“లేదు మరణం”

 

ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి కూడా “దేహ మరణం” తప్పదు! ఇది మనకు తెలిసిన సత్యం!! అయితే “ఆ తరువాత ఏమైనా ఉంటుందా?!” అన్నదే అసలైన ప్రశ్న!

సామాన్య ప్రజాబాహుళ్యానికీ, మరి ఆధ్యాత్మికపరంగా అంతగా ఎదగని ఆత్మలకూ ఈ ప్రశ్న అసంగతంగా మరి “తెలుసుకోవడానికి ఏమీ ఉండదు” అన్నట్లుగా అనిపించినా .. తెలివైన ప్రతి మనిషికీ మరి పరిణితి చెందిన ప్రతి ఆత్మకూ .. అది సహజసిద్ధంగా వచ్చే మౌలిక సందేహం మరి కీలక ప్రశ్న!

మానవజీవితంలో “శైశవ దశ” .. “బాల్య దశ” .. “యవ్వన దశ” .. “ప్రౌఢదశ” మరి “వృద్ధాప్య దశ” అనే రకరకాల దశలు ఉంటాయి. ఈ అన్ని దశలలో కూడా పుడుతూనే చనిపోతూన్న వాళ్ళు .. శిశువులుగా చనిపోయిన వాళ్ళు .. యువకులుగా మరి పెద్దవాళ్ళుగా .. చనిపోతూన్న వాళ్ళు ఉంటారు. ఇక ముసలితనం వచ్చాక అందరూ విధిగా చావవలసిందే. ఒక్కోసారి రకరకాల సమస్యలను తట్టుకోలేక బెంబేలెత్తిపోయి “చావే శరణ్యం” అనుకుని ఆత్మహత్యలకు పాల్పడేవాళ్ళు కూడా అన్ని దశలలో ఉంటారు.

మరికొందరు ఏదో విధంగా తమ జీవితాన్ని పొడిగించుకోవాలని యుక్తులూ కుయుక్తులతో రకరకాల వృధా ప్రయాసలు పడుతూ మరి వ్యర్థ ప్రయోగాలు చేస్తూంటారు. ఇదంతా కూడా “మరణం తరువాత ఇక ఏమీ ఉండదు కనుక చనిపోయే లోపలే అంతా తినెయ్యాలి .. అంతా మ్రింగి వేయాలి .. మంచి అయితే మంచిగా .. చెడు అయితే చెడుగా అంతా అనుభవించెయ్యాలి” అన్న అజ్ఞానం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామం. దీనివల్ల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరుగులాటలు మరి అంతులేని కీచులాటలు మొదలవుతూ ఉంటాయి!!

అయితే “మరణం తరువాత కూడా జీవితం ఉంది; ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణంలో ‘భౌతిక మరణం’ అన్నది ఒకానొక మలుపు మాత్రమే” అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ధ్యానయోగులు మరి సద్గురువుల జీవితాలలో సామాన్య ప్రజల జీవితాలలో ఉన్నంత పరుగులాటలూ మరి కీచులాటలూ ఉండనే ఉండవు. “ఇప్పుడే అన్నీ సాధించుకోవలసింది ఏమీ లేదు; క్రమక్రమంగా అవే వస్తాయి” అన్న మనోనిబ్బరత వారిలో ఉంటుంది.

“గౌతమబుద్ధుడు”, “మహావీరుడు”, “గురునానక్”, “జొరాస్టర్”, “ఏసుక్రీస్తు”, “మహమ్మద్ ప్రవక్త” వంటి యోగిపుంగవులు అందరూ కూడా తమ తమ స్వంత యోగ సాధనల ద్వార ఈ స్వానుభవాన్ని పొందిన వారే! వారిలాగే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా స్వానుభవం పొందితీరాలి. అప్పుడే ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయం అవుతుంది.

ఇది శాస్త్రీయ యుగం. ఇక్కడ “శాస్త్రీయ దృక్పథం” అన్నది ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. అనేకానేక ఆధ్యాత్మిక సత్యాలను పరిశీలించి, పరిశోధించి వాటిలోని శాస్త్రీయతను వెలికి తీయాలి. ఎన్నెన్నో ప్రదేశాలలో చిన్న చిన్న పిల్లలు తమ తమ గత జన్మల అనుభవాలను గురించి చెప్పడం మనం వింటున్నాం. నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన ఆధారాలతో పరిశోధనలు జరిపి “వాళ్ళు చెప్పింది నిజమే” అని నిర్ధారించారు కూడా.

