బ్రహ్మజ్ఞానం
“ఈ భూమండలం అంతా కూడా రకరకాల లోకాలకు చెందిన రకరకాల ఆత్మస్వరూపులకు ఆలవాలంగా విలసిల్లుతోంది!
“ఇక్కడ ‘నేను శరీరం మాత్రమే కాదు .. నేను ఒక ఆత్మను’ అన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళంతా కూడా గురువులుగా విలసిల్లుతారు! మరి ‘నాలాగే అందరూ’ అన్న బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళంతా కూడా పరమగురువులుగా విలసిల్లుతారు.
“కేవలం బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నవారే ఇతర A to Zలోకాలకు చెందిన ఆత్మలస్థాయి యొక్క ఔన్నత్యాన్ని కూడా గుర్తించి .. తాము కూడా వాళ్ళ స్థాయికి దిగివచ్చి వాళ్ళతో కలిసి .. అత్యంత ఎరుకతో కూడిన పరస్పర సహకారంతో లోకకల్యాణ కార్యక్రమాలను చక్కబెడుతూ ఉంటారు.
“ఇలా ఒకానొక ఆధ్యాత్మిక బృందంలా కలిసి పని చేసే వివిధ స్థాయిలకు చెందిన ఆత్మస్వరూపులు తమ బృందంలోని తమ తమ స్థాయిలకు చెందిన ఇతర ఆత్మస్వరూపులను పరస్పరం గుర్తించుకుంటూ .. తమకంటే ఉన్నతస్థాయి ఆత్మ నేతృత్వంలో పనులను పూర్తి చేస్తారు.
“చదరంగం ఆటలో ఒకానొక ‘ఆనంద్’ వేసే ఎత్తును ఇంకొక అంతర్జాతీయ స్థాయి చదరంగం ఆటగాడైన ‘కాస్పరోవ్’ మాత్రవే గుర్తించగలిగినట్లు ఒకానొక మహాపురుషుడిని .. ఇంకొక మహాపురుషుడు మాత్రమే గుర్తిస్తాడు. అలా గుర్తించగలిగాడు అంటే .. ‘అతడు కూడా మహాపురుషుడే’ అని అర్థం. లేకపోతే ‘వాడికేం మూడవకన్ను ఉంది? ఊరికే ధ్యానం పేరుచెప్పి కళ్ళు మూసుకుని టైమ్‌వేస్ట్ చేస్తున్నాడు’ అనుకుంటారు!
“ఈ క్రమంలో మూలాధారంలో ఉన్న వాడు .. ‘నేను శరీరమే .. నేను కేవలం తినడం కోసమే పుట్టాను’ అనుకుంటూ శరీరాన్ని పోషించుకోవడానికే తన జీవితకాలాన్నంతా వెచ్చిస్తాడు.
“ఒక స్వాధిష్టానంలో ఉన్నవాళ్ళు ‘నేను నీకు భర్తను; నేను నీకు అన్నను; నేను నీకు తండ్రిని; నేను ఈ గ్రామానికి సర్పంచిని .. నేను చెప్పినట్లే అందరూ వినాలి’ అన్న భావనతో ఇతరులపై పెత్తనాలు చలాయిస్తూ తన జీవిత కాలాన్నంతా వెచ్చిస్తారు.
“ఒకానొక మణిపూరక చక్రస్థాయిలో ఉన్నవాడు పైకి ‘మణి’లా మెరుస్తూనే ఉంటాడు కానీ .. ధ్యానం లేకపోతే మాత్రం లోపల అంతా డొల్లగానే ఉంటాడు. అతడు సకల ప్రాపంచిక విద్యా పారంగతుడు అయినా ఆత్మవిద్యా పారంగతుడు అయినా సరే, ఆత్మవిద్యా పారంగతుడు కాకపోతే మాత్రం అతని లోపల అంతా డొల్లగానే ఉంటాడు.
” ‘నేను Ph.D చేశాను; నేను శాస్త్రగ్రంధాలన్నీ కంఠతా పట్టేశాను; నేను సకల కళలలో ఆరితేరాను’ అని తన గొప్పలు తానే చెప్పుకుంటూ కాలం గడిపినా .. వాడి జీవితంలో ‘సత్యసాధన’ మరి ‘అహింసా ధర్మాచరణ’ అన్నవి లేకపోతే మాత్రం వాడి పాండిత్యాలన్నీ బూడిదలోపోసిన పన్నీరే అవుతాయి.
“ఇలాంటి వాళ్ళంతా కూడా అనాహతంలోకి వచ్చాక నిశ్శబ్దం అయిపోతారు! ” ‘ఇక నేను మాట్లాడను; మాట్లాడితే నా కంపు నాకే తెలిసిపోతోంది’ అనుకుంటూ కళ్ళు మూసుకుని గంటలు గంటలు మౌనంగా ధ్యానంలో కూర్చుంటారు. అలా కొన్ని జన్మలు గడిచాక ‘సేవా కార్యక్రమాలు చేసయినాసరే కొంత పుణ్యం కూడగట్టుకుంటాను’ అనుకుని విశుద్ధ చక్రస్థాయిలో జన్మలు తీసుకుని వచ్చి అనేకానేక సేవాకార్యక్రమాలు చేస్తూ ‘వేరెవరినో ఉద్ధరిస్తున్నాం’ అనుకుంటూ కాలం గడుపుతారు.
“అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యాదానాలు, అనాధపిల్లల సేవలూ మరి వృద్ధులకూ, వికలాంగులకూ సేవలు చేస్తూ చేస్తూ చివరికి ‘ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ .. ఒకరు ఇంకొకరిని ఉద్ధరించజాలరు’ అన్న సత్యాన్ని తెలుసుకుంటారు.
“తెలుసుకున్న వెంటనే ఇక వాళ్ళు అజ్ఞాచక్ర స్థాయిలోకి ప్రవేశించి ఒక తాబేలులా తమ పంచేంద్రియాలను లోపలికి ముడుచుకుని .. అంతరంగ పరిశీలనలో మునిగిపోతారు.
” ‘నేనెవరు?’ .. ‘నా జన్మ పరమార్థం ఏమిటి?’ అన్న ఆత్మ అవగాహనను పొంది .. మూడవకన్ను విస్ఫోటనం ద్వారా సుదర్శనాలన్నీ చేస్తారు. సూక్ష్మశరీరయానాల ద్వారా ఆ యా లోకాలన్నీ తిరుగుతూ .. అక్కడి విశేషాలన్నీ ఆశ్చర్యంగా చూస్తూ .. ధ్యానయోగంలో మునిగిపోతారు!
“అందుకే .. ‘అలా కళ్ళు మూసుకుని ధ్యాన మగ్నులయిన యోగులు ఏం చేస్తూంటారు?’ అన్న అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ..
“ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైన చాన్యః| ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్|| (భ||గీ|| 2-29)
“ఒకానొక మహాపురుషుడు మాత్రమే దీనిని (ఈ ఆత్మను) ఆశ్చర్యమైనదానిగా చూస్తాడు; ఇంకొక మహాత్ముడు దీని తత్త్వాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు; మరి కొందరు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వింటారు. ఆ విన్నవారిలో కొందరు దానిని గురించి ఏమీ తెలుసుకోరు’||
“‘ఆశ్చర్యవత్ పశ్యతి’ .. అంటే ‘రకరకాల శరీరాలతో రకరకాల లోకాలన్నీ తిరుగుతూ వాళ్ళు అక్కడి విశేషాలను ఆశ్చర్యంగా చూస్తూంటారు “అలా చూసి వచ్చిన వాళ్ళంతా కూడా ‘ఆశ్చర్యవత్ వదతి’ అంటే ‘ఆశ్చర్యంగా చెబుతూంటారు!’ అని శ్రీకృష్ణుడు చెబుతాడు.
“అందుకే కొందరు ధ్యానం చేసి వచ్చాక ‘ఇందాక నేను ప్రక్కింట్లో ఉన్న త్రాగుబోతు వాడి లివర్ లోపలికి వెళ్ళిపోయి అక్కడి కణాలతో మాట్లాడి వస్తున్నాను. ‘ఆల్కహాల్ లో పడి మునిగిపోతూ మేము ఓవర్‌టైమ్ చెయ్యాల్సి వస్తోందని అవి తెగబాధపడ్డాయి’ అని చెబుతాడు.
“ఇంకొకరు ‘ధ్యానంలో చనిపోయిన మా అమ్మగారు కనపడ్డారు. నన్ను చూసి చాలా సంతోషపడి .. నేను బ్రతికి ఉన్నప్పుడు నాకు గురువుగా వచ్చిన నిన్ను గుర్తించి .. నీ దగ్గర ధ్యానం నేర్చుకోలేక పోయానయ్యా! పైగా ఊరికే కళ్ళు మూసుకుని కూర్చున్నావనీ .. ఇంకా ఇంకా డబ్బు సంపాదించడం లేదనీ నిన్ను తిట్టిపోసాను!”
‘ఇప్పుడు మళ్ళీ జన్మతీసుకుని ధ్యానం చేసి నన్ను నేను ఉద్ధరించుకుంటానయ్యా; నీకు నమస్కారం చేసుకుని పోదామని వచ్చాను అనిచెప్పింది’ అంటారు.
“కనుక ఎంతోమంది ఇతరలోకవాసులు మరి చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడే .. మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ధ్యానంలో మనం మన మూడవకన్నును తెరుచుకుని చూస్తే చాలు .. ఇక్కడ మన స్నేహితులూ మరి బంధువులతో మాట్లాడినట్లే వారితో కూడా చక్కగా మాట్లాడవచ్చు.
“బుద్దుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో తన గత జన్మలన్నీ తెలుసుకున్నాడు. అవే జాతక కథలు!! మార్కండేయుడు, బుద్ధుడు, ప్రహ్లాదుడు మరి నచికేతుడు అంతా కూడా ఇలా కళ్ళు మూసుకుని కూర్చునే ఆత్మజ్ఞానం అంతా తెలుసుకున్నారు.
వాళ్ళలాగే మనమంతా కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని బ్రహ్మజ్ఞానుల్లా విలసిల్లాలి అంటే మరి ధ్యానం తప్ప వేరే మార్గం లేదుగాక లేదు!!