భగవద్గీత 3-24

“ ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |

సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః ||

 

పదచ్ఛేదం

ఉత్సీదేయుః – ఇమే – లోకాః – న – కుర్యాం – కర్మ – చేత్ – అహం – సంకరస్య – చ – కర్తా – స్యాం – ఉపహన్యాం – ఇమాః – ప్రజాః

ప్రతిపదార్ధం

చేత్, అహం = ఒకవేళ నేను ; కర్మ = కర్మను ; న, కుర్యాం = చేయకపోతే ; ఇమే, లోకాః = ఈ లోకాలు ; ఉత్సీదేయుః = శిథిలమౌతాయి ; చ = మరి ; సంకరస్య = సంకరానికి ; కర్తా = కర్తను ; స్యాం = అవుతాను ; ఇమాః, ప్రజాః = ఈ ప్రజలందరినీ ; ఉపహన్యామ్ = పాడుచేసిన వాడిని అవుతాను.

తాత్పర్యం

“ నేనే గనుక కర్మలు చేయడం మానివేస్తే, లోక వ్యవహారాలన్నీ శిథిలమౌతాయి; తద్వారా సంకరం, కర్మభ్రష్టతా కలుగుతాయి ; ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడనవుతాను. ”

వివరణ

ఇతరులకు గురువు బాధ్యతను తీసుకున్న నేను …

ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను … 

కర్మలను చెయ్యడం మానివేస్తే … ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు.

నా దారిలోనే నడుస్తారు.

వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలివేసి …

అకర్మణ్యులవుతారు.

ధర్మభ్రష్ఠులు, కర్మభ్రష్ఠులూ అవుతారు …

వ్యర్థ జీవనం గడుపుతారు.

తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని !