భగవద్గీత 3-27

“ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |

అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||

 

పదచ్ఛేదం

ప్రకృతేః – క్రియమాణాని – గుణైః – కర్మాణి – సర్వశః – అహంకారవిమూఢాత్మా – కర్తా – అహం – ఇతి – మన్యతే

ప్రతిపదార్థం

కర్మాణి = సకల కర్మలలో ; సర్వశః = అన్ని విధాలా ; ప్రకృతేః = ప్రకృతి యొక్క ; గుణైః = గుణాల ద్వారా ; క్రియమాణాని = చేయబడుతూన్న ; కర్మణి = కర్మలను ; అహంకారవిమూఢాత్మా = అహంకారంతో వివేకశూన్యమైన మనస్సు వున్నవాడు ; “అహం కర్తా” = “నేనే చేస్తున్నాను” ; ఇతి = అని ; మన్యతే =భావిస్తాడు

తాత్పర్యం

“ సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి ; అయినా, అహంకారంతో వివేకశూన్యమైన మనస్సు గలవాడు ‘ అన్నీ నేనే చేస్తున్నాను ’ అనుకుంటాడు. ”

వివరణ

రెండు వున్నాయి: 

1.బహిః కార్యకలాపాలు

2.అంతర్ గుణాలు

పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి …

మనిషి యొక్క స్వభావం, గుణాలు ఏర్పడతాయి ;

ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటూంటాయి.

కనుకనే మనిషి యొక్క ‘ వర్తమాన గుణం ’ అన్నది …

అనేకానేక జన్మల కర్మల ఫలితం !

వాసనాక్షయం జరిగే వరకూ …

గుణరహితుడు అయ్యేవరకూ …

జీవి అనేక జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే … 

ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా, 

హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం …

గుణాలు అన్నవి క్షణక్షణానికీ మారవు !

నిరంతర బాహ్య కర్మల … కర్మఫలాల సముద్రంలో …

జీవాత్మల అంతర్ గుణాలు అత్యంత మెల్లగా మారుతూ వుంటాయి !

గుణాలు జన్మ జన్మకూ కేవలం

‘ ఒక మిల్లీ మీటర్ ’ చొప్పున మాత్రమే మారుతూ వుంటాయి.

కనుక, కర్మలు నిందనీయం కాజాలవు …

మరి గుణాలు నిందనీయం కాజాలవు …

‘ నిందనీయం ’ కాని వాటిలో మనం తాదాత్మ్యం చెందడం ఎంతటి మూర్ఖత !

ప్రకృతితో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం ఆరోపించినా,

ఆరోపించకున్నా … పరమశోకితుడు అవుతున్నాడు !

“ ప్రక్క వాడు చేస్తున్నాడు ” అని కానీ, “ నేను చేస్తున్నాను ” అని కానీ భావిస్తే

ఇది వివేక శూన్యత !

“ ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి ”

అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం …

అంతా “ అలా, అలా ” జరుగుతూనే వున్నాయి కానీ,

“ చేసేవాడూ ”, “ చేయించేవాడూ ” ఎవ్వరూ లేడు !

మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి …

సునిశిత వివేకి కావాలి …

‘ నేను ’, ‘ అతడు ’ అన్న భావనలే వివేక శూన్యత !

“ ఈ విధంగా జరుగుతోంది ” అన్నదే మహావివేకం …

అహంకారమే మూఢత …

అహంకార రహితుడే వివేకాత్ముడు !

 త్యాగగుణం – దధీచిమహర్షి

రజోగుణం – విశ్వామిత్రుడు

క్షమాగుణం – జమదగ్నిమహర్షి

క్రోధం – దుర్వాసమహర్షి