భగవద్గీత 3-21

“ యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః |

స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే ||

 

పదచ్ఛేదం

యత్ – యత్ – ఆచరతి – శ్రేష్ఠః – తత్ – తత్ – ఏవ – ఇతరః – జనః – సః – యత్ – ప్రమాణం – కురుతే – లోకః – తత్ – అనువర్తతే

ప్రతిపదార్ధం

శ్రేష్ఠః = ఉత్తముడు ; యత్, యత్ = ఏ ఏ విధంగా ; ఆచరతి = ఆచరిస్తాడో ; ఇతరః = ఇతరులు ; జనః = జనులు ; తత్, తత్ = అదే విధంగా ; ఏవ = మాత్రమే ; సః = అతడు ; యత్ = దేనిని ; ప్రమాణం = ప్రమాణంగా ; కురుతే = చేస్తున్నాడో ; లోకః = సమస్త లోకం ; తత్ = దానినే ; అనువర్తతే = అనుసరిస్తోంది.

తాత్పర్యం

“ ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు; ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. ”

వివరణ

ఉత్తములు మార్గం చూపేవారు.

అన్యులు, అనుత్తములు … ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు.

ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్తలోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది.

ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో …

లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది.

మానవుడు ప్రధానంగా అనుకరణ శీలి.

ప్రజల నాయకులనూ … శిష్యులు గురువులనూ …

పిల్లలు పెద్దలనూ అనుసరిస్తూంటారు.

శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక “ అది సరి అయినది అయి ఉంటుంది ”

అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు.

జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి

తదుపరి జన్మల్లో మానవ జన్మలెత్తుతాయి.

మనం గొప్పవాళ్ళం అయినప్పుడు

మన చుట్టుప్రక్కలవాళ్ళు సహజంగానే మనవల్ల ప్రభావితం అవుతూ

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ వుంటారు.

మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం !