భగవద్గీత 15-8
“ శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కామతీశ్వరః | గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ || ” |
పదచ్ఛేదం
శరీరం – యత్ – అవాప్నోతి – యత్ – చ – అపి – ఉత్ర్కామతి – ఈశ్వరః – గృహీత్వా – ఏతాని – సంయాతి – వాయుః – గంధాన్ – ఇవ – ఆశయాత్
ప్రతిపదార్థం
వాయుః = వాయువు ; ఆశయాత్ = వాసనవచ్చే చోటునుండి ; గంధాన్, ఇవ = వాసనలను తీసుకుని పోయినట్లుగా ; ఈశ్వరః, అపి = ప్రాణుల దేహాలలో వున్న జీవాత్మ ; యత్ = ఏ శరీరాన్ని ; ఉత్ర్కామతి = విడుస్తుందో ; (తస్మాత్ = దాని నుండి వున్న) ; ఏతాని = ఈ మనస్సును, ఇంద్రియాలను ; గృహీత్వా = గ్రహించి ; చ = మరియు ; యత్, శరీరం = ఏ శరీరాన్ని ; అవాప్నోతి = పొందుతుందో ; (తస్మిన్ = ఆ శరీరంలో) ; సంయాతి = చేరుతుంది
తాత్పర్యం
“ వాయువు ఒకచోటు నుండి ఇంకొక చోటుకు వాసనలను తీసుకుని పోయినట్టుగానే … జీవాత్మ మనస్సు, ఇంద్రియ వాసనలను తీసుకుని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. ”
వివరణ
భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలను మనస్సుకు అందిస్తూంటాయి.
“ మనస్సు” అన్నది “బుద్ధిని” అనుసరించి … తన వివేకాన్ని బట్టి …
ఆ యా విషయాలను అనుభవిస్తూ వుంటుంది.
ఆ అనుభవాల సారాన్ని, జ్ఞానాన్ని … సంస్కారాల రూపంలో …
మనస్సు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.
“ వాసనల” రూపంలో వుండే వీటికి రూపం ఉండదు.
జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు … అంటే …
ఒకానొక మరణ సమయంలో … తనలో వున్న వాసనా సమూహాన్ని తీసుకుని,
సూక్ష్మశరీరంగా … స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది.
ఈ సంస్కారాలు, వాసనలే తరువాతి జన్మల్లో “ గుణాలు” గా రూపొందుతాయి.
జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు …
వాసనలకు అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది.
ఈ విధంగా వేరు వేరు ప్రాంతాలలో, వేరు వేరు దేహాలు ధరిస్తూ,
వేరు వేరు జన్మలు తీసుకుంటూ …
స్వీయ ఆత్మపరిణామక్రమంలో సక్రమంగా ఎదగడానికి
నిరతమూ యత్నిస్తూ వుంటుంది ఈ జీవాత్మ.