భగవద్గీత 4-22
“ యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః | సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాஉపి న నిబధ్యతే || ” |
పదచ్ఛేదం
యదృచ్ఛాలాభసంతుష్టః – ద్వంద్వాతీతః – విమత్సరః – సమః – సిద్ధౌ – అసిద్ధౌ – చ – కృత్వా – అపి – న – నిబధ్యతే
ప్రతిపదార్థం
యదృచ్ఛాలాభసంతుష్టః = కోరుకోకుండానే లభించిన వస్తువులతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు ; విమత్సరః = ఎవరి పట్లా లేశమాత్రమైనా ఈర్ష్య లేకుండా ; ద్వంద్వాతీతః = సుఖదుఃఖాలను అతిక్రమించినవాడు ; సిద్ధౌ = ప్రాప్తిలోనూ ; అసిద్ధౌ = అ ప్రాప్తిలోనూ ; సమః = సమబుద్ధి కలవాడు ; కృత్వా, అపి = కర్మలు చేసినప్పటికీ ; న, నిబధ్యతే = బంధింపబడడు
తాత్పర్యం
“ కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడూ, ఎవరి పట్లా లేశమాత్రమైనా ఈర్ష్య లేనివాడూ, ప్రాప్తం లోనూ, అప్రాప్తం లోనూ సమబుద్ధి కలవాడూ … కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. ”
వివరణ
“ కోరి సాధించరాదు ;
కోరక వచ్చినది కాదనరాదు ;
వస్తూంటే వస్తోందని సంబరపడరాదు ;
పోతూ వుంటే పోతోందని బాధ పడరాదు ” అని …
కర్నూలు సదానందయోగి 1981 లో నాకు చేసిన మహా ప్రబోధం !
అడగకుండా మనకు ఇచ్చిన దానితో, అంటే అనాయాచితంగా మనకు లభించినదానితో ఎల్లప్పుడూ తృప్తి అనుభవించాలి.
ఎదుటి వాళ్ళను విసిగించి, వెంటపడి పీక్కు తినడం వుండరాదు.
పని జరగడానికి కష్టపడాలి !
కానీ … పని జరిగినా జరక్కపోయినా చలించకూడదు !
తలపెట్టిన కార్యం సిద్ధించినా, సిద్ధించక పోయినా…
ఫలితం వచ్చినా, రాకపోయినా పని చేయడమే మన వంతు.
దాని ఫలితం పైన మనకు అధికారం లేదు.
ఈ విధంగా జీవించడమే బంధ విమోచన మార్గం.
ధ్యాన యోగసాధన ద్వారానే సమ్యక్ జ్ఞానం లభ్యం !
ఈ జ్ఞానం లభ్యమైన తర్వాతే సరైన కర్మాచరణం …
ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైన కర్మాచరణ సాధ్యం.