ఇకనుంచి మనది ఆధ్యాత్మికంగా అధికార పక్షం

 

ఇప్పుడు “ధ్యాన మహాచక్రం” అనే పెద్ద “పని సంబరం” మన ముందున్నది. పిరమిడ్ మాస్టర్లందరికి ఎప్పుడూ గొప్ప గొప్ప సంబరాలే వుంటాయి. విశ్వానికి సంబంధించిన ఎంత బరువైన పని మన నెత్తిమీద పెట్టుకుంటే .. మనకి అంత పెద్దగా ఆనందం, మరి ఆరోగ్యం వుంటాయి. పని ఎక్కువగా కల్పించుకోవడమే పిరమిడ్ మాస్టర్లకు అలవాటు; బరువైన పనులను ఒకదాని తరువాత ఒకటి నెత్తిమీద పెట్టుకుంటూ వుండటం అన్నది పిరమిడ్ మాస్టర్లకు వెన్నతో పెట్టిన విద్య.

1999 నుంచి 2009 వరకు మనం ప్రతియేటా ధ్యానయజ్ఞాలు మహోన్నతంగా నిర్విహించుకుంటూ వస్తూన్నాము. ప్రతిసారీ “అత్యంత వైభవంగా ధ్యానమహాయజ్ఞం నిర్వించుకోవాలి” అని సంకల్పించుకోవడం .. ధన సమీకరణ చేసుకోవడం .. అనుకున్నదానికంటే ఇంకా అద్భుతంగా దానిని పూర్తిచేసుకోవడం .. లక్షలాది మంది క్రొత్తవాళ్ళకు ధ్యానాన్ని పరిచయం చేయడం .. తీరా అంతా అయిపోయాక చూసుకుంటే .. జేబులో చిల్లిగవ్వ కూడా లేక చుట్టూ అప్పులతో బిక్కముఖాలు వేయడం .. అంతలోనే వైరాగ్యం; అయినా వెంటనే .. మళ్ళీ ఇంకా అంతకంటే పెద్ద లోకకళ్యాణ కార్యక్రమానికి నాంది పలకడం.

2010 డిసెంబర్ 21 నుంచి 31 వరకు .. ఆధ్యాత్మిక చరిత్రలోనే మకుటాయమానంగా నిలిచిపోబోయే .. ధ్యానమహాచక్రం నిర్వహణలో పాలుపంచుకోబోయే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక “C.E.O.” అంటే “ముఖ్య కార్యనిర్వహణాధికారి”.

“నేనొక్కడినే ఈ మహా కార్యక్రమాన్ని ప్రపంచమంతా అచ్చెరువొందేలా నిర్వహించాలి” .. అన్నంత ఆత్మీయ స్ఫూర్తితో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పనిచేయాలి అన్నది నా ఆకాంక్ష.

1999 నుంచి 2009 వరకు మనం ఆధ్యాత్మికంగా విప్లవ పక్షంలో వున్నాం. ” ‘ధ్యాన విప్లవం’, ‘శాకాహార విప్లవం ‘పిరమిడ్ విప్లవం’ .. విప్లవాలన్నీ వర్థిలాలి వర్థిలాలి అంటూ దేశాలన్నీ తిరిగాము. రకరకాల ఆధ్యాత్మిక విప్లవకారులంతా ఈ సమయంలో మనతో కలవడంతో గత పది సంవత్సరాలుగా మనం ఏవైతే “వర్థిల్లాలి, వర్థిల్లాలి” అంటూ తిరిగామో .. అవన్నీ ఇప్పుడు వర్థిల్లడం మొదలైంది. ఇక దాంతో మనం 2010 నుంచి ఆధ్యాత్మికంగా .. ప్రతిపక్షంలోంచి .. అధికార పక్షంలోకి వచ్చేసాము.

ఇక 2010 డిసెంబరులో మనం జరుపుకొబోయె “ధ్యాన మహాచక్రం” ప్రపంచ దేశాలన్నింటిలో ఒక ఆధ్యాత్మిక మహాసునామీని సృష్టంచబోతోంది ; మరి 2020 వరకు మనం ప్రతి యేట ఇలాంటి ధ్యానమహాచక్రాలు జరుపుకుంటూనే వుంటాము.

