అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు
జీవితంలోని ప్రతి ఒక్కరోజునూ మనం “ఇదే మన జీవితంలోని ఆఖరి రోజు” అన్నట్లు సంపూర్ణంగా మరి సత్యపూర్వకంగా జీవించాలి. ఒకరోజు ఒకానొక పెద్దమనిషి నా దగ్గరికి వచ్చి: “స్వామీజీ! మీరు నా భవిష్యత్తు చూసి చెప్పండి” అన్నాడు. నేను సింపుల్‌గా “నువ్వు నిశ్చితంగా చావబోతున్నావు నాయనా” అని చెప్పాను. భయపడిపోయిన అతడు “నేను చనిపోతే మరి నా పిల్లల భవిష్యత్తు ఏమిటి స్వామి?” అని అడిగాడు ఆందోళనగా!
“వాళ్ళు కూడా నిశ్చితంగా చచ్చిపోతారు” అని చెప్పాను. మళ్ళీ వెంటనే “శరీరవత్ చావు అందరికీ వుంటుంది. కానీ ఆత్మవత్ చావు ఎవ్వరికీ, ఎన్నటికీ ఉండదు! కనుక నువ్వు అశాశ్వతమైన శరీరాన్ని గురించి అంతగా ఆందోళన చెందక శాశ్వతమైన ఆత్మపోషణను గురించి ఆలోచించు” అని చెప్పాను. అందుకే ప్రతిరోజు మనం మన శరీరపోషణ కోసం ఆకలి వేసినప్పుడల్లా పరిశుభ్రమైన ఆహారాన్ని రకరకాల రుచులతో భుజించినట్లు ఆత్మ పోషణ కోసం సత్యాన్ని “రకరకాల సంఘటనల” రూపంలో “రకరకాల అనుభవజ్ఞానం” గ్రహిస్తూ వుండాలి.
ఒకసారి దేవతలంతా కలిసి ఒకానొక దైవకార్య నిర్వహణ కోసం కైలాసంలో ఉన్న పరమశివుడు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన శ్రద్ధగా ధ్యానం చేసుకోవడం కోసం “స్వామీ! సర్వాంతర్యామి అయిన మీ కోసం మేమంతా ధ్యానం చేస్తూంటేమరి మీరు ఎవరికోసం ధ్యానం చేస్తున్నారు?” అని అడిగారు ఆశ్చర్యంగా!
దానికి పరమశివుడు “మీ ధ్యానం ద్వారా మీరు మీ ఆత్మయొక్క ఆకలిని తీర్చుకున్నట్లే .. నేను కూడా నా ధ్యానం ద్వారా నా ఆత్మ యొక్క ఆకలిని తీర్చుకుంటున్నాను” అని చెప్పాడు.
సర్వాంతర్యామి అయినా .. సామాన్య మానవుడు అయినా ప్రతిఒక్కరూ ఆత్మస్వరూపులే .. మరి ప్రతి ఒక్కరూ తమ ఆత్మ పోషణను విధిగా చేపట్టవలసిందే! పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ధ్యాన ప్రచారం ద్వారా ఇటువంటి ఆత్మసత్యాలను ప్రతి ఒక్కరికీ శాస్త్రీయంగా గుర్తుచేయడానికే, మరి అందజేయడానికే అంకితమై పనిచేస్తోంది. ఈ సందర్భంగా మనం మరొక్కసారి ఆరు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలను మననం చేసుకుందాం:
ఆత్మసిద్ధాంతం:- “నేను అశాశ్వతమైన ఈ శరీరంలో నివసిస్తూన్న శాశ్వతమైన ఆత్మను; భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన రకరకాల అనుభవజ్ఞానంతో నన్ను నేను ఉద్ధరించుకునే క్రమంలోనే నేను ప్రస్తుత జన్మలో ఈ శరీరాన్ని ధరించి .. ఇక్కడ సంబంధ బాంధవ్యాలనే వ్యవహారాలను నిర్వహిస్తున్నాను” అన్నది తెలుసుకోవడం మొట్టమొదటి ఆధ్యాత్మిక సిద్ధాంతం.
జన్మ-పునర్జన్మ సిద్ధాంతం:- ఆత్మస్వరూపాలమయిన మనం రకరకాల అనుభవాల కోసం .. ఒక జన్మలో ఆడగా, ఒక జన్మలో మగగా .. ఒక జన్మలో భార్యగా, ఒక జన్మలో భర్తగా .. ఒక జన్మలో రాజుగా మరొక జన్మలో ప్రజగా .. ఒక జన్మలో ధనవంతుడిగా మరొక జన్మలో బికారిగా .. ఒక జన్మలో డాక్టరుగా మరొక జన్మలో రోగిగా .. బాలుడిగా, బాలికగా, యువకుడిగా, ముసలిగా, రాజకీయ నాయకుడిగా, సన్యాసిగా .. ఇలా ప్రపంచంలో ఉన్న వివిధ రకాల పాత్రలను ధరిస్తూ .. రకరకాల జన్మలు తీసుకుంటూ .. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైన అనుభవజ్ఞానాన్ని గ్రహిస్తూ ఎదుగుతాం. ఈ జన్మలన్నీ కూడా మన స్వంత ఇచ్ఛప్రకారం మనమే ఎంపిక చేసుకుని పుడతాం.
