భగవద్గీత 5-10
“ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః | లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || ” |
పదచ్ఛేదం
బ్రహ్మణి – ఆధాయ – కర్మాణి – సంగం – త్యక్త్వా – కరోతి – యః – లిప్యతే – న – సః – పాపేన – పద్మపత్రం – ఇవ – అంభసా
ప్రతిపదార్థం
యః = ఎవడైతే ; కర్మాణి = కర్మలనన్నింటిని ; బ్రహ్మణి, ఆధాయ = భగవదర్పణంచేసి ; సంగం, త్యక్త్వా = ఆసక్తిని త్యజించి ; కరోతి = (కర్మలను) ఆచరిస్తున్నాడో ; సః = ఆ పురుషుడు ; అంభసా = నీటిచేత ; పద్మపత్రం, ఇవ = తామరాకులాగా ; పాపేన = పాపాలచే ; న, లిప్యతే = తాకబడడు
తాత్పర్యం
“ ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి, ఆసక్తిని విడిచి ఆచరిస్తారో, అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువులలాగా పాపం అంటుకోదు. ”
వివరణ
కర్మఫలం మీద ఆసక్తిని గాని … కోరికను గాని … లేకుండా,
‘ నేను ’ అనే కర్తృత్వ భావన ఎంతమాత్రం లేకుండా,
కర్మలు చేస్తూ ఉంటే … కర్మతో బంధం ఏర్పడదు.
కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మఫలితాలు అయిన
పాప, పుణ్యాలు ఏవీ మనల్ని అంటుకోవు.
నీటిలోనే పుట్టి, నీటిలోనే పెరిగి, నీటిలోనే నశించి పోయే తామరాకును
ఆ నీరు ఎంతమాత్రం తడుపలేనట్టే …
ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే నివశిస్తూ కూడా …
జ్ఞాని అయినవాడు తాను ఆచరించే ‘ నిష్కామ కర్మాచరణ ’
విధానం ద్వారా …
పాపపుణ్యాలు … మొదలైన ద్వంద్వాలనుండి విముక్తుడై …
బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు.
“ తామరాకు మీద నీటిబొట్టులాగా ” జీవించే మానవ జీవితమే ఆధ్యాత్మిక జీవితం.