“ఘటాకాశమే .. చిదాకాశం”

 

“ఘటం” అంటే “కుండ” “చిదం” అంటే “బ్రహ్మాండం” “ఆకాశం” అంటే “మహాశూన్యం” “కుండలో ఉన్న ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉన్న ఆకాశం అంతా ఒక్కటే! కుండ అన్నది అది వెండి కుండ కావచ్చు .. బంగారు కుండ కావచ్చు లేదా రత్నాలతో తయారయిన కుండ కావచ్చు! అన్నింటిలో ఉండే ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉండే ఆకాశం అంతా ఒక్కటే! పైన ఉన్న ఆకాశమే లోపల కూడా నిండి ఉంటుందే కానీ రెండు వేర్వేరు ఆకాశాలు లేవు.

***

అలాగే మనం కూడా! “ఈ సృష్టిలో జన్మ తీసుకున్న కుండ వంటి శరీరంలో ఉన్నది ఆత్మ .. మరి విశాల విశ్వంలో విస్తరించి ఉన్నది కూడా ఆత్మే! ఆ ఆత్మే ఇక్కడా .. అక్కడా ప్రకాశిస్తోంది. అక్కడా ఇక్కడా ఉన్నవి రెండు వేర్వేరు ఆత్మలు ఎంత మాత్రం కావు.”

                                                                                                              ***

“కుండ పగలినప్పుడు ఆకాశం పగిలిపోదు .. అలాగే మన శరీరం చనిపోతే మన ఆత్మకు ఏమీ కాదు. కుండను నిప్పుల్లో వేసి కాలిస్తే అందులో ఉన్న ఆకాశం కాలిపోదు. అలాగే .. కష్టాలూ, సమస్యలూ వచ్చినప్పుడు మన ఆత్మ కూడా ఎంతమాత్రం బెదరదు. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా కష్టాలు రాగానే ‘మనమే దేవుళ్ళం’ అన్న సంగతిని మరిచిపోయి ‘అయ్యో! దేవుడా!’ అని ఏడవడం ‘మూర్ఖత్వం’ అనిపించుకుంటుంది.” “అవసరం మేరకు కుండలు మారుతాయే కానీ అందులో ఉన్న ఆకాశం మాత్రం మారదు! అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచినా మరి ఎన్ని యుగాలు మారినా మన దేహాలు మాత్రమే మారుతూంటాయి కానీ అందులో ఉండే ఆత్మమాత్రం మారదు! స్త్రీలాగా, పురుషుడిలాగా, తల్లిలాగా, తండ్రిలాగా, కొడుకులాగా, కూతురులాగా, రాజులాగా, సేవకుడిలాగా, వ్యాపారవేత్తలాగా, ఇలా రామాయణంలో ఒకలా .. భారతంలో మరొకలా .. రకరకాలుగా తన ఇష్టం వచ్చినట్లు ఆత్మ దేహాలను మార్చుకుంటూనే ఉంటుంది.” “ఆత్మ మాత్రం జన్మజన్మకూ మరింత .. మరింత అనుభవజ్ఞానంతో నిండిపోతూ .. మరింత సౌందర్యవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. దేహంలో ఉంటే ‘ఆత్మ’గా .. ధ్యానంలో ఉంటే ‘చిదాత్మ’గా .. ఆత్మజ్ఞానంతో పరిపుష్టం అయితే ‘సర్వాత్మ’గా .. ఇలా ఆత్మ యొక్క ఎదుగుదలతో అన్ని స్థితిలూ అన్నీ పరిపూర్ణంగానే ఉంటాయి.” “విత్తనం నుంచి చెట్టు .. చెట్టు నుంచి పుష్పం .. పుష్పం నుంచి విత్తనం .. మళ్ళీ విత్తనం నుంచి మళ్ళీ చెట్టు ఇలా పరంపర కొనాసాగినట్లు ఆత్మ .. శైశవాత్మగా .. బాలాత్మగా .. యవ్వనాత్మగా .. ప్రౌఢాత్మగా .. వృద్ధాత్మగా .. మళ్ళీ బాలాత్మగా తన ఆత్మ ప్రయాణం పరంపరగా చేస్తూనే ఉంటుంది. ఇదంతా తెలుసుకోకపోతే ఆ ఆత్మకు ప్రయాణం కష్టంగా ఉంటుంది. మరి తెలుసుకొంటే సుఖంగా మరి సునాయసంగా ఉంటుంది!” “ఒకానొకసారి జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు తమ శిష్యులతో కలిసి వెళ్తూ ఉంటే .. వారిని పరీక్షించాలని శివుడు ఒక ఛండాలుడి రూపంలో ఆయన దారికి అడ్డంగా వచ్చాడు.” “‘ఏయ్ తప్పుకో’ అన్నారు ఆదిశంకరులు! దానికి ఆ ఛండాలుడు ‘ఎవరిని తప్పుకోమంటున్నావు? జడమైన శరీరాన్నా? లేదా అంతాటా వ్యాపించి ఉన్న శరీరంలోని బ్రహ్మ పదార్థాన్నా? ఏవిధంగా చూసినా అది సంభవం కాదు’ అని జవాబు ఇచ్చాడు!” “ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్న స్వామీజీ .. వెంటనే దివ్యదృష్టితో ఆ ఛండాలుడిలోని శివుడిని దర్శించి అతనికి మోకరిల్లాడు. ‘భజగోవిందం భజగోవిందం .. గోవిందం భజ మూఢమతే’ అంటూ మహాకావ్యాన్ని రచించారు.” “అందులో ‘గోవిందుడు’ అంటే కృష్ణుడో మరెవ్వరో కాదు. మనలో ఉన్న ఆత్మ! ఆ ఆత్మను దర్శించుకోవాలే కానీ గీతాలను భజించుకుంటూ కూర్చోరాదు. భజనలూ, గీతాలూ కళలకు సంబంధించినవి. అవి పాడితే మనస్సు రంజిస్తుందే తప్ప వాటిలోని అంతరార్థం మాత్రం అర్థం కాదు! కనుక కళలను చూసి మురిసిపోయి అక్కడే ఆగిపోకుండా .. అందులోని శాస్త్రాన్ని పరిశోధించి .. ఆత్మజ్ఞానపరాయణులం కావాలి. అలా చేసినప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది!”