భగవద్గీత 13-3
“ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత | క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ || ” |
పదచ్ఛేదం
క్షేత్రజ్ఞం – చ – అపి – మాం – విద్ధి – సర్వక్షేత్రేషు – భారత – క్షేత్రక్షేత్రజ్ఞయోః – జ్ఞానం – యత్ – తత్ – జ్ఞానం – మతం – మమ
ప్రతిపదార్థం
భారత = భరత వంశీకుడా ; సర్వక్షేత్రేషు = క్షేత్రాలన్నింటిలో ఉన్న ; క్షేత్రజ్ఞం అపి = క్షేత్రజ్ఞుని (జీవాత్మను) గూడ ; మాం = నేనే అని ; విద్ధి = తెలుసుకో ; చ = మరి ; క్షేత్రక్షేత్రజ్ఞయోః = క్షేత్ర, క్షేత్రజ్ఞుల యొక్క (ప్రకృతి పురుషుల యొక్క) ; యత్, జ్ఞానం = ఏ తత్త్వజ్ఞానము వుందో ; తత్ = అది ; జ్ఞానం = జ్ఞానం అని ; మమ, మతం = నా అభిప్రాయం
తాత్పర్యం
“ అర్జునా, అన్ని శరీరాలలోనూ వున్న క్షేతజ్ఞుడిని నేనే; క్షేత్ర, క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం.”
వివరణ
“ క్షేత్రం ” అంటే శరీరం.
“ క్షేత్రజ్ఞుడు ” అంటే ఆత్మ.
దేహం క్షేత్రం … దేహి క్షేత్రజ్ఞుడు.
సమస్త ప్రాణులలో వున్న క్షేత్రజ్ఞుడు పరమాత్మయే.
ఆత్మ పరమాత్మలు అభేదాలు.
ఈ రకమైన జ్ఞానమే అసలయిన జ్ఞానం అని ప్రతి సాధకుడూ తెలుసుకోవాలి.
“ అన్ని శరీరాలలో వున్న క్షేత్రజ్ఞుడిని నేనే ” అంటే …
“ సమస్త ప్రాణుల శరీరాలలో వున్న జీవాత్మ ఏదైతే వుందో …
అది పరమాత్మ కంటే వేరు కాదు ” అని అర్థం.