భగవద్గీత 9-22
“ అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ” |
పదచ్ఛేదం
అనన్యాః – చింతయంతో – మాం – యే – జనాః – పర్యుపాసతే – తేషాం – నిత్యాభియుక్తానాం – యోగక్షేమం – వహామి – అహం
ప్రతిపదార్థం
అనన్యాః = ఇతర భావాలు లేక ; యే జనాః = ఎవరైతే ; “ మాం ” = “ తనను తాను” ; చింతయన్తః = చింతన చేస్తూ ; పర్యుపాసతే = సేవిస్తారో ; నిత్యాభియుక్తానాం = నిరంతరం నన్నే ధ్యానించే ; తేషాం = వారి యొక్క ;
యోగక్షేమం = యోగక్షేమాలను ; అహం = నేనే ; వహామి = వహిస్తాను
తాత్పర్యం
“ వేరే ఆలోచనలు లేకుండా నిత్యమూ తనను తానే నమ్ముకొని, తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే వుంటూ, తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ”
వివరణ
మన పనులను మనం చేసుకుంటూనే వుండాలి.
అప్పుడు పరమ ఆత్మలు ఆ “ శ్రీకృష్ణుడు ”, ఆ “ వేదవ్యాసుడు ” ..
ఎవరో ఒక “ పరమ ఆత్మ ” ..
ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే ” పరమ ఆత్మ” ..
మన యోగక్షేమాలను తానే వహిస్తుంది.
“ ప్రాపంచికంగా, భౌతికంగా ”మనకు ఇచ్చే రక్షణ “ క్షేమం ” అనబడుతుంది.
“ యోగం ” అంటే “ ఆధ్యాత్మిక పురోగతి ”
ప్రాపంచిక, ఆధ్యాత్మిక రక్షణా కవచంగా …
“ ఒకానొక పరమ ఆత్మ ” … మనకు సిద్ధంగా ఉంటారు.
మనం చెయ్యవలసిందల్లా ఒక్కటే … ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం
మన ధ్యానంలో మనం ఉండడం !
శుభాలనూ … అశుభాలనూ మనస్సులో వదలిపెట్టెయ్యగలగడం
మన వశంలో మనం ఉండడం ! … మన యోగంలో మనం ఉండడం !
ప్రహ్లాదుడు ఎప్పుడూ ధ్యానంలో వుండేవాడు.
ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా గానీ రక్షింపబడ్డాడు.
మన ప్రక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమ ఆత్మ …
ఆస్ట్రల్ మాస్టర్ … గైడ్ !
మన కళ్ళకు కనిపించడు కానీ …
తాను మనకు చెయ్యవలసింది మాత్రం చేస్తాడు.
కనుక మనం చెయ్యవలసింది మనం చేస్తే …
మన యోగక్షేమాలు పరమ ఆత్మలు చూసుకుంటారు.
ధ్యానం రక్షతి రక్షితం ! ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది!