భగవద్గీత 3-35

“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

 

పదచ్ఛేదం

శ్రేయాన్ – స్వధర్మః – విగుణః – పరధర్మాత్ – స్వనుష్ఠితాత్ – స్వధర్మే – నిధనం – శ్రేయః – పరధర్మః – భయావహః

ప్రతిపదార్థం

స్వనుష్ఠితాత్ = చక్కగా ఆచరింపబడిన ; పరధర్మాత్ = ఇతరుల ధర్మం కన్నా ; విగుణః = గుణరహితమైనప్పటికీ ; స్వధర్మః = స్వీయ ధర్మం ; శ్రేయాన్ = అత్యుత్తమమైనది ; స్వధర్మే = తన ధర్మంలో ; నిధనం = చనిపోవడం ; శ్రేయః = ఉత్తమమైనది ; పరధర్మః = ఇతరుల ధర్మం ; భయావహః = భయంకరమైనది.

తాత్పర్యం

“ చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది ; స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే ; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది. ”

వివరణ

“ స్వధర్మం ” అంటే “ ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో వున్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్నమాట ” …

“ పరధర్మం ” అంటే “ ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి 

ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు ” అన్నమాట …

మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి

ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది … అదే “ స్వధర్మం ” అవుతుంది.

ఇతరులకు నిర్దేశించబడినవి,

మరి మనకు నిర్దేశించబడనిది అయినదే “ పరధర్మం. ”

మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం …

ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం … “ పరధర్మపాలన ” అవుతుంది.

“ పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం ” సబబు కాదు …

పులి జీవితంలా ‘నక్క జీవితం’ ఉంటే నక్క నష్టపోతుంది …

‘ నక్క దశ ’లో వున్నప్పుడు నక్కలానే జీవించాలి …

స్వధర్మానికి వ్యతిరేకంగా ‘ ఓ నక్క ’ జీవించడానికి యత్నిస్తే ఎన్నో నక్క

జన్మలు తప్పవు !

స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే

‘ ఒక్క నక్క జన్మ ’తోనే సరిపోతుంది !

ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది.

పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే 

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది.

ఒక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసినా,

కుక్క ఊరుకోవడంతో … గాడిద …

కుక్క పని తాను చెయ్యబోయి … ఓండ్రపెట్టి …

యజమానితో చావుదెబ్బలు తిన్నది.

మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు.

కానీ, ముందే దానికోసం ప్రాకులాడడం …

“ రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం ” వంటిది …

క్రిందపడి కష్టాలు కొని తెచ్చుకుంటాం.

“ గురువు చేసినట్లు ” చెయ్యొద్దు …

“ గురువు చెప్పినట్లు ” చెయ్యాలి !

విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం …

దానిని సరిగ్గా ఆచరించడం ధర్మం.

జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది.

ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం.

ధర్మమే శాశ్వతం … ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలకూడదు.

ఎవరి ధర్మాన్ని వాళ్ళు … అది విశిష్టగుణ రహితం అయినప్పటికీ …

“ అల్పగుణి ” అయినప్పటికీ … దానినే అనుసరించాలి …

“ జయ విజయులు ” తమ అల్పగుణాన్ని భయరహితులై, సంకోచరహితులై

ఆశ్రయించి మూడు జన్మలలోనే కడతేరినట్లు పురాణగాథ వున్నది కదా !

వుండవలసింది మరి భయరహితం …

సంకోచరహితం …

సదా, సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం !

స్వధర్మపాలనలో మరణం సంభవించినా మేలే ! 

స్వధర్మపాలనలో మరణం సంభవించినా మేలే !