“డాక్టర్ ఇయాన్ స్టీవెన్‌సన్” ఈ దిశగా అనేక పరిశోధనలు చేసి “Twenty Cases Suggestive of Re-Incarnation” అన్న అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. ఇందులో వారు అనేక క్షేత్ర పరిశోధనా వ్యాసాలను అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. “డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లెర్ రాస్”, “డాక్టర్ రేమాండ్ మూడీ” గార్లు “మరణ సమయంలో అనుభవాలు (Near death experiences)” అన్న అంశంపై ఎంతో విపులంగా పరిశోధనలు జరిపి అనేక గ్రంథాలను మనకు అందించారు.

ఒక్కోసారి మరణశయ్యమీద ఉన్నవాళ్ళు తాము చనిపోయిన స్థితిలో తమ శరీరాలను వదిలిపెట్టి .. ఏవేవో క్రొత్త లోకాలను చూసి వచ్చాం అని చెబుతూంటారు. సొరంగాల ద్వారా చీకటిలోకి ప్రవేశించి వెలుతురులోకి రావడం, చనిపోయిన తమ పాత మిత్రులనూ మరి బంధువులనూ కలవడం, ఉన్నత లోకాల మాస్టర్ల దగ్గర ప్రత్యక్షంగా శిక్షణ తీసుకోవడం వంటి ఎన్నెన్నో అనుభవాలను వారు పొందుతూ ఉంటారు. అయితే వాళ్ళ జీవితకాలం ముగియకపోవడంతో వారికి ఏ వైద్యమో అందుబాటులోకి వచ్చి వాళ్ళు తిరిగి పునరుద్ధరింపబడిన శరీరంలోకి చేరిపోవడం జరుగుతుంది. ఇలాంటి దృష్టాంతాలు కూడా “మరణాంతర జీవితం ఉంది” అని మనకు తెలియజేస్తున్నాయి.

ఒక్కోసారి కొందరు ఉన్నట్లుండి తమ తమ ముఖ కవళికలను మార్చేసుకుని, వేరే వేరే భాషలను మాట్లాడేస్తూంటారు! ఆ మనిషి మునుపటి మనిషిలా ఉండడు. దీనినే “మీడియమ్‌షిప్” అంటాం ఇది కొన్ని క్షణాలు ఉండవచ్చు .. లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రోజులు .. నెలలు కూడా ఉండవచ్చు. దీనినే “దయ్యం పట్టింది” అని కొన్నిచోట్ల అంటూంటారు.

నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఇలాంటి విషయాలను పరిశోధించి “మరణించిన కొన్ని మూర్ఖపు ఆత్మలు తిరిగి తమ కోర్కెలను తీర్చుకోవడంకోసం అంతగా ఎదగని అజ్ఞానపు ఆత్మలకు సంబంధించిన శరీరాలలో అక్రమంగా ప్రవేశించి కోర్కెలు తీర్చుకుంటూ ఉంటాయి” అని ధృవీకరించారు. ఇలాంటి వారికి చక్కటి జ్ఞానాన్ని అందించడం ద్వారా వారిని ఆ మూర్ఖపు ఆత్మలబారి నుంచి విముక్తులను చేయవచ్చు.

ఇదేవిధంగా ఎంతోమంది తమ తమ నిద్రావస్థలలో కూడా స్వప్న విహారాలు చేసి రాబోయే కాలానికి సంబంధించిన వార్తలను సేకర్తిస్తూంటారు. ఆ వార్తలను విశ్లేషించగా అవి “నిజమే” అని నిరూపించబడ్డాయి. కనుక తెలివైన మానవాళికీ మరి అధిమానస ప్రయోగాలను అవగాహన చేసుకోగలిగే వాళ్లకూ “మరణానంతర జీవితం” అన్నది నిరూపితమైన సత్యం!!

భగవద్గీతలో “శ్రీకృష్ణ పరమాత్మ” కూడా –

“జాతస్య హి ధృవోమృత్యుః ధృవం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి” (భగవద్గీత 2-27)

“పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇదే పూర్ణయోగ జ్ఞాన సారాంశం. కనుక ఈ గిట్టే దానికి ఎవ్వరూ ఎప్పుడూ ఏడవరాదు” అంటూ మరణానంతరం జీవితం గురించి పరమాద్భుతంగా తెలియజేశారు.

ప్రతి ఒక్క ఆత్మకూడా రకరకాల జన్మల ద్వారా రకరకాల శరీరాలలోకి ప్రవేశిస్తూ .. మరణం ద్వారా వాటిని వదిలిపెడుతూ .. మళ్ళీ పుడుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానిగా జనన మరణ పరంపరను చేధిస్తుంది. చివరికి తాను కూడా ఒకానొక “పరమ ఆత్మ”గా పరిణితి చెంది ఇక ఊర్థ్వలోకాలలో శాశ్వతమైన సద్గురువు పదవిని చేరుకుంటుంది!

