అంతా పూర్ణమే
అనేక రకాల వైవిధ్యాలతో కూడి తనదైన ప్రత్యేకతను కలిగివున్న ఈ సృష్టిలో .. ప్రతి ఒక్కటీ గొప్పదే .. ప్రతి ఒక్కటీ సత్యమే .. ప్రతి ఒక్కటీ పూర్ణమే !
“ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్యః పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”
అంటూ ఈశావాశ్యోపనిషత్ మనకు అద్భుతమైన శాంతి సందేశాన్ని ఇచ్చింది.
“అది పూర్ణమే, ఇదీ పూర్ణమే .. పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే మిగిలేదు పూర్ణమే !”
ఈ సకల చరాచర సృష్టిలో వున్న ప్రతి ఒక్కటీ పూర్ణమే మరి ప్రతి ఒక్కటీ విశిష్ఠమైనదే ! పుట్టాక ఈ భూలోకం ఎంత క్రొత్తగా కనిపిస్తుందో .. చనిపోయాక పైలోకాలు కూడా అంతే క్రొత్తగా కనిపిస్తాయి.
ఇలా “ఈ సృష్టి అంతా అనేక రకాల వైవిధ్య భరితమైన స్థితులతో అలరారుతున్న ఏకత్వం యొక్క విశ్వరూపమే” !అన్నది అర్థం చేసుకోకుండా ఆజ్ఞానంతో “ఇది తప్పు, అది తప్ప” .. ” వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు ” .. ” ఇది సరియైనది, అది సరికానిది ” అంటూ సృష్టిరచనను తప్పు పట్టకూడదు.
నడక నేర్చుకుంటూన్న చిన్నపిల్లవాడు వేసే తప్పటడుగులు “తప్పులు” కానట్లే .. ఈ ప్రపంచంలో ఏ ఒక్కటీ “తప్పు” కాదు. సంగీతం నేర్చుకునేటప్పుడు మొదట్లో అపస్వరాలు సహజంగానే పలికినట్లు .. సత్యాన్ని అవగాహన చేసుకునే క్రమంలో ప్రతిఒక్కరూ “తప్పులు” చేస్తూనే వుంటారు ! కాలక్రమంలో ఆ తప్పులను సహజంగానే సరిదిద్దుకుంటూనే వుంటారు.
ఇదంతా ప్రకృతి సహజం ! సూర్యుడు ఉదయించినప్పుడు ఎంతో అందంగా, ఆహ్లాదంగా వుంటాడు. అదే సూర్యుడు మధ్యాహ్నం సమయంలో చండప్రచండంగా నిప్పులు క్రక్కుతూ వుంటాడు. మళ్ళీ సాయంత్రానికి చల్లబడిపోయి హాయి గొలుపుతూ ఉంటాడు. పూర్ణస్వరూపం అయిన సూర్యుడు ” ఒకప్పుడు మంచిగా వున్నాడు .. మరొకప్పుడు మంచిగా లేడు ” అనుకోగలమా? !
అలాగే చంద్రుడు కూడా ! విదియ, తదియ మొదలుకుని అమావాస్య లేదా పౌర్ణమి వరకూ చంద్రుడు ఏ రోజు బాగుండడు? అన్ని రోజులూ చల్లనైన తన వెన్నెలను విరజిమ్ముతూ అందంగానే ఉంటాడు ! అన్ని రోజులూ, అన్ని స్థితుల్లో కూడా పూర్ణంగానే వున్నాడు.
ఒకానొక సితార్ విద్వాంసుడు తన పెళ్ళి అయిన రోజు కచేరీ చేసి ఎంతో ఆనందంగా సితార్ మీద అద్భుతమైన రాగాలను పలికించాడు. అదే విద్వాంసుడు మళ్ళీ ఇంకోసారి కచేరీ చెయ్యాల్సి వచ్చినప్పుడు పాపం క్రితం రోజు రాత్రి అతని తల్లి అకస్మాత్‌గా మరణించడంతో అతను “సంగీత కచేరీకి వెళ్ళలేను” అనుకున్నాడు. కానీ స్నేహితుల బలవంతం మీద కచేరికీ వెళ్ళి .. సితార్ పై రాగాలు పలికించాడు.
కానీ ఆనందానికీ మరి దుఃఖానికీ వున్న తేడా అతని రాగాలలో ప్రతిబింబించడంతో అతని తల్లి చనిపోయిన విషయం తెలియని శ్రోతలు “కచేరీ అంత గొప్పగా ఏం లేదు” అని పెదవి విరిచారు. పూర్ణత్వానికి ప్రతీక అయిన ఆ సంగీతజ్ఞుడు తల్లిపోయిన దుఃఖాన్ని దిగమ్రింగుకుని కూడా వచ్చి అంత మాత్రమైనా కచేరీ చేయడం ఎంత అద్భుతమైన విషయం !
అలాగే మంచి “బ్యాటింగ్ పిచ్” మీద సెంచరీ చేసి చప్పట్లు కొట్టించుకున్న ఒకానొక బ్యాట్స్‌మెన్ .. ఇంకో ఆటలో ఇంకో పిచ్ మీద పది రన్లు కూడా చెయ్యలేకపోతే అంతకు ముందు చప్పట్లు కొట్టిన ప్రేక్షకులే అతనిని తిట్టిపోస్తారు. ” ఆ ‘ పిచ్ ’ కూ .. ఈ ‘ పిచ్ ’ కూ మధ్య తేడా వుంది కాబట్టే బ్యాట్స్‌మెన్ ఆటలో మార్పు వచ్చింది ” అని వాళ్ళకు తెలియదు.
“అయిదు రన్స్ కొడితేనే కష్టం అనుకునే ఆ పిచ్ పై పది రన్స్ కొట్టడమే గొప్ప” అన్నది ఆ పిచ్ నాణ్యత తెలిసిన బ్యాట్స్‌మెన్‌కీ మరి ఆటలో నైపుణ్యం వున్నవాడికీ మాత్రమే తెలుస్తుంది ! కానీ టీవీలో ఆటను చూసి పెదవివిరిచే వారికి అది ఎంత మాత్రం తెలియదు.
“రకరకాల సమస్యలు” అనే సుడిగుండాలలో మన జీవితం గిరగిరా సదా తిరుగుతూనే వుంటుంది. ఆ సుడిగుండాల్లో ఎవరు ఎంత చేసినా అది పర్ఫెక్ట్గానే వుంటుంది. చూసేవారికి ఆ సుడిగుండం యొక్క వేగం, లోతు తెలియదు కాబట్టి వాళ్ళకు తోచిందేదో అంటూంటారు. కాబట్టి సంగతి తెలుసుకుని మాట్లాడాలి ! ఇదంతా కూడా “ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం” అన్నదానిని సమగ్రంగా అధ్యయనం చేసిన వారికే తెలుస్తుంది.