భగవద్గీత 3-11
“ దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః | పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ || ” |
పదచ్ఛేదం
దేవాన్ – భావయత – అనేన – తే – దేవాః – భావయంతు – వః – పరస్పరం – భావయంతః – శ్రేయః – పరం – అవాప్స్యథ
ప్రతిపదార్థం
అనేన = ఈ యజ్ఞం ద్వారా ; దేవాన్ = దేవతల్ని ; భావయత = ఉన్నతులుగా ; తే, దేవాః = ఆ దేవతలు ; వః = మిమ్మల్ని ; భావయంతు = ఉన్నతులుగా చేస్తారు ; పరస్పరం = ఒకరినొకరు ; భావయంతః = ఉన్నతులుగా తయారుచేసుకొన్నవారై ; పరం = ఉత్కృష్టమైన ; శ్రేయః = శ్రేయస్సును ; అవాప్స్యథ = పొందుతారు
తాత్పర్యం
“ మీరందరూ ఈ ‘యజ్ఞం’ ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే, ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు ; ఈ ప్రకారంగా ఒకరికొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. ”
వివరణ
రెండు లోకాలు ఉన్నాయి !
ఒకటి … దేవతల లోకం ! రెండు … మానవుల లోకం !
దేవతల లోకం దివ్యచక్షువుకే కనబడుతుంది !
అయితే, దివ్యలోకవాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు !
మానవుల యజ్ఞకార్యక్రమాలు దేవతలను
అమితంగా సంతోషపరుస్తూ వుంటాయి !
మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలను దుఃఖపెడుతూనే ఉంటాయి !
సంతోషం ఎప్పుడూ ఆత్మలను ఉన్నత పరుస్తుంది ;
దుఃఖం ఆత్మలను ఎప్పుడూ కృశింప చేస్తుంది.
ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞకార్యక్రమాల ద్వారా సంతోషంగా వుంటారో
అప్పుడు వారు మరింతగా మానవలోకాలకు సహాయం చేస్తారు.
మానవుల ద్వారా దేవతలూ, దేవతల ద్వారా మానవులూ …
పరస్పరం ఒకరినొకరు ఉన్నత పరచుకుంటూ ఉంటారు … యజ్ఞాల ద్వారా
యజ్ఞరహిత కర్మల ద్వారా … రెండు లోకాలూ విడిపోయి ఉంటాయి ;
యజ్ఞాల ద్వారానే రెండు లోకాలూ చేదోడు వాదోడుగా ఉంటాయి !