ఇది తెలుసుకున్న గౌతమబుద్ధుడు “ఆనాపానసతి ధ్యానం” చేసి స్వంత దివ్యచక్షువు ద్వారా తన జన్మ కర్మ పరంపరనంతా చూసుకుని దుఃఖరహితుడు అయ్యాడు. మరెందరో యోగమూర్తులు ఇదే దారిలో నడిచి మోక్షాన్ని పొందారు. జీసస్ క్రైస్ట్ అయితే “నేను క్రితం జన్మలో ‘ఎలియా’ ను” అని చాటి చెప్పాడు.

వాళ్ళలాగే నేను కూడా ధ్యానం చేసి ఇదే సత్యాన్ని తెలుసుకున్నాను. నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తెలుసుకున్నారు. ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మస్వరూపులమైన మనకు ఆత్మానుభవం ఉండడం సహజం! అది లేకపోవడమే అసహజం! కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఈ సత్యాలను తెలుసుకోవాలి. నిజానికి ప్రతి ఒక్క మనిషికి కూడా తన జీవితంలో చిన్నప్పటినుంచీ ఏదో ఒక సమయంలో ఆత్మానుభవాలు వస్తూనే ఉంటాయి.

కానీ సగటు సామాజిక వ్యవస్థలవల్ల అయితేనేమి, మూర్ఖపు పెంపకాలవల్ల అయితేనేమి అవి అన్నీ వారి మస్తిష్కాలలోనే అణిచివేయబడతాయి. అటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడయితే ధ్యానయోగ మార్గంలోకి అడుగు పెడతారో .. ఇక పరంపరగా వారికి ఆత్మానుభవాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. భౌతిక, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాది సముదాయానికి చెందిన అనుభవాల ద్వారా ఆత్మసత్యాలు అవగతమై వారు చిన్నప్పుడు తమకు వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో తెలుసుకుంటారు.

ఎవరికి వారే ధ్యాన సముద్రంలో ఈది తమలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏ శాస్త్రాన్నీ, ఏ మతాన్నీ లేదా ఏ గురువునూ గ్రుడ్డిగా నమ్మరాదు.

కాస్సేపు హాయిగా కూర్చుని .. కళ్ళు రెండూ మూసుకుని .. సహజంగా జరుగుతున్నటువంటి “శ్వాస మీద ధ్యాస” ఉంచాలి. ఏ రూపాన్నీ ఊహించకుండా ఏ మంత్రాన్నీ జపించకుండా అలా అలా సహజ శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమంగా ఆలోచనల ఉధృతి తగ్గిపోయి ఆలోచనారహితస్థితికి చేరుకుంటాం. ఆ అద్భుత స్థితిలో మెల్లి మెల్లిగా దివ్యచక్షువు ఉత్తేజితమై .. మరి భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం విడుదల అవుతుంది. ఆ సూక్ష్మశరీరం వెంట ప్రయాణిస్తూ వెళ్తే మరణానంతరం వెళ్ళే సకల లోకాల దర్శనాలు ముందే కలుగుతాయి.

ఇలా ధ్యానంలో భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం విడుదల కావడం కూడా అన్నది ఒక రకంగా మరణమే! ఇది ఎలా అంటే .. మన భౌతిక శరీరానికీ మరి సూక్ష్మ శరీరానికీ మధ్యలో “ప్రాణమయ తీగ (Silver Cord)” అనుసంధానమై ఉంటుంది. ధ్యానంలో ఎరుకతో చేసే సూక్ష్మశరీర యానంలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ప్రాణమయ తీగ ద్వారా సూక్ష్మశరీరం మళ్ళీ చటుక్కున వచ్చి భౌతిక శరీరంలో దూరిపోతూ ఉంటుంది. అదే మరణంలో అయితే ఈ ప్రాణమయతీగ తెగిపోయి రెండు శరీరాల మధ్య ఉన్న బంధం శాశ్వతంగా ముగిసిపోతుంది.

ఇలా మరణం ద్వారా భౌతిక శరీరాన్ని శాశ్వతంగా వదిలి పెట్టేసిన ఆత్మ .. తన సూక్ష్మశరీరంతో సూక్ష్మలోకాలన్నీతిరిగేస్తూ అంతకు ముందు భూమిమీద తను చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. అజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలిపెడితే అది భూలోకంలో సృష్టించినట్లే సూక్ష్మ లోకాలలో కూడా చీకటి రూపాలను సృష్టించుకుంటూ వాటిలోపడి నరకయాతనను అనుభవిస్తూ ఉంటుంది .. మరి సుజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలితే అది నేరుగా ఊర్థ్వ లోకాలకు చేరుకుని అక్కడ తన కర్మల ప్రతిఫలాలను ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది.

