భగవద్గీత 3-17
“ యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః | ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే || ” |
పదచ్ఛేదం
యః – తు – ఆత్మరతిః – ఏవ – స్యాత్ – ఆత్మతృప్తః – చ – మానవః – ఆత్మని – ఏవ – చ – సంతుష్టః – తస్య – కార్యం – న – విద్యతే
ప్రతిపదార్ధం
తు = కానీ ; యః = ఏ ; మానవః = మానవుడు ; ఆత్మరతిః ఏవ = ఆత్మలోనే రమిస్తూ ; చ = మరి ; ఆత్మతృప్తః = ఆత్మలోనే తృప్తి పొందుతూ ; చ = మరి ; ఆత్మని, ఏవ = ఆత్మలోనే ; సంతుష్టః = సంతోషిస్తూ ; స్యాత్ = వుంటాడో ; తస్య = వానికి ; కార్యం = చేయవలసిన కర్తవ్యం ; న విద్యతే = ఏదీ వుండదు.
తాత్పర్యం
“ ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో … అలాంటి ఆత్మజ్ఞానికి … ఇంక చేయవలసిన కర్తవ్యం ఏదీ వుండదు. ”
వివరణ
“ భౌతిక క్షేత్రం ”, “ ప్రాణశక్తి క్షేత్రం ”, “ భావనా క్షేత్రం ”, “ ఆత్మక్షేత్రం” …
ఈ నాలుగు క్షేత్రాలలో ప్రథమమైన మౌలికమైన క్షేత్రం … ఆత్మక్షేత్రం !
ఇది తెలుసుకున్న వాళ్ళనే “ ఆత్మజ్ఞానులు ” అంటాం.
వాళ్ళకు “ వేరే చేయవలసిన కార్యం ” అంటూ ఏదీ ఉండదు !
వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ వుంటారు;
వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ వుంటారు;
వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ వుంటారు;
కేవలం భౌతికక్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు
ఎప్పుడూ అసలు తృప్తిని పొందలేరు !
భౌతికక్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు
ఎప్పుడూ శాశ్వత సంతోషాన్ని పొందలేరు !
ఆదిశంకరాచార్యుల వారు కూడా అన్నారు కదా …
“ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి ఏవ ” …
“ ఎవరైతే ఎప్పుడూ ఆత్మ క్షేత్రంలోనే సదా క్రీడిస్తూ వుంటారో …
వారికే ఆనందం … ఆనందం … ఆనందం ” అని !