కర్మ-కర్మఫల సిద్ధాంతం:- ఆత్మస్వరూపాలమయిన మనం ఇలా రకరకాల శరీరాల ఎంపికల ద్వారా రకరకాల జన్మలు తీసుకున్నప్పుడు ఆ యా జన్మల్లో మనం అనేకానేక కర్మలు విధిగా చేస్తూంటాం. అంతకు ముందు జన్మల్లో మనం పొందిన ఆత్మజ్ఞాన పరిణితిని బట్టి ఆ కర్మలను మనం ఆత్మ చైతన్యపు ఎరుక లేకుండా చేస్తున్నామా అన్న దానిని బట్టి ఆయా కర్మల యొక్క పర్యవసానం ఆధారపడి ఉంటుంది.
సదా-పురోగమన సిద్ధాంతం:- ఇలా ఆత్మచైతన్యపు ఎరుకతో కొన్ని, ఆత్మ చైతన్యపు ఎరుకలేకుండా కొన్ని కర్మలను చేపట్టడం ద్వారా మనం పొందే కర్మఫలితాన్ని బట్టి మన ఆత్మయొక్క తదుపరి పురోగమనం ఆధారపడి ఉంటుంది. మన ఎరుక స్థితిని బట్టి మనం చేపట్టే కర్మల్లో ‘విజయం’ ఎదురైనప్పుడు మనకు మనలోని బలాలు తెలుస్తాయి మరి ‘అపజయం’ ఎదురైనప్పుడు మనకు మనలోని బలహీనతలు తెలుస్తాయి. ఈ జ్ఞానంతో మనం ఇక ముందు చేపట్టబోయే కర్మలను వివేకజ్ఞానంతో బేరీజు వేసుకుంటూ సాగుతూంటే ఆత్మపరంగా మనం మరింత పురోగమనం చెందుతూంటాం!
” పరీక్షలో 24 మార్కులు వచ్చి, ఈ సారి పరీక్షలో 25 మార్కులు వచ్చాయి” అంటే “అప్పటికీ .. ఇప్పటికీ మనం ఒకమార్కు పురోభివృద్ధి చెందాం” అన్నది దాని అర్థం! దానికి మనం సంతోషించాలి! ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటూ ధ్యాన, స్వాధ్యాయ సజ్జన-సాంగత్యాదులతో కూడి కర్మలు చేస్తూంటేమనం ఆత్మపరంగా, మరింత వేగవంతంగా పురోగమనం సదా చెందుతూనే వుంటాం!
యోగ సిద్ధాంతం:- ఆత్మపరంగా మన నిజస్వరూపాన్ని తెలుసుకుని .. మనకున్న బలాబలాలేమిటో గుర్తించుకున్న మనం “మన ఆత్మతో సంయోగం”చెయ్యాలి! మన దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని అనేకానేక విశ్వ రహస్యాలను తెలుసుకోవాలి. విశ్వశక్తి ఆవాహన ద్వారా ప్రాణమయ కోశాన్ని శుద్ధపరచుకుని మన పంచేంద్రియాల మీద పట్టును సాధించాలి. అప్పుడే మన మనస్సు ఏకముఖం అవుతుంది.
శ్రద్ధ, సహనం అన్న లక్షణాలతో జీవితంలో అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులను “సోపానాలు”గా మలచుకోవాలి. అందరిలో ఉన్నప్పుడు అందరి విషయాలు వినపడుతూన్నా .. వినీ విననట్లు పట్టీ పట్టనట్లు ఉంటూ మనతో మనం అధికంగా కూడి ఉంటూ ధ్యానయోగ సాధన చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి ధ్యానయోగ సాధనలో ప్రతిక్షణం ఉన్నప్పుడే ప్రపంచం శాంతియుతంగా వుంటుంది. అందుకే “తస్మాత్ యోగీభవార్జున” అన్నాడు శ్రీకృష్ణుడు.
అనేకానేక సిద్ధాంతం:- ఈ ప్రపంచంలో మనం ఎన్ని మంచి పనులు చెయ్యగలం? ఎంత సేవ చేయగలం? ఎన్ని యజ్ఞాలు నిర్వహించగలం? ఎంత యోగ సాధన చెయ్యగలం? ఎన్ని పుస్తకాలు చదవగలం? ఎంత జ్ఞానం సేకరించగలం?ఎన్ని సజ్జనసాంగత్యాలను నిర్వహించగలం? ఎంత ధ్యానప్రచారం చెయ్యగలం? అన్నప్పుడు సమాధానం “ఎంతైనా” అని వస్తుంది! ఇది అంతా కూడా “అంతు లేని ఆత్మ కథ”! ఆది .. అంతంలేని ఈ ఆత్మ కథలో ఎవరు ఎంత నేర్చుకుంటే అంత పురోగతి .. ఎవరు ఎంత సాధన చేస్తే అంత అభివృద్ధి!!