ఆత్మయొక్క అసలు కథ

 

ఆత్మ అన్నది .. భౌతికం కాదు

ఆత్మ అన్నది .. మూలచైతన్య “శకలం కాని శకలం”

ఆత్మ అన్నది .. భౌతిక రూపురేఖలు లేనిది

ఆత్మ అన్నది .. కేవలం “అనుభవాల రూపురేఖలు” కలది

ఆత్మ అన్నది .. భౌతిక బరువులు లేనిది

ఆత్మ అన్నది .. కేవలం “అనుభవాల బరువు”ను కలిగివున్నది

ఆత్మ యొక్క తపన ఎప్పుడూ నూతన అనుభవాల కోసమే

ఆత్మ యొక్క తపన ఎప్పుడూ భిన్న విభిన్న అనుభవాల కోసమే

ఆత్మకు అన్ని పరిస్థితులూ ఆశ పుట్టించేవే

ఆత్మ అన్నది ” అన్ని పరిస్థితులనూ అవగాహన చేసుకోవాలి” అని సదా ఆతృతపడేదే

ఆత్మకు ఓటమి అన్నదే లేదు .. ఒక్క “ఆత్మహత్య” చేసుకున్నప్పుడు తప్ప

( “ఆత్మహత్య మహాపాపం” అని చెప్పబడింది కదా )

ఆత్మకు ఉన్నదంతా గెలుపే .. ఆత్మకు ఉన్నదంతా నిత్యనూతనత్వమే

ఒకానొక ఆత్మ .. ఒకానొక మానవ శరీరధారణ చేసినప్పుడు ..

ఒకానొక జీవితస్థితిని ఎదుర్కొంటుంది

ఆ తరువాత .. ఇక రకరకాల జీవిత పరిస్థితులను అనుభవించడానికి ఆరాటపడుతూంటుంది

మానవ జీవిత పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోవడానికి

ఆత్మకు కనిష్టపరంగా నాలుగువందల జన్మలు అవసరం ఉంటుంది

మరి నాలుగువందల జన్మల్లో ఆరితేరిన ఆత్మ

ఒకానొక “అనుభవాల పుట్ట” గా తయారవుతుంది.

అనేకమార్లు జన్మించి .. అంటే అనేకమార్లు శరీరంలోచేరి

అనేకమార్లు మరణించి .. అంటే అనేకమార్లు శరీరంలోంచి బయటపడి

అనేక రకాల అవమాన-దుఃఖ-తిరస్కారాదులను భరించి

అనేకమార్లు మాన-సుఖ-పురస్కారాదులను అనుభవించి

ఒక సంపూర్ణ “జ్ఞానపు పుట్ట” గా తయారవుతుంది

ప్రతి జన్మ కూడా ఆత్మకు అనేకానేక అనుభవాలను అందిస్తుంది

ప్రతి అనుభవం కూడా ఆత్మకు ఒకానొక విశిష్టజ్ఞానసారాన్ని ప్రసాదిస్తుంది

ఇదీ ఆత్మ కథ

ఆత్మ అన్నది .. ప్రప్రధమంగా .. ఒక అనుభవాల పుట్ట

ఆత్మ అన్నది .. పర్యవసానంగా .. పరంపరగా .. ఒక జ్ఞానపు పుట్ట

ఇదీ ఆత్మ యొక్క అసలు కథ