“బృందావన బృందగాన లక్ష్యం”
“గాడ్” అంటే “సృష్టికర్త” “సృష్టికర్త” అంటే .. స్వయంప్రకాశాన్ని కలిగిన స్వీయ ఆత్మకల్యాణకారకుడు. నిరంతర ధ్యానసాధనతో అనేక వందల జన్మలు గడిపిన మనం అంతా కూడా ఆత్మస్వయంప్రకాశంతో కూడిన “స్వీయ సృష్టికర్త” అంటే “గాడ్” స్థాయిని ఏనాడో పొందివున్నాము.
ఇప్పుడు మనం గత అనేక జన్మలుగా చేస్తూ వచ్చిన లోకకల్యాణ కార్యక్రమాల ఫలితంగా పొందిన “గాడ్స్” అనబడే స్వీయ ఆత్మ కల్యాణ కారకుల స్థాయి నుంచి .. సామూహిక ప్రతిపత్తిని కలిగిన “సహసృష్టికర్తలు (Co-operative Creators)” అంటే .. “విశ్వకల్యాణ కార్యకర్తల” స్థాయికి ఎదగడం జరిగింది! అందుకే, ఇప్పుడు మనం అనేకానేక ఇతర లోకాలలోని ఆత్మస్వరూపులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ విశ్వకల్యాణ యజ్ఞంలో కళాకారులందరూ కూడా ఎవరికి వారే తమ తమ వాయిద్యాల ద్వారా అద్భుతమైన సంగీతాన్నీ, క్రొత్త క్రొత్త రాగాలనూ సృష్టించడంలో దిట్టలయి ఉంటారు.
దిట్టలయిన ఈ సృష్టికర్తలంతా కలిసి తమ తమ వాయిద్యాలైన సితార్, వేణువు, వయోలిన్, మృదంగం, తబలా.. వంటి వాయిద్యాలన్నింటి పై తమవైన రాగాలను పలికిస్తూనే .. ఇతరుల రాగాలాపనలతో వాటిని సమన్వయపరుస్తూ పరస్పర సహకారంతో చక్కటి “సింఫోనీ” నాదసంగీతాన్ని సృష్టిస్తారు.
ఇందుకు గాను వారు .. ఒకరి శృతిని మరొకరు ఎరుకలో ఉంచుకుంటూ .. ఒకరి లయను మరొకరు అందిపుచ్చుకుంటూ ఒకరి తాళంతో మరొకరి తాళాన్ని మేళవిస్తూ .. పరస్పర సహకారం చేసుకుంటారు. ఇక్కడ “ఎవరేం చేస్తారు?” అన్నది వారి వారి స్వంతం! కానీ అంతా కలిసి ఒకానొక అద్భుతాన్ని సృష్టిస్తారు!
అలాగే మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కూడా!
ఇక్కడ ప్రతి ఒక్క “పిరమిడ్ మాస్టర్” కూడా తమ తమ విభాగాలలో ఎవరికి వారే స్వయంప్రతిపత్తిని కలిగి ఉన్న సృష్టికర్తలు! అలాంటి సృష్టికర్తలంతా కలిసి పరస్పర సహకారంతో సహసృష్టికర్తలు గా తమ తమ సృష్టికళా నైపుణ్యాలను ఇతరుల సృష్టి కళానైపుణ్యంతో మేళవిస్తూ ఈ భూమ్మీద క్రొత్తగా “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” అనే మహాద్భుతాన్ని ఆవిర్భవింపజేశారు!
ధ్యానంతో విస్తృత ప్రయోగాలు చేస్తూ, అనుభవ జ్ఞానాన్ని ప్రోగుచేసుకోవడంలో మాస్టరీని పొందుతూన్న వీరిని చూసి ధ్యానం చెయ్యని వాళ్ళు స్ఫూర్తిని పొంది .. తాము కూడా ధ్యానం చెయ్యడం మొదలుపెడ్తారు! ఈ విధంగానే ప్రపంచం అంతా కూడా “ధ్యాన ప్రపంచం” అయి .. అందరూ తమ తమ బాధల నుంచీ, కష్టాల నుంచీ, రోగాల నుంచీ శాశ్వతంగా విముక్తి పొందుతారు!
సంగీతం రానివాడు ఏదో ఒకరోజు “ఇప్పటిదాకా నేనెందుకు సంగీతం నేర్చుకోలేదు?” అని ఏడ్చినట్లు .. సితార్ వాయించడం రానివాడు “ఇంతవరకు నేనెందుకు సితార్ నేర్చుకోలేదు?” అని వగచినట్లు .. ఏదో ఒకరోజు ఒకానొక ధ్యానం చెయ్యనివాడు “ఇప్పటిదాకా నేనెందుకు ధ్యానం నేర్చుకోలేదు?” అని దుఃఖపడాల్సి వస్తుంది!
ఈ ప్రపంచంలో ఏది చేసినా చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ ‘ధ్యానం’ చెయ్యకపోతే మాత్రం మనం ఎంతో కోల్పోవలసి వస్తుంది. దానివల్ల ఇక్కడ ఉన్నప్పుడే కాదు .. చనిపోయి ఇతర లోకాల్లోకి వెళ్ళాక కూడా ఎంతో దుఃఖపడాల్సి వస్తుంది! పై లోకాల్లో అంతా సత్యమే వుంది కానీ .. ఇక్కడికి వచ్చాక కొంచెం ‘మరుపు’ వచ్చి అది కాస్తా ‘అసత్యం’ గా మారిపోయింది.
“పిరమిడ్ మాస్టర్లు”గా మన పని అంతా కూడా ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ కొంచెం మరుపుని పోగొట్టి .. ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకునేట్లుగా చేయడం! సంగీత జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళంతా సంగీత కార్యక్రమాలలో కలిసి పనిచేసినట్లు, ఆత్మజ్ఞానంతో విలసిల్లే వారందరూ “పిరమిడ్ మాస్టర్లు”గా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో చేరుతూంటారు. చేరి మిత్రత్వం లో మరింత మరింత పట్టును సాధిస్తూ మిత్రత్వ దిట్టలుగా వెలుగుతూంటారు.
ధ్యానంలో మనకు విశ్వశక్తి లభించినా లేకపోయినా .. ధ్యానంలో మనకు మూడవకన్ను తెరుచుకున్నా లేకున్నా .. ధ్యానంలో మనకు సూక్ష్మశరీరయాన అనుభవాలు వచ్చినా రాకపోయినా ఫరవాలేదు కానీ .. అందరితో మిత్రత్వం నెరపుతూ “మిత్రత్వంలో దిట్టలు” కాకపోతే లాభంలేదు! అందుకే మనం మిత్రత్వంలో దిట్టలుగా కావడమే మన జన్మలక్ష్యంగా పెట్టుకోవాలి! “మానం – అవమానం” .. “చావు – రేవు” .. ఏదైనా కానీ పరస్పర మిత్రత్వాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అదే బృందావన బృందగాన లక్ష్యం!!