భగవద్గీత 3-14
“ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః | యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || ” |
పదచ్ఛేదం
అన్నాత్ – భవంతి – భూతాని – పర్జన్యాత్ – అన్నసంభవః – యజ్ఞాత్ – భవతి – పర్జన్యః – యజ్ఞః – కర్మ – సముద్భవః
ప్రతిపదార్ధం
భూతాని = సమస్త ప్రాణులు ; అన్నాత్ = అన్నం వల్ల ; భవంతి = కల్గుతున్నాయి ; పర్జన్యాత్ = వర్షం వల్ల ; అన్నసంభవః = అన్నం యొక్క ఉత్పత్తి ; పర్జన్యః = వర్షం ; యజ్ఞాత్ = యజ్ఞం వల్ల ; భవతి = పుడుతోంది ; యజ్ఞః = యజ్ఞం ; కర్మ సముద్భవః =విహితకర్మ వల్ల
తాత్పర్యం
“ సమస్త ప్రాణులూ ‘ అన్నం ’ నుంచి పుడ్తున్నాయి … అన్నోత్పత్తి ‘ వర్షం ’ వల్ల కలుగుతోంది; ‘ వర్షం ’ ‘ యజ్ఞం ’ వల్ల కలుగుతుంది ; ‘ యజ్ఞం ’ సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది.
వివరణ
“ అన్నం ” అంటే “ ఉడికించిన బియ్యం” కాదు …
భౌతికశరీరాన్ని “ అన్నమయకోశం ” అంటాం …
అంటే … “ అణు, పరమాణు సముదాయంతో కూడిన శరీరం ” అని అర్థం !
“ అన్నోత్పత్తి వర్షం వల్ల ” అన్నప్పుడు “ పదార్థం అన్నది శక్తి వల్ల ” అని అర్థం!
ఇక్కడ చెప్పబడిన “ వృష్టి ” … “ దివ్యచక్షువుతో చూడబడిన వృష్టి ”
అంటే … “ ఆకాశ గంగ ”, అంటే … “ కాస్మిక్ ఎనర్జీ ” అన్నమాట !
“ విశ్వశక్తి ” అన్నది ‘ నిస్వార్థ కర్మ ’ వల్లనే లభిస్తూ వుంటుంది.
నిస్వార్థ కర్మనే “ సత్‌కర్మ ” అని కూడా అంటాం.
కనుక “ అన్నం ” అంటే “ వుడికిన బియ్యం” కాదు …
“ వృష్టి ” అంటే “ చర్మచక్షువు ” తో చూసే నీటి వర్షం కాదు !
దివ్యచక్షువుతో చూస్తేనే తప్ప …
దివ్యజ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప …
భగవద్గీతలోని ఒక్క వాక్యం అన్నా అర్థం కావడం అసంభవం !
ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని,
మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు …
ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని,
మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు …
ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం ఆ భాష వచ్చినవాడు
ఎవ్వడూ లేశమాత్రం అయినా అర్థం చేసుకోజాలడు !
శ్రీ వేదవ్యాసులవారు అఖండమైన యోగీశ్వరులు …
మరి అద్వితీయ సంస్కృత పండితులు కూడా !
వారి గ్రంథాలను మనం వారి భావనలలో వున్నట్లు
అవగాహన చేసుకోవాలంటే
వారి అంత కాకపోయినా,
వారి కన్నా కొంచెం తక్కువ అయినా,
ధ్యానయోగసాధన అన్నది చేసి తీరవలసినదే !
వారి అంత కాకపోయినా కొంత అయినా
దివ్యచక్షువు మనదగ్గర వుండవలసినదే !