ప్రతి జీవికి స్వాతంత్ర్యం కావాలి. సకల పక్షిజాతి, సకల జంతుజాతి, సకల జలజాతి హాయిగా జీవించాలి. వీటన్నింటి పై మనిషి సాగిస్తున్న దారుణ మారణకాండకు స్వస్తి చెప్పాలి; ఎక్కడ ఏ జంతువు కూడా చంపబడకూడదు. 2020 కల్లా శాకాహార అంటే అహింసా జగత్ నెలకొనే తీరాలి.

పురుషులుగావుండి స్త్రీలపై దౌర్జన్యం చేయడం, పెద్దవాళ్ళుగా వుండి చిన్నవాళ్ళ పై దౌర్జన్యం చేయడం, ధనికులుగా వుండి పేదవాళ్ళపై దౌర్జన్యం చేయడం, నగరాల్లో వుండి పల్లెటూరి వాళ్ళపై దౌర్జన్యం చేయడం.. ఇలాంటి రకరకాల దౌర్జన్యాలన్నీ మటుమాయం కావాలి.

పురుషులందరు కూడా .. స్త్రీతత్వాన్ని తప్పక అలవరుచుకోవాల్సిన అవసరం వుంది .. మరి అందుకోసమే శివుడు అర్థనారీశ్వరుడు కావాల్సి వచ్చింది! ఎప్పుడైతే పురుషజాతి అంతా కూడా స్త్రీ జాతి సహజ లక్షణాలైన క్షమ, దయ, ఓర్పు, ప్రేమ, వినయం వంటి దైవగుణాలతో కూడిన “అర్థనారీశ్వరజాతి” అవుతుందో .. అప్పుడే ప్రపంచం అంతా కూడా శాంతిమయం అవుతుంది.

ఈ ప్రపంచాన్ని “ధ్యాన జగత్” గా, “శాకాహార అహింసా జగత్” గా మరి “పిరమిడ్ శక్తి జగత్” గా మార్చాలంటే అది ఒక్క మన పిరమిడ్ మాస్టర్లకే సాధ్యం.

“సన్యాసం”

“సమ్యక్ న్యాసం” = “సన్యాసం”

‘సమ్యక్’ = ‘సరియైన’

‘న్యాసం = ‘వదిలి పెట్టడం’.

కనుక “సన్యాసం” అంటే,

“ఏవి అయితే వదలిపెట్టాలో వాటిని వదలి పెట్టడం”

“ఏవి అయితే త్యాజ్యనీయమో వాటిని త్యజించడం”

అయితే వేటిని వదలి పెట్టాలి?

“నేను ఇదే” అనే భావాన్ని;

“నేను ఇంతే” అనే భావాన్ని

“నేను వేరే,నువ్వు వేరే” అనే భావాలను;

“ఇది నాది” అనే భావాన్ని.

చేయవలసింది “సర్వ ‘సంఘ’ పరిత్యాగం” కాదు ..

చేయవలసింది “సర్వ ‘సంగ’ పరిత్యాగం”!

“సంఘం” అంటే “చుట్టుప్రక్కల వున్న వ్యక్తుల సముదాయం”

“సంగం” అంటే “మితమీరిన ‘నా’ అనే భావన”

అంటే ” ఆన్ డ్యూ ఎటాచ్ మెంట్ ‘ అన్నమాట.

కలిసి వుండాలి ‘సంఘం’తో .. కాని ‘సంగం’ లేకుండా!

-“పద్మపత్రమివాంభస”

“తామరాకు మీద నీటిబొట్టు వున్నట్లు” అన్నమాట.

* సంఘం వాంఛనీయం; అది మన పురోగతికి తప్పనిసరి

* ‘సంగం’ అవాంఛనీయం; అది మన పురోగతికి గొడ్డలిపెట్టు

* సర్వ ‘సంగ’ పరిత్యాగమే సమ్యక్ న్యాసం