భగవద్గీత 6-26
“ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ | తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ || ” |
పదచ్ఛేదం
యతః – యతః – నిశ్చరతి – మనః – చంచలం – అస్థిరం – తతః – తతః – నియమ్య – ఏతత్ – ఆత్మని – ఏవ – వశం – నయేత్
ప్రతిపదార్థం
అస్థిరం = స్థిరంగా నిలువని ; చంచలం = చలించే ; ఏతత్, మనః = ఈ మనస్సు ; యతః, యతః = ఏయే శబ్దాది విషయాల కారణంగా ; నిశ్చరతి = (విశృంఖలంగా) సంచరిస్తుందో ; తతః, తతః = ఆ యా విషయాల నుంచి ; నియమ్య = మరల్చి ; ఆత్మని, ఏవ = ఆత్మలోనే ; వశం, నయేత్ = స్థిరపరచాలి.
తాత్పర్యం
“ చంచల స్వభావం కలిగివుండి, ఎంతమాత్రమూ నిలకడ లేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తూంటే అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి. ”
వివరణ
“మనస్సు” అనేది ఆలోచనల పుట్ట …
చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం !
అది ఎంతసేపూ ఇంద్రియ విషయ సుఖాల మీదకీ … గత స్మృతులలోకీ …
ఎక్కడెక్కడికో … పరుగులు తీస్తూనే ఉంటుంది.
అటువంటి దానిని ఆత్మలో స్థితమయ్యేటట్టు చెయ్యాలంటే …
ఉన్న గొప్ప ఉపాయం “ శ్వాస మీద ధ్యాస ”.
మనలో జరుగుతూన్న శ్వాసను గమనిస్తూ … గమనిస్తూ … గమనిస్తూ ఉండాలి.
కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ … ఉండాలి.
అయితే మనస్సు శ్వాసను గమనించడం మానేసి,
దాని సహజ అలవాటు ప్రకారం ఎక్కడికో …
ఏదో ఆలోచనకు … వెళ్ళిపోతూనే వుంటుంది.
వెంటనే దాన్ని అక్కడి నుంచి వెనుకకు తీసుకువచ్చి …
మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనింప చేయాలి.
మనస్సు ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి పోతున్నా …
అన్నిసార్లూ అక్కడక్కడ నుంచి తీసుకువచ్చి …
శ్వాసనే గమనించేటట్టు చెయ్యాలి ! …
ఆ విధంగా చేస్తూనే ఉండాలి !
ఇదే మనం చేయవలసిన సాధన …
“ ధ్యాన సాధన ” … “ యోగసాధన ” … “ధ్యాన యోగసాధన ”.
ఫలితంగా మనలోని అనవసర ప్రాపంచిక,
సంసారిక భావప్రవాహం ఆగిపోయి …
ఆలోచనారహితస్థితి కలుగుతుంది.
అంటే … మనస్సు నశిస్తుందన్నమాట !
మనస్సు నశించినప్పుడు … ఆత్మపదార్థం అన్నది అనుభూతికి వస్తుంది.