భగవద్గీత 6-5

ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |     

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః ||

పదచ్ఛేదం

ఉద్ధరేత్ఆత్మనాఆత్మానంఆత్మానంఅవసాదయేత్ఆత్మాఏవహిఆత్మనఃబంధుఃఆత్మాఏవరిపుఃఆత్మనః

ప్రతిపదార్థం

ఆత్మనా = తనచేత ; ఆత్మానం = తనను ; ఉద్ధరేత్ = ఉద్ధరించుకోవాలి ; ఆత్మానం = తనను ; న అవసాదయేత్ = అధోగతి కానీయరాదు ; హి = ఎందుకంటే ; ఆత్మా ఏవ = తానే ; ఆత్మనః = తనకు ; బంధుః = బంధువు ; ఆత్మా ఏవ = తానే ; ఆత్మనః = తనకు ; రిపుః = శత్రువు.

తాత్పర్యం

ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే గానీ ఆత్మపతనం చేసుకోకూడదు ; ఆత్మకు ఆత్మయే బంధువుఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి వుంది. ”

వివరణ

ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి

ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు.

ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు

ఎవరికి నిద్రవస్తే వారే నిద్రపోవాలి

ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి

ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి.

ఒకరు చక్కగా ధ్యానసాధన చేసి యోగియై

ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే

ఒకరి గొప్పతనం ఇంకొకరిది ఎప్పటికీ కాజాలదు.

మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి

మన కర్మలను మనమే సరిచేసుకుంటూ వుండాలి.

ధ్యానంలో నిమగ్నమై ధ్యానకర్మ చేసుకుంటూ వుండాలి.

తద్ద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ వుంటుంది.

అప్పుడుఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది !

అలా కాకుండా సమయాన్ని వృథా చేస్తున్నామంటే

మన ఆత్మను మనమే అవసానదశకు తీసుకువెళ్తున్నట్టు

అలాంటప్పుడు మనకు మనమే శతృవుగా అవుతాం.

ఏ లోకంలో వున్నా, ఏ కాలంలో వున్నా,

మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలం.

 కృతయుగంలో వున్నా, “ కలియుగంలో వున్నా

భూలోకంలో వున్నా, “ సత్యలోకంలో వున్నా

శైశవాత్మదశలో వున్నా, “ వృద్ధాత్మదశలో వున్నా

జ్ఞానిగా వున్నా, “ అజ్ఞానిగా వున్నా

పండితుడుగా వున్నా, “ పామరుడుగా వున్నా

మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం.

మన నోటిలోని మాటే మన నుదుటి మీద వ్రాత !

మన భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ వుంటాయి !

మన ఆలోచనలతోనే,

మన మాటలతోనే,

మన చేతలతోనే,

మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము

లేదా దిగజార్చుకుంటున్నాం.

ప్రతి క్షణాన్నీ పిండుకోవాలి

సద్వినియోగం చేసుకోవాలి

శ్వాసాభ్యాసంచేస్తూ తపస్సులో ఉండాలి.

స్వాధ్యాయంచేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉందో

అంత జ్ఞానాన్నీ సమీకరించుకోవాలి.

అందరిలో దైవాన్ని చూస్తూ, అందరినీ సమానంగా గౌరవిస్తూ,

ప్రేమిస్తూ … “ ఈశ్వరప్రణిధానంలో ఉండాలి.

ఉత్తములైనవారు అమూల్యమైన కాలాన్ని ఎప్పుడూ వృథాచేయరు

సద్వినియోగం చేసుకుంటారు.

అందరిచేతా కాలాన్ని సద్వినియోగం చేయించేవాళ్ళు ఉత్తమోత్తములు

మరి పురుషోత్తములు !