ఇంగిత జ్ఞానం

 

మనిషికి ఉన్న సహజ లక్షణం పుట్టుకతో వచ్చినది – పశుత్వం. పసి పాపగా ఉన్నప్పుడు కేవలం తినడం, త్రాగడం, పడుకోవడం అలాంటి శుద్ధ శారీరక చర్యలే ఉంటాయి. దీన్నే పశుత్వం అనవచ్చు; లేదా పసిత్వం అనవచ్చు; మానవుడు కనుక పశుత్వం అనం … పసిత్వం అంటాం.

పసిత్వం తర్వాత వచ్చేది బాల్యత్వం; ఈ బాల్యత్వంలో మానవుడికి శరీరంతో పాటు ఒక మనస్సు అనే పదార్ధం క్రమక్రమంగా నిర్మాణమవుతుంది. ఇదే కేవలం మనస్సు అనే దాని కన్నా మనస్సు – బుద్ధి అనే రెండు పదార్ధాల కలయిక అని చెప్పవచ్చు దీనినే ఇంగ్లీషులో మైండ్ అంటాం.

మానవుడు, తన పరిసరాలను అర్ధం చేసుకోడానికి ఈ మైండ్ అన్నది ఒక ఉపకరణం. ఆ బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత, తన పొట్ట తానే పోషించడానికి, తన రక్షణ తానే చేసుకోడానికి, సిద్ధపడటంలో సమాజం శిక్షణ ఇవ్వటానికి ఎంతో ఉబలాట పడుతూంటుంది.

పసిత్వంలో స్వంత పోషణ, స్వంత పరిరక్షణ ఉండదు. బాల్యత్వంలో ఆ స్వంత పోషణా … స్వంత పరిరక్షణా శిక్షణ ఇవ్వబడుతుంది. చుట్టుప్రక్కల ఉన్న పరిసరాల అవగాహన కోసం అనేక విద్యలు నేర్పించబడుతూ వుంటాయి. బాల్యవస్థ దాటి యువావస్థ లో ప్రవేశించినప్పుడు మొదలవుతుంది మానసిక సంఘర్షణ.

ఈ అజ్ఞానపు ప్రపంచంలో ఉన్న అన్యాయాలకూ, పోటీతత్వానికీ ఆ యవ్వన ప్రపంచమంతా నూటికి 99.9 శాతం బలయిపోతుంది. ఒకవైపు అందరికంటే ప్రథముడు కావాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఇంకోవైపు సమాజంలో తనకన్నా అందరూ అధికులుగా వుండడం, ముందు నుయ్యి, వెనుక గొయ్యి లా ఉండే పరిస్థితి – ఫలితంగా – మౌలికమైన ఇంగిత జ్ఞానం మృగ్యమవుతుంది – దాని పర్యవసానం హత్యలూ, ఆత్మహత్యలూ, మానసిక రుగ్మతలూ ఇంకా ఎన్నో, ఎన్నెన్నో …

యవ్వనావస్థలో మౌలికమైన ఇంగిత జ్ఞానం కోల్పోయి, ప్రౌఢావస్థలో ఆ ఇంగిత జ్ఞాన లేమి అన్నది మరింత బలోపేతమై కుల, మత, వర్గ, జాతి విభేదాలుగా పరాకాష్టనందుకుంటాయి.

మాది కమ్మ సంఘం, మాది రెడ్డి సంఘం, మాది బలిజ సంఘం, మాది ముస్లిముల సంఘం … అని చెప్పడంలో ప్రపంచమంతా సర్వనాశనమవుతోంది.

వాస్తవానికి మౌలికమైన ఇంగితజ్ఞానం ఏమిటి?

మౌలికమైన ఇంగితజ్ఞానం అన్నది ఏమిటంటే – కలిసి ఉంటే కలదు సుఖం అనీ, సమాజాన్ని పోటీతత్వం అనేది వెన్నుపోటు పొడుస్తోంది అనీ తెల్సుకుని ఉండటమే.

ప్రక్కవాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. దీని పేరే ఇంగిత జ్ఞానం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు ఎంతయినా అవసరం. దీని పేరే ఇంగితజ్ఞానం.

ప్రతి వస్తువుకూ విలువ ఉంటుంది దేనినీ వృధా చేయరాదు. – దీని పేరే ఇంగితజ్ఞానం. ఏది వ్యర్ధ పదార్ధం కాదు. – దీని పేరే ఇంగితజ్ఞానం.

ఎవరూ సృష్టిలో పనికిరాని వాళ్ళు కారు. దీని పేరే ఇంగితజ్ఞానం.

ప్రతి ప్రాణిలో అంతఃశక్తి అపారంగా వుంటుంది. ఈ అవగాహనే – ఇంగితజ్ఞానం.

ప్రతిప్రాణీ ఇంకొక ప్రాణి మీద ఆధారపడుతూంటుంది. ఏ ప్రాణీ తనకు తాను స్వతంత్రం కాజాలదు. అని తేల్చుకోవటమే ఇంగితజ్ఞానం కలిగి ఉండటం.

పెరిగే పిల్లాడికి – పెంచే సమాజం ఎప్పుడూ మౌలికంగా ఇవ్వవలసింది ఇంగితజ్ఞానం. తల్లిదండ్రులు పిల్లలకు ఇంగిత జ్ఞానాన్ని కలిగించాలి. తల్లిదండ్రులు బిడ్డలలో ప్రతి రోజూ ఇంగితజ్ఞానాన్ని పరిపోషించాలి. అలాగే పాఠశాలల్లో, కళాశాలల్లో, ఉపాధ్యాయులయిన వారు విద్యార్ధులలో మౌలికమైన ఇంగిత జ్ఞానం పట్ల శ్రద్ధ చూపాలి.

పాఠశాలల్లో, కళాశాలల్లో, జంతు శాస్త్రం, భూగోళ శాస్త్రం ఈ విధంగా మరి ఇతర శాస్త్రల తరహాలో ఇంగితశాస్త్రం అన్నది కూడా విధిగా ఒక పాఠ్యాంశం కావాలి. ఉదాహరణకు – తెలియకుండా తెలిసినట్లు మాట్లాడ్డం – ఇంగిత జ్ఞానం యొక్క లేమి.

వున్న అకలి కన్నా ఎక్కువ తినడం – ఇంగితజ్ఞానలేమి.

ఈ విధంగా ఇంగిత జ్ఞాన శాస్త్ర బోధన అనేది మౌలికమైన విద్యా విధానం కావాలి.

ధ్యానులు కాని తల్లిదండ్రులకు ఇంగితజ్ఞానం శూన్యం. ధ్యానులు కాని సమాజ పెద్దలలో, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులలో ఇంగిత జ్ఞానం శూన్యంగా వుంటుంది. మనిషిలో క్రోధం, ఆవేశం, ఇవన్నీ ఇంగిత జ్ఞాన లేమి యొక్క విశేష రూపాలు.

ధ్యాన శాస్త్రమనేదే మనుష్యులందరిలో ఇంగితజ్ఞానం కలిగించే ఇంగితశాస్త్రానికి మౌలికమైన శాస్త్రం. ధ్యాన శాస్త్రమంటే ఎప్పుడూ ఆ మనస్సు – బుద్ధి అనే పదార్ధాన్ని ప్రశాంతంగా వుంచుకునే శాస్త్రం.

ఎక్కడ మనస్సు – బుద్ధి అనే పదార్ధం ప్రశాంతంగా ఉండదో అక్కడ మనస్సు అతి కోరికలతోనూ, బుద్ధి విపరీత ధోరణులలోనూ, అస్తవ్యస్తమై ఉంటుంది.

ఎక్కడైతే ధ్యానశాస్త్రం ద్వారా – ధ్యాన అభ్యాసం ద్వారా మనస్సు – బుద్ధి అనేవి ప్రశాంతం చేయబడి వుంటాయో, అక్కడ మనస్సు సమతుల్యమైన కోరిక తోనూ, బుద్ధి సరియైన విజ్ఞానం తోనూ విరాజిల్లుతూ వుంటాయి.

ఓ ఆటవిక సమాజం, ఓ నాగరికత సమాజం గా మారాలంటే ఆటవికులు నాగరికులు గా మారాలంటే ఆ ఆటవిక పోయి నాగరికత రావాలి ప్రతి మనిషిలోనూ.

ఇంగిత జ్ఞానలేమి అన్నదే ఆటవికత, ఇంగితజ్ఞాన విశేషమే నాగరికత, వెరసి ధ్యాన శాస్త్రమే ఆటవికులను మౌలికంగా నాగరికులుగా చేసేది.