అక్కడామనమే .. ఇక్కడ మనమే

 

డిసెంబర్ 22వ తేదీ, 2013

అనేకానేక ఉన్నత లోకాలకు చెంది ఆ యా లోకాల్లో హాయిగా బృందావన విహారాలను చేసి వచ్చిన గోవిందులమైన మనం అక్కడి ఆ బృందవనాలను ఇక్కడ ఈ భూమ్మీద కూడా సహసృష్టి చేయడానికే ప్రస్తుతం జన్మతీసుకుని వున్నాం !

అయినా మనకు ఒక్కోసారి మనం వున్న పరిస్థితులను బట్టి అప్పుడప్పుడూ మన శక్తిసామర్థ్యాల పట్ల “ఎక్కువ”, “తక్కువ” అనే భావనలు వస్తూ వుంటాయి. ” అలా రావడం సహజమే ” అని తెలియజేస్తూ ఆ దేవుళ్ళ నిజస్థితిని వారికి ఎరుక పరిచేదే ఆధ్యాత్మికత ! ముండకోపనిషత్ మనకు ఈ విషయంలో చక్కటి స్పష్టతను కలుగజేస్తోంది.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్వనశ్నన్నన్యో అభిచాకశీతి ||

పూర్ణత్వానికి ప్రతీకలయిన స్వజాతికి చెందిన రెండు బంగారు రంగు పక్షులు – ఒకే వృక్షంలోని రెండు వేర్వేరు కొమ్మలపై జీవిస్తున్నాయట ! క్రింది కొమ్మల్లో వున్న మొదటి పక్షి తియ్యని పండ్లనూ, చేదు, పులుపు, వగరు పండ్లనూ తింటూ .. అటూ, ఇటూ ఎగురుతూ, అలసిపోతూ పాపం తెగ హడావిడి చేసేస్తోందట !

రెండవ పక్షి మాత్రం చెట్టు పై కొమ్మల్లో నింపాదిగా కూర్చుని ఏమీ చేయకుండా .. ఈ క్రింది పక్షి చేస్తోన్న హడావిడినంతా ఒక సాక్షిలా చూస్తోందట !

ఇది గమనించిన క్రింది కొమ్మల్లోని పక్షి “అది కూడా నా స్వజాతి పక్షే కదా ! నాలా రకరకాల పళ్ళను రుచి చూడకుండా అంత నింపాదిగా ఎలా కూర్చోగలుగుతుంది? అసలు దాని విషయమేంటో కనుక్కుందాం” అనుకుని మెల్లగా పైకి ప్రాకుతూ చిటారుకొమ్మలకు చేరుకుందట !

తీరా పై కొమ్మలోకి చేరుకుని చూడగా .. అక్కడ వేరే మరే పక్షి లేదు. క్రింద కొమ్మల్లో వున్న తానే అక్కడ కూడా ప్రతిబింబిస్తున్నానని తెలుసుకుని ఆశ్చర్యపోయిందట !

ఆ పక్షిలాగే ఆత్మకూడా “జీవాత్మ” గా “పరమాత్మ” గా రెండు పరస్పర విపరీత స్థితులతో ఏకకాలంలో ఉండడమే ద్వైతం ! “ఆ రెండు వేర్వేరు విపరీత స్థితులను అనుభవిస్తోంది ఒకే ఆత్మ” అని తెలుసుకోవడమే అద్వైతం !

“ద్వైతం – అద్వైతం కలగలిసిన పూర్ణ స్వరూపమే మనం” అని తెలుసుకోవడమే పూర్ణసత్యం ! పరస్పర విరుద్ధమైన స్థితులను ఏక కాలంలో ఏక ప్రకాశంతో విరాజిల్లజేస్తూ వాటి స్వరూపాన్ని మనకు క్షుణ్ణంగా అర్థం చేసేదే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం.

చాలా మంది ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేక ఆ క్రింది కొమ్మల్లోని పక్షిలాగే .. ” పైన ఎవరో నాకంటే గొప్పవాడు దేవుడిగా ఉన్నాడు. నా కర్మలన్నింటికీ ఆ దేవుడే బాధ్యుడు .. మరి నేను ఆ దేవుడి కంటే శక్తిహీనుడిని ” అని తమను తాము తక్కువ చేసుకుని ఆ పైన వున్న దేవుడిని భజిస్తూ పొద్దుపుచ్చుతూంటారు ! ఎరుక తప్పిన స్థితిలో వారు తమ స్వస్థితిని మరచిపోయి క్రింది కొమ్మల్లోని పక్షి రకరకాల పండ్లను రుచి చూస్తున్నట్లు కర్మచట్రంలో పడి నలుగుతూ వుంటారు.

అలా కాకుండా “పూర్ణస్వరూపంతో పై లోకాల్లో దేవుడిలా విలసిల్లుతోన్న మనమే .. మన ఇష్టప్రకారం అనుభవజ్ఞానం పొందేక్రమంలో అంశాత్మలుగా విడివడి ఇక్కడికి వచ్చి భూమితో పాటు రకరకాల తలాల్లో మరి లోకాల్లో విరాజిల్లుతూ ఉన్నాం !” ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా మనం ఒకవైపు ‘నరులం’ మరొకవైపు ‘నారాయణులం’ అని తెలుసుకోవాలి.

ధ్యానం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణం క్రింది కొమ్మల్లోని పక్షి పై కొమ్మలకు చేరుకుని తన స్వస్వరూపాన్ని గుర్తించి ఆశ్చర్యపోయినట్లు మనం కూడా ఆశ్చర్యపోతాం.