“ఆధ్యాత్మిక తల్లిదండ్రులు”
ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా
“ఒకానొక మహిళ – ప్రాపంచిక తల్లి” ద్వారా ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం
“ఒకానొక పురుషుడు – ప్రాపంచిక తండ్రి” మన జన్మకు కారణభూతం అవుతున్నాడు
ఇలా
ప్రాపంచిక తల్లితండ్రుల ద్వారా భౌతిక జన్మ తీసుకున్న మనం అంతా కూడా
ఈ సువిశాల భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టి
ప్రాపంచిక చదువులు చదువుకుంటూ .. ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వహిస్తూ ..
ప్రాపంచిక సంపదలను సంపాదిస్తూ .. ప్రాపంచిక ఆస్తిపాస్తులను కూడబెడుతూ ..
ప్రాపంచిక కీర్తి ప్రతిష్ఠలను ప్రోగుచేసుకుంటూ ..
ఫక్తు ప్రాపంచిక జీవితాన్నే జీవిస్తూ ఉంటాం
అయితే
ఇది అంతా భూమి మీది మన జీవితంలో కేవలం యాభై శాతం జీవించడం మాత్రమే!
ఇలా జీవిస్తే మనం మళ్ళీ మళ్ళీ ఆ భూమి మీదకు వస్తూపోతూనే ఉండాలి
అలాకాకుండా
ఈ భూమి మీద “వందకు వంద శాతం” సంపూర్ణంగా మనం జీవిస్తే
మళ్ళీ మళ్ళీ రావలసిన అవసరం లేకుండా చేసుకోవచ్చు కదా!
అందుకుగానూ
ప్రాపంచిక తల్లితండ్రులను మనం ఒకింత వదలివేసి ..
“ఆధ్యాత్మిక తల్లితండ్రులను” సత్వరం చేరుకోవాలి
అయితే
ఈ ఆధ్యాత్మిక తల్లితండ్రులు “వ్యక్తులు” కాజాలరు!
“ఆధ్యాత్మిక తల్లితండ్రులు” అంటే .. “కొన్ని పరమ అనుష్టానాలు”
“అహింస/మహాకరుణ” అనే అనుష్టానమే “ఆధ్యాత్మిక తల్లి”
“ఆనాపానసతి ధ్యానం” అనే అనుష్టానమే “ఆధ్యాత్మిక తండ్రి”
“మహాకరుణా మూర్తి” అయిన “ఆధ్యాత్మిక తల్లి” మనకు
“ధర్మాచరణ బోధ” ద్వారా మనలోనే నిక్షిప్తమై ఉన్న
ప్రేమ, సహ అనుభూతి, కరుణ, స్నేహం వంటి దివ్య లక్షణాలను
మనమే వెలికి తెచ్చుకునేలా దారి చూపితే ..
“ఆనాపానసతి ధ్యానమూర్తి” అయిన “ఆధ్యాత్మిక తండ్రి” యొక్క
“బ్రహ్మాత్మ జ్ఞానబోధ” ద్వారా మన స్వీయ ఆత్మస్వరూపాన్ని మనకు ఎరుక పరచి
మనం ఒకేసారి ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక లోకాలలో
హాయిగా మసలుకునేలా సత్య శిక్షణను ఇస్తాడు
ఇలా .. ఒకే జన్మలో .. ఏక కాలంలో
“ప్రాపంచిక తల్లిదండ్రుల” మరి “ఆధ్యాత్మిక తల్లిదండ్రుల” యొక్క
జ్ఞానపూర్వకమైన పెంపకంలో పెరిగినప్పుడే మనం సంపూర్ణ మానవులుగా ఎదిగి ..
మన జీవిత లక్ష్యాలను ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతాము.
అప్పుడిక “ఆయా రామ్” .. “గయా రామ్” లలా
ఊరికే ఈ భూమండలానికి పదే పదే వచ్చే పోయే అవసరం మనకు ఉండదు
ప్రాపంచిక తల్లితండ్రులూ జిందాబాద్!
ఆధ్యాత్మిక తల్లితండ్రులూ జిందాబాద్!