ఆనంద శాస్త్రం?

 

  • పిరమిడ్ ధ్యానం
  • బ్రాహ్మణ భోజనం
  • కర్తవ్య దీక్ష
  • ఎంజాయ్‌మెంట్ సైన్స్

“పిరమిడ్ ధ్యానం”

మనశ్శాంతి లేనిదే ఆత్మకు ఆనందం లేదు. మనశ్శాంతి లేనివాడికి ఆనందం ఎక్కడిది ? ఎంతటి ధనవంతులైనా, ఎంతటి శ్రీ మంతులైనా డబ్బు అన్నది ఆత్మకు ఆవగింజంతైనా శాంతిని ఇవ్వజాలదు. “అర్థమనర్థం” అన్నారు కదా శంకరాచార్యులు. “సూది బెజ్జంలోంచి ఓ ఒంటె అయినా దూరవచ్చునేమో కానీ ఓ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో … అంటే ‘శాంతి రాజ్యం’ లో … అంటే ‘ఆనంద రాజ్యం’ లో ప్రవేశింపజాలడు” అని ఏసు ప్రభువు చెప్పే వున్నాడు కదా.

కనుక ధనవంతుడికి ఆనందం కాదు . . . ధ్యానవంతుడికే ఆనందం.

కనుక ఆనంద శాస్త్రం … ఎంజాయ్‌మెంట్ సైన్స్ … లో ప్రధాన భాగం ధ్యానం. మరి ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానమే ‘ధ్యానం’ కదా.

ఇకపోతే రెండవది…

“బ్రాహ్మణ భోజనం”

“బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణః”

“బ్రహ్మజ్ఞానం వున్నవాడే బ్రాహ్మణుడు”

పుట్టుకతో అందరూ శూద్రులే. బ్రహ్మజ్ఞానం వున్నవాడే బ్రాహ్మణుడు. శరీరం నేను అనుకునేవాళ్ళే ఆ బ్రాహ్మణులు … బ్రాహ్మణేతరులు … శూద్రులు.

“ఓ బ్రాహ్మణుడు …” రకరకాల ఆత్మస్థితులతో అన్నిటికన్నా ఉన్నతస్థితిలో ఉన్నవాడే ఓ బ్రాహ్మణుడు … “an Enlightened Master ” అన్నమాట.

ఇకపోతే “భోజనం” …

‘భోజనం’ అంటే ‘ఆహారం’. ఆహారం అన్నది దేహానికి వేరే … మరి దేహికి వేరే. దేహానికి పదార్థం ఆహారం … మరి దేహికి … ఆత్మకు … జ్ఞానం … నవరసాలు … ఆహారం అవుతాయి.

ఉదాహరణకు మనం తినే భుజించే ఆహారంలోని ‘పదార్ధం’ దేహానికి ఆహారం కాగా అందులోని ‘రుచి’ మాత్రం ఆత్మకు పుష్టినిస్తుంది.

ఎప్పుడూ సువాసనలను ఘ్రూణిస్తూ వుండాలి. ఇంటినిండా అగరుబత్తీలు వుంచాలి. వంటికి అత్తర్లు పూసుకోవాలి. ఎప్పుడూ చక్కటి సంగీతాలు వింటూ వుండాలి. చక్కటి సంభాషణలు వింటూ వుండాలి. ఆత్మపరమైన విషయాలనే వినాలి. ఒకరినొకరు సుసంపన్నం చేసుకునే మాటలనే వినాలి. Five Star ఆహారాన్నే స్వీకరించాలి. భోజనం శుచిగా, రుచిగా చేసుకోవాలి. ఇదంతా బ్రాహ్మణ భోజనం అన్నమాట.

మనం మన జ్ఞానేంద్రియాలతో ఆత్మవత్ భోజనాన్ని స్వీకరిస్తూ వుంటాం. ఈ ఆత్మవత్ భోజనంలో శ్రద్ధను చూపిస్తే … మన ఆనందం మరింత అభివృద్ధి అవుతుంది.

ఓ శూద్రుడిగా జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోకుండా ఓ బ్రాహ్మణుడిలా ఉపయోగించుకోవాలి అన్నమాట.

* * *

జీవుడు కర్మేంద్రియాలతో తన శరీర వ్యవహారాలను నడుపుతుంటాడు. కానీ తన జ్ఞానేంద్రియాలతో – కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు. చర్మం – ఆత్మ వ్యవహారాలను నడుపుకుంటూ వుంటాడు.

కళ్ళు – కళ్ళుతో మంచి దృశ్యాలను ఎలాంటివి అంటే సూర్యోదయం సూర్యాస్తమయం, మనోహరమైన ప్రకృతి దృశ్యాలు చూస్తాడు.

ముక్కు – మంచి మంచి సువాసనలను ఆఘ్రాణిస్తాడు.

నాలుక – రుచికరమైన శాకాహారాన్ని తింటాడు. అంటే, నిష్టతో చేసిన సుబ్రాహ్మణ సాత్విక వంటలు అన్నమాట. రుచికరమైన ఫలాలు అన్నమాట.

చెవులు – చెవుల ద్వారా మంచి సంగీతాన్ని వింటాడే తప్ప చెత్త సంగీతాన్ని వినడు. ఎలాగంటే బిస్మిల్లాఖాన్ షహనాయి లేదా M.S.సుబ్బలక్ష్మి సంగీతం లాంటివి.

అన్నిరకాల కర్మేంద్రియాల ద్వారానూ, జ్ఞానేంద్రియాలతోనూ గ్రహించే భోజనాన్ని బ్రాహ్మణ్ భోజనం అని వివరంగా చెప్పారు.

ఇకపోతే కర్తవ్య దీక్ష …

“కర్తవ్య దీక్ష” 

 

కర్తవ్యం అంటే చెయ్యవలసిన కార్యం … చేపట్టవలసిన ధర్మం …

ధర్మం అన్నది అత్యంత డైరక్ట్‌గా ఆనందానికి కారణభూతమవుతుంది. “ధర్మో రక్షతి రక్షితః” అధర్మం అంటే చెయ్యకూడనిది … అధర్ముడు అంటే చెయ్యకూడనివి చేసేవాడు.

చేయవలసినవాటిని చేస్తే … ఆనందం.

చేయకూడనివి చేస్తే … దుఃఖం

కర్తవ్య నిష్టుడు అయితే … ఆనందం.

కర్తవ్యాలను విస్మరిస్తే … దుఃఖం.

కర్తవ్యాలు రెండు రకాలు …

  1. కుటుంబపరమైన
  2. సమాజపరమైన

కర్తవ్యాన్ని విస్మరించేవాళ్ళు ‘గిల్టీ’ గా ఫీలవుతుంటారు. ఎప్పటి కర్తవ్యాలను అప్పుడు పాటించేవాళ్ళకు ‘గిల్టీ కాన్షియస్‌నెస్’ వుండదు. వాళ్ళు ఎప్పటికప్పుడు ‘హాయి’ గా వుంటారు.

కనుక ఆనందశాస్త్రంలో మూడవ ప్రధాన భాగమే కర్తవ్య దీక్ష.