భగవద్గీత 14-9
“ సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత | జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత || ” |
పదచ్ఛేదం
సత్త్వం – సుఖే – సంజయతి – రజః – కర్మణి – భారత – జ్ఞానం – ఆవృత్య – తు – తమః – ప్రమాదే – సంజయతి – ఉత
ప్రతిపదార్థం
భారత = భరత వంశస్థుడా ! ; సత్త్వం = సత్త్వగుణం (జీవుడిని) ; సుఖే = సుఖంలో ; సంజయతి = నిమగ్నం చేస్తుంది ; రజః = రజోగుణం ; కర్మణి = కర్మలలో ; తమః, తు = (అలాగే) తమోగుణం అయితే ; జ్ఞానం = జ్ఞానాన్ని ; ఆవృత్య = కప్పి ; ప్రమాదే = ప్రమాదాలలో ; సంజయతి = ముంచివేస్తుంది ; ఉత = ఆశ్చర్యం !
తాత్పర్యం
“ అర్జునా, సత్త్వగుణం వలన సుఖాసక్తి, రజోగుణం వలన కర్మాసక్తి, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి, ప్రమాదాలను కలిగించి జీవుడిని బంధిస్తున్నవి … ఆశ్చర్యం కదా ! ”
వివరణ
ప్రకృతి వల్ల పుట్టిన గుణాలతో జీవుడు బంధించబడుతున్నాడు.
సత్త్వ, రజో, తమో గుణాలు త్రిగుణాలు.
సత్త్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనదీ,
ప్రకాశవంతమైనదీ అయినప్పటికీనూ …
ఆత్మను లౌకిక సుఖశాంతుల పట్ల ఆసక్తితోనూ,
లౌకిక పాండిత్యాసక్తితోనూ బంధిస్తుంది.
“ నేను సుఖంగా వున్నాను” … “ నేను పండితుడిని” …
అనేటటువంటి అభిమానాలు
జీవాత్మకు లౌకిక సుఖంతో, లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరచి
ఆత్మజ్ఞాన సాధనకూ, జీవన్ముక్త స్థితికీ ప్రతి బందకాలౌతాయి.
రజోగుణం వల్ల విపరీత కోరికలు కలుగుతాయి.
మనకు దొరకని విషయాల మీద కోరికలు కలుగజేసి,
దొరికిన వాటి మీద అనాసక్తి కలుగజేసి మరి ఏవేవో కర్మలు చేసేటట్టు చేసి,
జీవాత్మను మరింత లోతుల్లోకి బంధించి వేస్తాయి.
తామస గుణం వల్ల మంచీ, చెడు విచక్షణా జ్ఞానం నశిస్తుంది.
సోమరితనం, అతి నిద్ర ముంచెత్తుతాయి.
అజ్ఞాన జనితమైన ఈ తమోగుణం అవివేకాన్ని కలుగజేసి
ఆత్మసత్యాన్ని పూర్తిగా కప్పివేసి జీవుడిని బంధించి వేస్తుంది.
పరిపూర్ణత్వానికి …
సుగుణాల వల్ల గానీ, దుర్గుణాల వల్ల గానీ …
బంధం వుండకూడదు.
“ సంకెళ్ళు” అనేవి బంగారంతో చేసినా, వెండితో చేసినా…
సంకెళ్ళే అవుతాయి కానీ … “ ఆభరణాలు” కాలేవు.
అలాగే ఈ మూడు గుణాలు కూడా ఆత్మను ఏదో ఒక విధంగా బంధించేవే అవుతున్నందువల్ల …
అన్ని గుణాలనూ అధిగమించి చివరికి …
“ నిర్గుణుడుగా” … మారాలి.