అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం

 

ఆత్మవికాసం కోసం ఆత్మతో, ఆత్మ సమక్షంలో జరిగే ప్రక్రియనే ‘ధ్యానం’ అంటారు ; బుద్ధుడు ప్రబోధించిన ‘ఆనాపానసతి’ ధ్యానం ఉత్తమమైనది ; మనిషికి వాక్శుద్ధి ప్రధానం. ధ్యానంతో మానవుడు దివ్యుడవుతాడు.

“యోగం అంటే కలయిక” … మనస్సు – శరీరంతో కలిస్తే ‘కర్మయోగం’ ; మనస్సు – బుద్ధితో కలిస్తే ‘ జ్ఞానయోగం ‘ ; బుద్ధి – అత్మతో కలిస్తే ‘రాజయోగం’.

పరిపరివిధాల పరిభ్రమించే మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలి ; అది ధ్యానం ద్వారానే సాధ్యం ; కేవలం వాక్కుల వలన ఎవ్వరూ జ్ఞానులు కాలేరు ; స్వయం సాధన వల్లనే జ్ఞానం సిద్ధిస్తుంది ; ఎవరి జీవితానికి వారే నిర్దేశకులు ; ధ్యాన సాధన ద్వారానే శాశ్వత ఆనందం పొందగలం ; కారణం లేకుండా ఏ కార్యమూ వుండదు ; అదే పరమ విజ్ఞాన సారం.

యోగాలన్నింటిలో ‘రాజయోగం’ గొప్పది, అదే ‘శ్వాస మీద ధ్యాస’. మరణానికి వెరవని వారే ఆత్మజ్ఞానులు.

జ్ఞానం పరిపూర్ణంగా వుంటే కర్మ పరిపూర్ణంగా వుంటుంది ; ‘శుభం’ , ‘అశుభం’ అన్నవి చచ్చిపోతేనే జ్ఞానం ఉదయిస్తుంది ; ఎవరికి వారు పరతంత్రం వదిలి స్వతంత్రంగా ఎదగాలి, జీవించాలి.

గురువు కేవలం మార్గనిర్దేశకుడు మాత్రమే. గురువు కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలడు. కార్యకారణ ధర్మాలను వివరించడం మాత్రమే గురువు వంతు.

ఏ రంగంలోనైనా అగ్రగాములం కావాలంటే ధ్యాన సాధన చక్కగా ఉపయోగపడుతుంది ; ధ్యానం ప్రతిఒక్కరి జీవితంలో నిత్యక్రియ కావాలి.

కృష్ణుడంటే నిత్యనూతనంగా ఉండేవాడు ; అందరూ కృష్ణుడిలా వుండాలి.

యోగం అంటే నిత్యమూ కర్మ చేయడం ; అకర్ములుగా ఎప్పుడూ ఉండకూడదు ; కర్మ ఫలితాలు ఆశిస్తే అనివార్యంగా దుఃఖం సంభవిస్తుంది.