ఇలా ప్రతి ఒక్క ఆత్మకు కూడా మరణానికి పూర్వపు జీవితానుభవాలు ఎన్ని ఉంటాయో మరణాంతర జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉంటాయి. సూక్ష్మశరీరాలతో అవి కోటానుకోట్ల సూక్ష్మలోక అనుభవాలను పొంది .. అక్కడి తమ గత జన్మ స్మృతుల ఆధారంగా నూతన జన్మలకు సిద్ధపడతాయి. ఇవన్నీ కూడా ధ్యానం చేసి ఎవరికి వారే తెలుసుకోవచ్చు.

ధ్యానానికి కూర్చున్న మొదటిరోజే ఇవన్నీ తెలిసిపోవు! కనుక కనీసం నలభై రోజులు ఏకదీక్షగా తీవ్రతర సాధన చెయ్యాలి. ధ్యానంలో కలుగుతూన్న అనుభవాలను వ్రాసి పెట్టుకోవాలి.

ఇక్కడ “నమ్మకాలకు” ఎంత మాత్రం తావు లేదు. కేవలం శాస్త్రీయ దృక్పధానికీ మరి స్వీయ అనుభవానికీ మాత్రమే తావు ఉంది .. కనుక మానవ జీవితాన్ని మనం సరియైన విధంగా జీవించాలంటే ముందు ఈ మరణానంతర జీవితం గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అప్పుడే మన జీవితాలలో పోట్లాడుకోవడాలూ, హింసా ప్రవృత్తులూ, జంతు-పక్షి మాంస భక్షణలూ, జంతువధ మరి ఇతరుల వ్యక్తిగత జీవితాలలో తలదూర్చడాలవంటి అనాచారాలన్నీ మటుమాయం అయిపోతాయి. జీవితమంతా శుభాలతో మరి ఆనందాలతో నిండిపోతుంది.

ఇలాంటి జీవులనే “ముక్తజీవులు” లేదా “ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్స్” అంటారు. అలాంటి ముక్తజీవులే సభ్య సమాజ జీవులుగా మెలగగలుగుతారు మరి తమ చుట్టూ ఉన్నవారిని కూడా తమలాగే తయారుచేసి ఈ భువిని దివిగా మార్చగలుగుతారు!

నిజానికి సమాజంలో ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టినా మరి ఎన్ని మంచి పనులు చేసినా ఆత్మజ్ఞానం అన్నది లోపిస్తే మాత్రం వారు చివరికి రకరకాల ప్రలోభాలకు లోనై పరితపించవలసిందే .. మరి ఆత్మశాంతి కరువై శోకించవలసిందే!

చాలామంది “మేము భగవంతుని భక్తులం; ఎన్నో మంచి పనులు చేస్తున్నాం; ఆ పుణ్యమే మాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది” అంటూ ధ్యానం చెయ్యడానికి విముఖత చూపిస్తూంటాయి.

శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో ..

“తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్య్వలోకం విశంతి ఏవం త్రయా ధర్మ మనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే” (భగవద్గీత 9-20)

“ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత, అక్కడివన్నీ భోగించి పుణ్యం క్షీణించిన తరువాత, అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే ‘మరణం’ ఉన్న లోకంలోకి తిరిగి ప్రవేశిస్తారు; ఈ విధంగా రావడం, పోవడం అన్నది మూడు ధర్మాలను నిర్వర్తించడంకోసం .. మరి వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం .. యధావిధిగా జరుగుతూనే ఉంటుంది” అని సుస్పష్టంగా తెలియజేశారు.

మంచి కార్యాలవల్ల పుణ్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం మాత్రం రాదు! ఆత్మానుభవం వల్ల పొందే అనుభవజ్ఞానంతో మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొంది మనం జనన మరణ చక్రం నుంచి విముక్తులం అవుతాం! కనుక ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యజీవితాన్ని మనం భౌతిక శరీరంతో బ్రతికి ఉన్నప్పుడే అనుభవించడం మొదలుపెడదాం.

ఇందుకుగాను మన దైనందిన జీవితంలో ఏ మాత్రం మార్పులు చేసుకోనవసరం లేదు. సంసార సుఖాలను అసలు విడిచి పెట్టనవసరం లేదు. ఇహలోకపు విద్యలనూ మరి సకల కళలనూ ఒకవైపు నేర్చుకుంటూనే మరొకవైపు పరలోకపు సమాచారాన్నంతా విశేషంగా సేకరించుకోవాలి. ఇహలోకపు సుఖాలు ఒకవైపు హాయిగా అనుభవిస్తూనే మరొకవైపు అమరలోకపు ఆనందాలను ఆస్వాదించాలి.

ఇదే సరియైన మానవ జీవన విధి విధానం .. మరి ఇదే పరిపూర్ణమైన మానవ దివ్యజీవన సారాంశం!!