భగవద్గీత 3-40
“ ఇంద్రియాణి మనో బుద్ధి రస్యాధిష్ఠానముచ్యతే | ఏతైర్విమోహయత్యేష జ్ఞాన మావృత్య దేహినమ్ || ” |
పదచ్ఛేదం
ఇంద్రియాణి – మనః – బుద్ధిః – అస్య – అధిష్ఠానం – ఉచ్యతే – ఏతైః – విమోహయతి – ఏషః – జ్ఞానం – ఆవృత్య – దేహినం
ప్రతిపదార్థం
ఇంద్రియాణి = ఇంద్రియాలు ; మనః = మనస్సు ; బుద్ధిః = బుద్ధి ; అస్య= దీని యొక్క ; అధిష్ఠానం = ఆశ్రయం ; ఉచ్యతే = (అని) చెప్పబడుతోంది ; ఏషః = ఈ కామం ; ఏతైః = వాటి ద్వారా ; జ్ఞానం = జ్ఞానాన్ని ; ఆవృత్య = కప్పివేసి ; దేహినం = జీవాత్మను ; విమోహయతి = మోహిస్తుంది
తాత్పర్యం
“ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి … ‘ఇవన్నీ కామానికి ఆశ్రయాలు’ అని చెప్పబడుతున్నాయి ; ఆ ఇంద్రియాలలో కామం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరచి జీవాత్మను మోహింపజేస్తుంది. ”
వివరణ
“ ఆత్మ ” అనే నిప్పు మీద వున్న నివురు మూడు పొరలు:
మూడు నివురుల్లో, మూడు ఆవరణల్లో, మూడు పొరల్లో వున్నాం మనం …
- ఇంద్రియాలు 2. మనస్సు 3. బుద్ధి
ఇక్కడ “ బుద్ధి ” అంటే “ సంఘమిచ్చిన బుద్ధి ” అని అర్థం.
“ సమాజం నుంచి అరువు తెచ్చుకున్న బుద్ధి ” అని అర్థం.
ఈ “ బుద్ధి ” మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు.
ఈ బుద్ధి ఆత్మజ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కాదు !
ఓ మూర్ఖ సమాజం కేవలం “ ఓ మూర్ఖమైన బుద్ధి ” నే ప్రసాదిస్తుంది !
ఎలాగైతే వైద్య శాస్త్రజ్ఞులు “ మాంసం తినండి ” అని చెప్తారో …
“ అలాంటి బుద్ధి ” అన్నమాట !
ఎలాగైతే పూజార్లు “ విగ్రహాలను ఆరాధించండి ” అని చెప్తారో …
“ అలాంటి బుద్ధి ” అన్నమాట !
ఎలాగైతే డాక్టర్లు “ మీ రోగాలకు మా దగ్గర మందులున్నాయి ”
అని అంటారో “ అలాంటి బుద్ధి ” అన్నమాట !
సంఘం ఇచ్చిన “ బుద్ధి ”ని బట్టే మన మనః చేష్టలు వుంటాయి !
“ ఇంద్రియాలు ” – “ మనస్సు ” – “ బుద్ధి ” … ఈ మూడూ కూడా కామ, క్రోధ, విశృంఖలత్వాలకు ఆశ్రయాలు. ఇవి జీవాత్మను కప్పేసి, మరుగు పరచి, మోహింప చేస్తూంటాయి !
“ మోహం ” అంటే “ అతి ”, “విపరీతం “ మోహింపజేస్తూంటాయి ” అంటే “ అతి చేయిస్తూంటాయి ”; “ విపరీత చేష్టలు చేయిస్తూంటాయి ” అని అర్థం అన్నమాట.