“మూఢభక్తి . . సద్యోభక్తి”
“భక్తి” అనేది రెండు దశలలో వస్తుంది ఒకటి జీవాత్మ యొక్క శైశవదశలో ; రెండోసారి జీవాత్మ యొక్క పరిణామక్రమంలో అంతిమదశగా
ప్రాథమిక దశలోని విద్యార్థులకు “మూఢభక్తి” తప్పనిసరి “మూఢభక్తి” అంటే “దేవుడు ఎక్కడో వున్నాడు” అనుకోవటం ; ఆ రాముణ్ణీ, ఆ అల్లానూ, ఆ యెహోవానూ కొలవటం ; రామకోటి వ్రాయడం, వ్రతాలు చేయడం ; “పూజలు” , ప్రార్థనలు” అనడం ; “అభిషేకాలు” , “అర్చనలు” , “తద్దినాలు” అనడం ; ప్రదక్షిణలు, తీర్థయాత్రలు చేయడం ; వాస్తవానికి ఇవన్నీ ఒకానొక ఆత్మ యొక్క శైశవదశలోని తమోగుణాన్ని తీసివేసే చర్యలే గానీ “సద్యోముక్తి దాయకాలు” ఎంత మాత్రం కావు
శైశవదశలో “సద్యోభక్తి” అన్నదే అనవసరం తమోగుణప్రధానులకు పైవన్నీ తప్పనిసరి . . ఎందుకంటే వాటి వల్ల తమోగుణాన్ని వదిలించుకుని రజోగుణంలో ప్రవేశిస్తారు
“తమోగుణప్రధానులు” అంటే “బుద్ధి ఇంకా వికసించనివారు” అయితే “బుద్ధిజీవులు” . . అంటే ఆత్మపరంగా శైశవదశ దాటినవారు కూడా ఇంకా పై క్రియలే చేస్తూ వుంటే వారిని “భక్తిరోగులు” అంటారే కానీ “భక్తియోగులు” అని అనరు
అయితే, జీవాత్మ యొక్క పరిణామక్రమంలో అంతిమదశగా వచ్చే భక్తి “సద్యోభక్తి”. “సద్యోభక్తి” అంటే సకల ప్రాణికోటినీ, తననూ కూడి భగవంతుడిగా గ్రహించి అందరిపట్లా, అన్నింటిపట్లా సదా ఆదర, గౌరవభావంలో ఉండడం.
- కర్మకాండలు, అంటే . . “రిచ్యువల్స్” , అనేవి ఒకింత తెలివి వస్తూనే వదిలిపెట్టేయాలి; బొత్తిగా తెలివిహీనులకు మాత్రం అవి ఒకింత “ఓకే”
- అయితే, ఒకింత తెలివి వస్తూనే, ఆ తెలివికి పదును పెట్టడానికీ, దానిని అభివృద్ధి చేయడానికీ, ధ్యాన – జ్ఞానయోగాలే శరణ్యం ; ధ్యానయోగం, జ్ఞానయోగం అన్నవే సద్యోభక్తికి దారితీస్తాయి.