయ కోశం” అంటే, నాడీ మండలం. ఇది శుద్ధం కావాలంటే చిత్తాన్ని “వృత్తి రహితం” చేసుకోవాలి., బుద్ధిని సునిశితం,సుశిక్షితం, సుశొభితం, సత్యవంతం, ఆత్మవంతం చేసుకోవాలి.
నిర్బీతి
“నియమితాసనమున నిలిచిన చిత్తంబు
తామసంపు నిద్ర దలగ ద్రోయు
నిద్ర తొలగినంత నిర్భీతి ఉదయించు
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా: “నియమంతో ఆసనంలో కూర్చుండి మనస్సు నిల్పితే, తామసమనే నిద్ర తొలగుతుంది; అది తొలగ్గానే ఆత్మరూపమైన ధైర్యం కలుగుతుంది“.
వ్యాఖ్య:పతంజలి “సమాధి” విధానాన్ని ఆసన – ప్రాణాయామ – ప్రత్యాహార –ధారణ – ధ్యానంగా – విశ్లేషించి వివరించారు.
“నియమిత ఆసనం” లో మనల్ని మనం ప్రతిష్టించుకుని, చిత్తాన్ని నిలిపి,తామసమైన నిద్రను తొలగద్రోయ ప్రయత్నించాలి. “నియమిత ఆసనం”అంటే “మనకు నచ్చిన ఏదేని సుఖమైన ఆసనం“.
“నిలచిన చిత్తంబు” అంటే, “చిత్తం వృత్తి రహితం అయితే” అన్నమాట.అప్పుడు క్రమక్రమంగా నిద్ర తొలగి పోతుంది. సుషప్తి జాగృతమవుతుంది. నిద్ర తొలగగానే ఆత్మతత్త్వం సంపూర్ణంగా చక్కగా అవగాహన కొచ్చి స్వానుభవాలు కలిగి ఇంక నిర్భీతి స్థితి ఉపలబ్దమవుతుంది.
సగటు మానవుడు భీతి విహ్వలుడు. అయితే, చిత్తం వశం చేసుకున్న యోగి సర్వ భయాల నుంచి విముక్తుడైన వాడు.
“భయ” స్థితే మానవత్త్వం; “అభయ” స్థితే దివ్యత్త్వం.
ఆత్మజ్ఞానం లేనివాడు మానవ మాత్రుడే.
ఆత్మజ్ఞానం వున్నవాడు దైవమే.
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” కదా
ఆశలు
“ఆశలనెడి త్రాళ్ళ నమరగోయగ జేసి
పారవైన గాని పరము లేదు;
కొక్కు తిండియాస జిక్కి చచ్చిన యట్లు–
విశ్వదాభిరామ వినుర వేమ!”
తా:ఆశలనే త్రాళ్ళను త్రెంచివేస్తే కానీ ముక్తి లేదు; పందికొక్కు తిండికాశించి బోనులో చిక్కి చస్తుంది కదా
వ్యాఖ్య: “దుఃఖానికి మూలకారణం తృష్ణ” అని గౌతమ బుద్ధుడు తన దివ్యసాధన ద్వారా కనుక్కున్నాడు.
“దుఃఖము“, తృష్ణ“, “అవిద్య“, “అష్టాంగమార్గం” అనేవే బుద్ధుని నాలుగు ఆర్యసత్యాలు. అవిద్యాయుత ఆశలే మానవుడికి ఇహలోకం భంగపాటును కలుగచేస్తున్నాయి. విద్యాయుత ఆశాలే ఇహానా, మరి పరానా మానవుడికి ప్రగతిని సాధించి పెడ్తాయి.
కనుక “ఆశలు” అనే త్రాళ్ళను తెగనరికి పారవేస్తేగానీ “పరం“,అంటే“మోక్షమార్గం” దొరకదు. ఇక్కడ “ఆశలు” అంటే “అత్యాశలు” అని అర్థం చేసుకోవాలి. “తృష్ణ” అంటే “తీరని దాహం.” పందికొక్కు విపరీతమైన తిండి ఆశతో బోనులో చిక్కి తన జీవితాన్నే కోల్పోతుంది. అలాగే “మనస్సు ఊయల”లో ఊగిసలాడే మానవుడు ఈ మర్త్యలోకం లోనే తిరిగి తిరిగి పుడ్తూ, తిరిగి తిరిగిచస్తూ వున్నాడు.