భగవద్గీత 6-12
“ తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః | ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే || ” |
పదచ్ఛేదం
తత్ర – ఏకాగ్రం – మనః – కృత్వా – యతచిత్తేంద్రియక్రియః – ఉపవిశ్య – ఆసనే – యుంజ్యాత్ – యోగం – ఆత్మవిశుద్ధయే
ప్రతిపదార్థం
తత్ర, ఆసనే = ఆ (సుఖ) ఆసనం మీద; ఉపవిశ్య = కూర్చుని ; యతచిత్తేంద్రియక్రియః =ఇంద్రియ, మనోవ్యాపారాలను వశంలో వుంచుకొని ; మనః = మనస్సును ; ఏకాగ్రం, కృత్వా = ఏకాగ్రం చేసి ; ఆత్మవిశుద్ధయే = అంతఃకరణశుద్ధి కోసం ; యోగం = యోగాన్ని ; యుంజ్యాత్ = సాధన చెయ్యాలి
తాత్పర్యం
“ ఆ సుఖ ఆసనం మీద కూర్చుని ఇంద్రియాలనూ, మనస్సునూ స్వాధీనం చేసుకుని, అంతఃకరణశుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యానయోగసాధన చెయ్యాలి. ”
వివరణ
కూర్చోడానికి అనుకూలమైన, స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చుకుని …
దాని పైన ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా, సుఖంగా
ఉండే విధంగా కూర్చోవాలి.
ఆ తర్వాత ఇంద్రియాలనూ, మనస్సునూ ప్రాపంచిక విషయాలనుండి మళ్ళించి …
మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానయోగాన్ని అభ్యసించాలి …
ధ్యానయోగసాధన చెయ్యాలి.
దీనికోసం శ్వాసను గమనించాలి …
శ్వాసను మాత్రమే గమనించాలి … గమనిస్తూ … ఉండాలి.
మధ్యమధ్యలో ప్రాపంచిక సంబంధిత ఆలోచనలు ఏవేవి వచ్చినా …
మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదకే మరల్చాలి.
అప్పుడు ఇంద్రియ, మనో వ్యాపారాలన్నీ అరికట్టబడతాయి.
సహజంగానే ఆలోచనారహిత స్థితికి చేరుతాం …
ధ్యానస్థితికి చేరుతాం …
అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది.
ఎన్నో జన్మలలోని కుకర్మల కారణంగా …
అంతరంగం అన్నది విశేషంగా అశుద్ధం అయి వున్నప్పుడు …
ఈ వర్తమాన జన్మలోని విశేష ధ్యానసాధన ద్వారానే మరి
ఆ అంతరంగం పరిశుద్ధం అయ్యేది.
దీనినే “ ధ్యానయోగసాధన ” అంటాం.