భగవద్గీత 4-5

“ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||

 

పదచ్ఛేదం

బహూని – మే – వ్యతీతాని – జన్మాని – తవ – చ – అర్జున – తాని – అహం – వేద – సర్వాణి – న – త్వం – వేత్థ – పరంతప

ప్రతిపదార్థం

పరంతప = శతృవులను తపింప చేసేవాడా ; అర్జున = అర్జునా ; మే = నా యొక్క; చ = మరి ; తవ = నీ యొక్క ; బహూని = ఎన్నో ; జన్మాని = జన్మలు ; వ్యతీతాని = గడచిపోయాయి ; తాని సర్వాణి = వాటినన్నింటినీ ; త్వం = నువ్వు; న వేత్థ = ఎఱుగవు ; అహం వేద = నేను ఎఱుగుదును.

తాత్పర్యం

“ ఈ జన్మకన్నా ముందే నీకు నాకూ అనేకానేక జన్మలు గడిచాయి. అవి నాకు తెలుసు; నీకు తెలియవు. ”

వివరణ

ప్రతి మనిషీ తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు ;

భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే వున్నది జన్మపరంపర.

జీవితానికి ఎన్ని కోణాలో, జన్మపరంపరలో అన్ని జన్మలు తప్పవు కదా …

అన్ని కోణాలనూ దర్శిస్తేనే “ పరిపూర్ణ మానవుడు ” అవుతాడు !

మొట్టమొదట శైశవాత్మ … infant soul … గా మానవ శరీరంలో ప్రవేశిస్తాడు …

తరువాత బాల్య ఆత్మ baby soul గా కొన్ని జన్మలు గడుస్తాయి.

బాల్య ఆత్మ నుండి యవ్వనాత్మ … young soul … గా కొన్ని జన్మలు …

దానినుండి ఇంకొన్ని జన్మలలో పరిణితి చెందిన ప్రౌఢ ఆత్మ mature soul … గా

ఆ తరువాత వృద్ధ ఆత్మ old soul … గా ఇంకొన్ని జన్మలు,

విముక్త ఆత్మ … transcendental soul గా మరికొన్ని జన్మల తరువాత …

చివరికి పూర్ణాత్మ infinite soul … గా మారి …

ఇంక జన్మలు లేకుండా చేసుకుని … ఈ లోకంలో

తన కార్యక్రమాన్ని ముగించుకుని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది.

జన్మపరంపరలోని తుది దశలలో తాను ఎవరో తెలుసుకోవాలని

మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసువుగా మారతాడు.

జిజ్ఞాసువు ఒకానొక గురువుద్వారా ధ్యాన మార్గం తెలుసుకుని …

ధ్యాన సాధన చేసి … ఆత్మజ్ఞానం పొందుతాడు.

సదా దేహం వేరు, దేహి వేరు ;

దేహి అనేకానేక జన్మలు తీసుకుంటుంది. 

చివరాఖరిగా “ నేను ‘దేహం’ కాదు … ‘దేహి’ ” అని 

అర్థం అవుతుంది.

కనుక ఒక యోగికి … ఒక ఆత్మజ్ఞానికి … 

తన జన్మలు తెలిసుంటాయి … 

ఇతరుల జన్మలూ తెలిసుంటాయి.

యోగి కానివాడికి ఇవేవి తెలియవు.

కనుకనే అనేకమయిన ప్రశ్నలతో 

సతమతం అవుతూంటాడు.