“శ్రీ మహాగణపతి మహాసందేశం”

 

వినాయకుడు = “విశేషమైన నాయకుడు”

గణేశుడు = “సురగణాలకు అధిపతి”

విఘ్నేశ్వరుడు = “విఘ్నాలు లేనివాడు”

“ఆధ్యాత్మిక యోగులు” అయినవారే

“వినాయకులు” .. “గణేశులు” మరి “విఘ్నేశ్వరులు”

***

“చేటలంత చెవులు ఉండాలి”

“అందరి దగ్గర శ్రవణం విశేషంగా చెయ్యాలి”

“చిన్ని చిన్ని కళ్ళు”

.. ఈ దృశ్యమాన, కాలమాన ప్రపంచాన్ని

ఇంతింత పెద్ద పెద్ద కళ్ళతో తదేకంగా చూడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు!

కొద్దిగా చూస్తే చాలు .. అయితే, ఆ కొద్దిగానైనా తీక్షణంగా ఉండాలి

ఈ నాలుగు రోజుల భౌతిక-తల .. భూ – తల .. బ్రతుకును

“వచ్చామా .. పోయామా” అన్న ఈ అశాశ్వత బ్రతుకును ..

పరీక్షంచడానికి “చిన్ని చిన్ని కళ్ళు” చాలు!

“ఏకదంతం”

.. పళ్ళు ఊడిపోయినా పరవాలేదు

భౌతిక శరీరం అందవిహీనంగా ఉన్నా పరవాలేదు

“బొజ్జ గణపతి” .. అని అందరూ నవ్వుకున్నా పరవాలేదు

“మనం కేవలం భౌతిక శరీరమే కాదు కదా

అసలు .. మనం ఆత్మ-పదార్థం .. సర్వాత్మ-పదార్థం”

.. ఇదే “శ్రీ గణేశుడి ఆత్మజ్ఞాన సందేశం”

 

***

“ఉండ్రాళ్ళ ప్రియుడు”

భౌతిక జీవితాన్ని చక్కగా భోగించాలి

“మూషికవాహనుడు”

అల్పప్రాణులను కూడా తనతో సమంగా చూసేవాడు

మానవజాతి .. జంతుజాతి .. మరి కలిసి మెలిసి జీవించాలన్నదే “శ్రీ గణేశుడి సందేశం”

“తొండం”

ముక్కు అన్నది పొడవాటి “తొండం” అయిపోయింది

అంటే “శ్వాస మీద ధ్యాస అభ్యాసం” అంతగా ఉండాలన్నదే దాని అర్థం

“కురచ శరీరం”

“శరీరంతో సంబంధం ఏమిటి మనకు?

“శరీరంతో తాదాత్మ్యం ఇంతగా ఎందుకు మనకు? మనం ఆత్మపదార్థం కదా!

శారీరక/మానసిక అహంకారం అన్నది ‘మరుమరీచిక’ లాంటిది

‘మరుమరీచిక’ అంటే ‘ఎండమావులు’

నీళ్ళు ఉన్నట్లే కనబడతాయి కానీ అక్కడ నీళ్ళు ఉండవు

‘అహంకారం’ మరి ‘ విశిష్ట అస్తిత్వం’ అన్నవి ఉన్నట్లుగా కనబడతాయి గానీ

వాస్తవంగా అవి ఎవ్వరి దగ్గరా లేవు

ఉన్నదంతా ‘ఆత్మవత్ అజ్ఞానమే’ కానీ ఇంకేదీ కాదు!” అన్నదే “శ్రీ గణేశుడి సందేశం”

“ఇద్దరు భార్యలు”

వినాయకుడికి ఇద్దరు భార్యలు

మొదటి భార్య పేరు “సిద్ధి” .. రెండవ భార్య పేరు “బుద్ధి”

ఎవరయితే “శ్వాస మీద ధ్యాస – ఆనాపానసతి” అభ్యాసాన్ని విశేషంగా చేస్తూ

తమ ముక్కును “తొండం అంత” ఎవరైతే చేసుకుంటారో

వారు మొదటగా “సిద్ధపురుషులు” అవుతారు .. పరంపరగా “బుద్ధుళ్ళు” అవుతారు

ఇదే “శ్రీ మహాగణపతి మహా సందేశం”

***

“ఓం శ్రీ గణేశాయ నమః”

“ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః”

“ఓం శ్రీ వినాయకాయ నమః”