భగవద్గీత 9-34 “ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు | మామేవైష్యసి యుక్త్వైవమ్ ఆత్మానం మత్పరాయణః || ” |
పదచ్ఛేదం
మన్మనాః – భవ – మద్భక్తః – మద్యాజీ – మామ్ – నమస్కురు – మామ్ – ఏవ – ఏష్యసి – యుక్త్వా – ఏవమ్ – ఆత్మానమ్ – మత్పరాయణః
ప్రతిపదార్థం
మన్మనాః = నాయందు మనస్సు కలవాడవు ; భవ = కా ; మద్భక్తః = నా భక్తుడవు ; (భవ = కా) ; మద్యాజీ = నన్ను పూజించు ; మామ్ = నన్ను(నాకు) ; నమస్కురు = నమస్కరించు ; ఏవమ్ = ఈ విధంగా ; ఆత్మానమ్ = ఆత్మను ; యుక్త్వా = (నామీదే) నిలిపి ; మత్పరాయణః = నా, పరమైనవాడివైతే ; మామ్, ఏవ = నన్నే ; ఏష్యసి = పొందగలవు
అర్జునుడు = నేను శరీరం అనుకునే తత్వం
శ్రీకృష్ణుడు = నేను ఆత్మ అనే తత్వం
నేను = ఆత్మ
భగవాన్ ఉవాచ – ఆత్మ ఉవాచ:-
“నాయందు మనస్సు నిల్పి, నా భక్తుడవై, నన్నే సేవించు. నన్నే నమ్మి, నాకే నమస్కరిస్తూ, నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరతావు. “
వివరణ
ఎక్కడెక్కడ ‘మాం’, ‘మయి’ అని వచ్చినా కూడా
అవి కృష్ణునికి సూచికలు ఎంత మాత్రం కావు
అవి ధ్యానానికి/ఆత్మకు సూచికలు అన్నది మనం పదే పదే గుర్తుంచుకోవాలి.
“ఆత్మయందే మనస్సును లగ్నం చేయాలి ;
ఆత్మయొక్క భక్తుడు అవ్వాలి ; ఆత్మనే పూజించాలి ;
ఆత్మకే నమస్కరించాలి ;
ఈ విధంగా, ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మపరాయణుడివైతే
ఆత్మను నువ్వు పొందగలవు”.
ఇదే సరియైన అర్థం. అయితే మామూలు “భగవద్గీత” పుస్తకాలలో …
ఈ భగవద్గీతా రహస్యాన్ని గ్రహించని వారి పుస్తకాల్లో …
అర్థం పూర్తి విరుద్ధంగా వుంటుంది.
ఎలా వుంటుందంటే … “నా యందు మనస్సు నిల్పి, నా భక్తుడవై, నన్నే సేవించు ; నన్నే పూజించు ;
నన్నే నమ్మి, నాకే నమస్కరిస్తూ, నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరతావు.”