“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన మౌలిక సిద్ధాంతం .. ఆత్మవత్ జీవితాన్ని జీవించడం “
ధ్యానం ద్వారా ఆత్మ జాగృతిని పొందిన మరుక్షణం నుంచీ .. మనం చేపట్టవలసిన ముఖ్యకార్యక్రమం .. ఆత్మవిజ్ఞాన శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చెయ్యడం. ఆత్మశక్తి గురించిన పరిశోధనలు చేస్తూ .. ఆ అనుభవ జ్ఞానంతో ఆత్మవత్ జీవితాన్ని అత్యంత ఎరుకతో జీవించడం.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన మౌలిక ప్రకృతి .. శాస్త్రీయ దృక్పధాన్ని సదా కలిగివుండడం”
ఆత్మశక్తిస్వరూపులుగా జీవించే మనం .. నిజజీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన పట్ల, వ్యక్తి పట్ల ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథాన్ని కలిగివుండాలి. కర్మసిద్ధాంత అవగాహనతో ప్రతి క్షణం సాక్షీతత్వంతో అత్యంత శాస్త్రీయంగా జీవించాలి.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన అంతర్గత శక్తి .. ధ్యానశక్తి”
నిరంతర ధ్యానస్థితి వల్ల మనం పొందే అనంతమైన విశ్వమయప్రాణశక్తి ఆవాహన ద్వారా మనం ..శక్తిస్వరూపుల్లా వెలగాలి.
విశ్వమయప్రాణశక్తి లోపమే సర్వ అనర్థాలకూ మూలం కనుక ధ్యానం ద్వారా ఆ లోటును ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ప్రాపంచిక, ఆధ్యాత్మిక పనులన్నింటినీ చక్కబెట్టుకోవాలి. జీవితాన్ని .. ప్రతి క్షణం .. ఒక పండుగలా సంబరాలు జరుపుకోవాలి.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన ప్రగాఢమైన ఆకాంక్ష .. అంతర్ ప్రపంచాలను పరిశోధించడం”
బాహ్యప్రపంచానికి సంబంధించిన పనులను ఎరుకతో నిర్వహించుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా మనం ధ్యానసాధనలో మునిగిపోవాలి.
అంతరంగ ప్రపంచాలను మరింత, మరింతగా పరిశోధించుకుంటూ .. అనేకానేక సమాంతర లోకాలలో విహరిస్తూ .. అక్కడి జ్ఞానాన్ని సేకరించుకుంటూ వుండాలి.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మనలో దాగివున్న సామర్థ్యం .. సహజావబోధ”
మన బాహ్య మరి అంతర ప్రపంచాలలో మనకు ఎక్కడ ఎలాంటి సందర్భం ఎదురైనా .. ఆత్మశక్తి స్వరూపులం అయిన మనం మన సహజ అవబోధను అనుసరించి .. నిర్ణయాలు తీసుకుంటూ .. విజయపథంలో సాగిపోతూ ఉండాలి.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన హృదయపూర్వక ఆశయం .. యావత్ మానవజాతి యొక్క ప్రశాంతత”
స్వీయ ఆత్మస్పృహతో జీవించే వారికే సకల ప్రాణికోటిలో ఉన్న సర్వాత్మతత్త్వం అవగాహనకు వస్తుంది.
అందుకుగాను మనం చేపడుతూన్న విస్తృత ధ్యాన జ్ఞాన శాకాహార ప్రచార తరంగాలు ఈ భూమండలాన్ని సర్వ మానవ సౌభ్రాతృత్వంలో నింపివేస్తాయి. అప్పుడే సకల మానవజాతి అంతా కూడా పరస్పర శ్రేయోకామనతో ప్రశాంత జీవనం గడుపగలుగుతుంది.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన ఉదాత్త దృఢసంకల్పం .. శాకాహార మహాకరుణను విశ్వవ్యాప్తం చెయ్యడం”
“మనలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా తన స్వంత కల్యాణం కోసమే జన్మతీసుకుంటుంది” అన్నదే మౌలిక సత్యం. దీనికి అనుగుణంగా సోదర జంతుజాల పరిరక్షణ బాధ్యతను చేపట్టిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ .. శాకాహార మహాకరుణ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన అతిముఖ్యమైన లక్ష్యం .. మనతో పాటు అందరి ఆత్మజ్ఞానప్రకాశం”
సకల విశ్వానికే ప్రయోగశాలలాంటి ఈ భూమి మీద ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క ప్రయోగం ! ఈ ప్రయోగాల ద్వారా మన జన్మకూ మరి మన విజ్ఞానానికి అర్థం పరమార్థం దక్కుతాయి. అందుకే “వివిధ రకాలుగా వున్న ఆరోగ్య శాస్త్రాల ప్రయోగాల ఫలితాలు సామాన్యులందరికీ చేరాలి” అన్న లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ .. విరివిగా ధ్యాన ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోంది.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన అందరి ఐక్యవేదిక .. GFSS మరి IFSS”
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోని అతి ముఖ్య విభాగాలే అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మేళనం (GFSS) మరి భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మేళనం, (IFSS).
భావసారూప్యత కలిగిన వివిధ ఆధ్యాత్మిక శాస్త్ర బోధకులనూ, ఆధ్యాత్మిక గురువులనూ దేశవ్యాప్తంగా గుర్తించి .. వారందరినీ ఒకానొక ఐక్యవేదికపైకి తీసుకుని వచ్చి వారందరూ పరస్పరం ఎదగడానికి ఈ విభాగాలు విశేషంగా కృషిచేస్తున్నాయి.
“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం” “మన అంతిమ స్వప్నం .. ప్రపంచ ఆధ్యాత్మిక ప్రభుత్వ స్థాపన”
ప్రజల కోసం .. ప్రజల ద్వారా .. ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం .. “యథా ప్రజా .. తథా రాజా” అన్నట్లు సహజంగానే ప్రజాశక్తి సమూహాల యొక్క ఆత్మ ఎదుగుదలను బట్టు వుంటుంది.
జాగృత పరచబడిన ఆత్మలు .. ఉన్నత విలువలను కలిగిన ప్రభుత్వాలను ఎన్నుకుంటాయి కనుక .. ధ్యాన జ్ఞాన ప్రచారాల ద్వారా సకల ఆత్మలను విశేషంగా జాగృత పరచడమే మన పని.