భగవద్గీత 12-17
“ యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః || ” |
పదచ్ఛేదం
యః – న – హృష్యతి – న – ద్వేష్టి – న – శోచతి – న – కాంక్షతి – శుభాశుభపరిత్యాగీ – భక్తిమాన్ – యః – సః – మే – ప్రియః
ప్రతిపదార్థం
యః = ఎవడు ; న హృష్యతి = సంతోషంతో పొంగిపోడో ; న ద్వేష్టి = దేనినీ ద్వేషించడో ; న శోచతి = దేనికీ విచారపడడో ; న కాంక్షతి = దేనినీ కోరడో ; యః = ఎవడైతే ; శుభాశుభ పరిత్యాగీ = శుభాశుభ కర్మలను పరిత్యజించినవాడో ;
సః = అటువంటివాడు ; భక్తిమాన్ = భక్తుడు ; మే = నాకు ; ప్రియః = ప్రియమైనవాడు
తాత్పర్యం
“ ఎవరు సంతోషానికీ, ద్వేషానికీ, దుఃఖానికీ, ఆశకూ, శుభ — అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు.”
వివరణ
కోరినది పొందినప్పుడు, అయిష్టమైనది పొందనప్పుడు …
సంతోషం కలుగుతుంది.
కోరినది పొందనప్పుడు, వద్దనుకున్నది వచ్చినప్పుడు … దుఃఖం కలుగుతుంది.
ఇష్టంలేని మనుష్యుల మీద, ఇష్టంలేని విషయాల మీద,
కష్టతరమైన పరిస్థితులపైనా … ద్వేషం కలుగుతుంది.
“ఇది కావాలి”, “అది కావాలి” అన్న కోరికలే … ఆశలు.
“శుభం, అశుభం” ఈ రెండింటినీ వదిలేసినవాడు “శుభాశుభ పరిత్యాగి”.
మంచి చెడూ రెండూ పరిపూర్ణంగా త్యజించాలి … పరిత్యజించాలి.
“భక్తి” అంటే .. స్వస్వరూపానుసంధానమే … అని మనకు తెలుసు.
“భక్తుడు” అంటే “ తనయొక్క స్వ స్వరూప అనుసంధానంలో …
ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడు ” అని అర్థం.
అత్యాశలను వదిలి …
సుఖదుఃఖాలు, ఇష్టాయిష్టాలు, మంచి చెడులవంటి
ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ …
తనయొక్క ఆత్మధ్యానంలో …
ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకానొక ధ్యానయోగి
తనకు అత్యంత ప్రియుడని చెపుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ.