“పెద్దన్నలు.. జిందాబాద్ ’’
ప్రతి క్షణం అందరికీ అత్యవసరమైనదే “సత్యం”
సత్యదూరాలైన అసత్యాలు, అవాస్తవాలు లెక్కలేనన్ని.. కానీ.. “సత్యం” మాత్రం ఒక్కటే
ప్రపంచ మానవాళి అంతా ఒక్కటే .. మరి మానవాళికి సంబంధించిన “సత్యం” కూడా ఒక్కటే
జంతు సామ్రాజ్యానికీ మరి మానవసామ్రాజ్యానికీ ఉన్న ఒక్కగానొక్క తేడా .. “సత్యపిపాస”
ప్రాణభీతి, ప్రాణరక్షణ, మైధునం మరి సామూహిక స్పృహ .. ఇత్యాదివన్నీ
జంతుజాతికి మరి మానవజాతికీ సామాన్యమైన విషయాలైతే..
ఒక్క “సత్యపిపాస” మాత్రమే మానవజాతిని జంతుజాతి నుంచి వేరుచేసే మహావిషయం
జంతుజాతికి “తదుపరి మెట్టు” అయిన “మానవజాతి” కి
ఆత్మమహాసత్యాన్ని “ధ్యానసమాధి-ఎరుక” తో తెలుసుకోవడమే “తదుపరి పరిణామప్రక్రియ”
“నేను మేను కాదు .. ఆత్మ” అన్న ఎరుకే మానవజాతికి సంబంధించిన విశేష “సత్యం”
మానవ సామ్రాజ్యంలో “సత్యం” అన్నది సదా వ్యాప్తిచెందుతూనే ఉంటుంది
భగవంతుని ఈ సువిశాల విశ్వకుటుంబంలో ..
చిన్నతమ్ముళ్ళయిన జంతుజాతికి .. మానవజాతి “పెద్దన్న” గా వ్యవహరించగలగాలి!
జంతుజాతి అయిన “చిన్నతమ్ముళ్ళ” యొక్క సంరక్షణ, సంపోషణ, సంశిక్షణ
ఇవే “పెద్దన్నలు” అయిన మానవజాతి యొక్క “ప్రధాన కర్తవ్యాలు”
కనుక మానవజాతి అంతా తక్షణం జంతువధలు.. జంతుమాంసభక్షణలు మాని
“జంతురక్షణ”కు పూనుకుని .. “జంతుశిక్షణ” కు కూడా నడుం కట్టాలి
“సర్వం ఖల్విదం బ్రహ్మ” అంటే “ఉన్నదంతా భగవత్ పదార్థమే”
సకల ప్రాణకోటి సముదాయం అంతా కూడా మౌలికంగా భగవత్ పదార్థమే
సత్యప్రాప్తి కోసం నడుం కట్టిన మానవళే “నిజమైన మానవాళి”
మరి.. ఆ విధంగా కాకుండా ..
అనునిత్య ప్రాణభీతితో జీవిస్తూ .. కేవలం ప్రాణరక్షణ మాత్రమే చూసుకుంటూ బ్రతికే
జంతుజాతి సమానమైన మానవజాతి అంతా
“ద్విపాదపశువు-జంతుజాతి” క్రిందే లెక్కకట్టబడుతుంది
మానువులు మరి జంతుజాతికంతా “పెద్దన్నలు” గా వ్యవహరించగలిగితేనే
ఈ భూమి స్వర్గంగా మలచబడుతుంది .. అంతవరకు వున్నది అంతా నరకమే
అన్యధా శరణం నాస్తి .. అహింస ఏవ శరణం వయం